మేమింకా పిల్లులమే..పులులం కాదు!?

`కేటిఆర్‌ వ్యాఖ్యలు విచిత్రం.

`మాటకు ముందు మేం ఉద్యమ కారుల మంటారు.

`దేశ దేశాలు తిరిగి తెలంగాణకు పెట్టుబడులు తెచ్చామంటారు.

`హైద్రాబాద్‌ బ్రాండ్‌ పెంచామంటారు.

`రాజకీయాల ముచ్చట రాగానే కేసిఆర్‌ వస్తున్నారంటారు.

`కేసిఆర్‌ పేరు చెప్పుకోకుండా రాజకీయాలు చేయలేరా!

`కేసిఆర్‌ మా వెనుక లేకపోతే మాకు రాజకీయం లేదని ఒప్పుకున్నట్లేనా!

`అధికారంలో వున్నప్పుడు సిఎం కేసిఆర్‌ ప్రజల్లో రావాల్సిన అవసరం లేదన్నది కేటిఆర్‌ కాదా!

`ఇంత మంది మంత్రులు పని చేస్తున్నాం కనిపించడం లేదా!

`కేసిఆర్‌ ప్రజల్లోకి రాకపోతే అభివృద్ధి ఆగిపోయిందా? అన్నారు.

`ఒక దశలో కేటిఆర్‌ ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకున్నారు.

`ఎన్నికల ముందు పులి వస్తోందని చెప్పుకొని కాలం గడిపారు.

`పార్లమెంటు ఎన్నికల సమయంలో కేసిఆర్‌ వచ్చినా గెలిచింది లేదు.

`కేసిఆర్‌ వస్తేనే రాజకీయం చేయగలరా!

`ప్రజల మీద మీకు భరోసా లేదా?

`జనం మమ్మల్ని నమ్ముతారన్న విశ్వాసం మీకు లేదా!

`రాజకీయం కన్నా పరిపాలన చాలా కష్టం!

`పాలించే సమయంలో వున్న ధైర్యం ఇప్పుడు లేదా!

`పార్టీని గెలిపించే శక్తి లేదా!

`అధికారంలో వున్న నాడు ఉద్యమ కారులను దూరం పెట్టారు.

`వలస నేతలను అక్కున చేర్చుకున్నారు.

`అవకాశ వాదులు జారుకుంటున్నారు.

`ఇప్పుడు ఉద్యమ కారులను తోడు రమ్మంటున్నారు.

`తెలంగాణ ఆగమౌతుందని గగ్గోలు పెడుతున్నారు.

`మీరు గెలవడానికి మాత్రమే ఉద్యమ కారులు కావాలా?

`ఇప్పటికీ బిఆర్‌ఎస్‌ గ్రామ కమిటీలు లేవు.

`జిల్లా, మండల కమిటీలకు విలువ లేదు.

`నాయకులకు, కార్యకర్తలకు సమయమిచ్చే తీరిక లేదు.

`ఎక్స్‌ను నమ్ముకొని రాజకీయాలు చేస్తే సరిపోదు.

`ఎక్స్‌ ఖాతాలున్న వాళ్లు ఓట్లు కూడా వేయరు.

`ఎంత మంది బిఆర్‌ఎస్‌ నాయకులకు ఎక్స్‌ ఖాతాలున్నాయి.

`ఇప్పుడు కావాల్సింది ఆధిపత్య పోరు కాదు.

`సమిష్టి పోరు లేకుంటే గెలిచే అవకాశం లేదు.

`ఎవరిని కలవాలో అర్థం కాక కార్యకర్తలు తలలు పట్డుకుంటున్నారు.

`ఎవరిని కలిస్తే ఏ ముద్ర పడుతుందో అని భయపడుతున్నారు.

`దాని వల్ల తమ రాజకీయ భవిష్యత్తు ఎటు మలుపు తిరుగుతుందో అని ఆందోళన పడుతున్నారు.

`అందరం ఒక్కటే అని సంకేతాలు పంపలేకపోతున్నారు.

`విడదీసి రాజకీయం ఎప్పుడూ మోసమే!

`పార్టీ బలపడడానికి అవరోధమే!

`పండగ పూట కూడా నాయకులను కలవలేని దౌర్భాగ్యంలో వున్నారు.

`కేసిఆర్‌ పేరు చెబితే తప్ప రాజకీయం చేయలేకపోతున్నారు.

`కేసిఆర్‌ చరిత్రను ఎవరో తుడిచేస్తే పోదు.

`చరిత్రను కొత్తగా రాయాల్సిన అవసరం లేదు.

`యువతరంలో నమ్మకం కల్గించాలంటే కొత్త తరాన్ని ప్రోత్సాహించండి.

`పార్టీ కోసం ప్రాణం పెట్టిన వాళ్లను గుర్తించండి.

`ఇప్పటికైనా వారికి తగిన గుర్తింపునివ్వండి.

`గులాబీ జెండా మనందరిదీ అని వారిలో మరింత విశ్వాసం నింపండి.

`పార్టీ పటిష్ఠం కోసం పని చేస్తున్న వారికి స్వేచ్ఛనివ్వండి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

పిల్లలు తప్పటడుగులు వేసినప్పుడు తండ్రి రెండు చేతులు పట్టుకొని అడుగులు వేయడం నేర్పిస్తాడు. పిల్లలు అడుగులు వేయడం అలవాటు చేసుకోవడానికి ఒక చేతిని పట్టుకొని నడక నేర్పిస్తాడు. తర్వాత కొంత కాలానికి వదిలేస్తాడు. రాజకీయం కూడా అంతే. కేసిఆర్‌ ఉద్యమ స్వరూపం. పోరు చరిత్రను నిదర్శం. తెలంగాణ పోరాట చరిత్రకు నిలువెత్తుసాక్ష్యం. ఆయన ఎల్ల కాలం తమను నడిపించాలని ఆశించడం తప్పు. ఆయన చూపిన మార్గంలో అడుగులు వేస్తారో, పరుగులు పెడతారో అన్నది నిర్ణయించుకోవాల్సింది నాయకులే. బిఆర్‌ఎస్‌కు చెందిన ఎంత పెద్ద నాయకుడైనా, భవిష్యత్తులో ఎన్ని సంవత్సరాలైనా కేసిఆర్‌ పేరు చెప్పుకోకుండా రాజకీయం చేయలేరు. కాని ఎప్పటికీ ఆయన నాయకుల చేతిని పట్టుకొని ఇంకా నడవాలనుకోవడం నాయకుల ఆత్మస్ధైర్యాన్ని చూపించదు. కేటిఆర్‌, హరీష్‌రావులకు ప్రత్యేకంగా కేసిఆర్‌ ప్రతి క్షణం వెన్నంటి వుంటాడదన్న నమ్మకాన్ని మిగతా శ్రేణులకు కల్పించాలి. అంతే తప్ప ప్రతి సారి కేసిఆర్‌ వస్తాడు. కేసిఆర్‌ వస్తున్నాడు. ఉద్యమ సమయంలో కేసిఆర్‌ కొన్ని లక్షల మంది కేసిఆర్‌లను తయారు చేశారు. తెలంగాణ అని అనడానికి కూడా ఇష్టపడని నాయకలందరి చేత జై తెలంగాణ అనిపించాడు. ఆఖరుకు సమైక్యవాద ముసుగులో వున్నవారి చేత కూడా జై తెలంగాణ అనిపించారు. అదీ కేసిఆర్‌ నాయకత్వ పటిమ. జై తెలంగాణ అనకపోతే తెలంగాణలో ఓటు కూడా పడదన్న భయాన్ని చంద్రబాబు లాంటి వారిలో కూడా కల్గించాడు. అంతటి ధైర్యవంతుడు బిఆర్‌ఎస్‌కు మూల స్ధంభంగా వున్నాడు. ఇంకా ఆయన ప్రజల్లోకి రావాలి. ఆయనే బిఆర్‌ఎస్‌కు ఓట్లు వేయించాలి. ఆయన గెలిపిస్తేనే మేం గెలవాలి అని ప్రతీ సారి నాయకులు అనుకోవడం సరైంది కాదు. ఇంకా మీ కోసం కేసిఆర్‌ కష్టపడాలా? ఇంకా మిమ్మల్ని గెలిపించేందుకు కేసిఆర్‌ ఊరూరు తిరగాలా? కేసిఆర్‌ పేరు చాలు. ఆయన మాట మీ నోటి నుండి వస్తే చాలు. అంతే కాని ఆయన ఇంకా మీకోసం పనిచేస్తూ పోతే మీరెప్పుడు ఎదుగుతారు? మీరు పార్టీని ఎప్పుడు బలోపేతం చేస్తారు. రెండుసార్లు ఆయన ఒంటి చేత్తో బిఆర్‌ఎస్‌ను గెలిపించారు. ఇప్పుడు కూడా బలమైన ప్రతిపక్ష స్ధానంలో పార్టీని కూర్చోబెట్టారు. ఇంకా పులి వస్తుంది? పులి వచ్చిందటే కాంగ్రెస్‌ నాయకులు తోక ముడుస్తారు? అని చెప్పడం అంటే కేసిఆర్‌ తయారు చేసిన వాళ్లు పులులు కాదు..పిల్లులే అని మీరు పరోక్షంగా చెప్పాలనుకుంటున్నారా? కేసిఆర్‌ పరువు మీ చేజేతులా మీరే తీయాలనుకుంటున్నారా? అదేదో సినిమాలో కంటెంటు వున్న వాడికి కటౌట్‌ చాలు అన్నట్లు …బిఆర్‌ఎస్‌ రాజకీయానికి కేసిఆర్‌ కటౌట్‌ చాలు. కేసిఆర్‌ మీ కోసం జనాల్లోకి ప్రత్యేకంగా రావాల్సిన అవసరం లేదు. గత పార్లమెంటు ఎన్నికల ముందు అనవసరంగా కేసిఆర్‌కు బైటకు తీసుకొచ్చి ఆయన పరువు పోగొట్టారు. గతంలో ఎప్పుడూ లేని ఓటమిని చేజేతులా కేటిఆర్‌, హరీష్‌రావులే కట్టబెట్టారు. అధికారంలో వున్నంత కాలం మేం పులులమే అని చెప్పుకున్న కేటిఆర్‌ ఆనాటి మాటలు మర్చిపోయాడా? ముఖ్యమంత్రిగా వున్న సమయంలో కేసిఆర్‌ బైటకు రావడంలేదు. ప్రజలను కలవడం లేదు? కనీసం సెక్రెటెరియేట్‌ రావడంలేదు. ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదన్నప్పుడు కేటిఆర్‌ ఏం మాట్లాడారో మర్చిపోయారా? కేసిఆర్‌ బైటకు రాకపోతే పనులు ఆగిపోతున్నాయా? సంక్షేమ పధకాలు అందడం లేదా? అంటూ కారడ్డమాడిన సందర్భం కేటిఆర్‌ మర్చిపోయాడా? రాజకీయం కన్నా, ఏ నాయకుడికైనా పాలన కష్టతరమైంది. అలాంటి పాలన పదేళ్లు సాగించారు. కేటిర్‌, హరీష్‌రావులు పదేళ్లు మంత్రిగా పనిచేశారు. పాలనా యంత్రాంగంపై పూర్తి పట్టు సాధించారు. ఉద్యమ కాలంలోనే రాజకీయాలను పూర్తిగా ఆదీనంలోకి తీసుకున్నారు. అయినా ఇప్పటికీ కాంగ్రెస్‌, బిజేపిలను ఇద్దరు కలిసి ఎదుర్కొలేరా? ఇక్కడ ఆదిపత్యం ఎందుకు? పార్టీ అధికారంలో వుంటే అందరూ పులులే అవుతారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పిల్లులెలా అవుతారు? ముఖ్యమంత్రిగా వున్న సమయంలో బైటకు రాని కేసిఆర్‌ ఇప్పటికప్పుడు ఎందుకు బైటకు రావాలి? ఎన్నికల ముందు ఆయనే స్వయంగా ప్రజలకు చెప్పారు. గెలిపిస్తే పాలిస్తాం..లేకుంటే రెస్టు తీసుకుంటామన్నారు.బిఆర్‌ఎస్‌ను ఓడిస్తే ఏం జరగుతుందో కూడా తెలంగాణ భవిష్యత్తు ఎలా వుంటుందో కూడ చెప్పారు. ఇక్కడ కేసిఆర్‌ను తప్పుపట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఆయనను బైటకు రమ్మని అడిగే అర్హత కూడా ఎవరికీ లేదు. ఆయన చేయాల్సిందంతా చేశాడు. తెలంగాణ తెచ్చాడు. తెలంగాణకు తనశక్తి మేరు, శక్తి వంచన లేకుండా ఒక దారి చూపాడు. ఇప్పుడు ఆ దారిలో నడవాల్సిన బాద్యత కేటిఆర్‌, హరీష్‌రావులపై వుంది. ఆ బాధ్యతలను మోయాల్సిన సమయంలో కేసిఆర్‌ కావాలా? పదవులు అందుకున్నప్పుడు మాత్రం మీరు ముందుంటారా? ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఇంకా మేం కేసిఆర్‌ చాటు నాయకులమే అని చెప్పదల్చుకున్నారా? అలాంటప్పుడు ప్రజలు కేటిఆర్‌, హరీష్‌రావులను ఎందుకు నమ్మాలి? అన్న ప్రశ్న ఉత్పన్నం కాదా? ఇప్పటికీ కేసిఆర్‌ను కలవాలన్నా సగటు నాయకుడికి ఇబ్బందే. ఎదురౌతుంది. కేసిఆర్‌ బైటకు రావాలని ప్రజలు కూడా కోరుకోవడం లేదు. ముందు కేసిఆర్‌ను కలిసేందుకు క్యూలో వున్న నాయకులను కలిసేలా అవకాశం కల్పించండి. కేసిఆర్‌కు తమ సమస్యలు తెలియజేసేలా చూడండి. తర్వాత మీరు ప్రతి నాయకుడికి అప్పాయింటు మెంటు ఇవ్వండి. వారి సమస్యలకు అండగా వుండండి. క్షేత్ర స్ధాయి నుంచి బలంగా వున్నామని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. ట్విటర్లో స్పందిస్తే కార్యకర్తలు పనిచేయరు. గ్రామ స్దాయి నుంచి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేయండి. గ్రామ కమిటీలను ప్రకటించండి. జిల్లా, మండల, నియోజకవర్గ స్ధాయి కమిటీలను పూర్తి బాధ్యతలు అప్పగించండి. ఒక కార్యకర్త మాట్లాడితే అది కేటిఆర్‌ మాటే అన్నట్లు పార్టీ గుర్తించేలా స్వేచ్ఛనివ్వండి. అంతే కాని ఆధిపత్యపోరులో పార్టీని మరింత దిగజార్చకండి అని కార్యకర్తలే కోరుతున్నారు. కేటిఆర్‌, హరీష్‌రావులు పార్టీకి రెండు బలమైన సంభాలన్న సంకేతాలు పంపండి. ఇప్పటికే భిన్న దృవాలు అన్న ప్రచారమే వుంది. ఇద్దరి మధ్య అగాదమే వుందనుకుంటున్నారు. హరీష్‌రావును కలవాలంటే కూడా నాయకుల వెనకడుగు వేస్తున్నారు. హరీష్‌రావు కూడా నాయకులను కలిసేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. కారణం ఎక్కడ కేటిఆర్‌కు కోపం వస్తుందో అన్న సంశయం నాయకుల్లో ఎందుకు ఏర్పడుతోంది. ఇద్దరూ పార్టీకి రెండు కళ్లు. మనకు వ వుండే ఏ కంటికి ఇబ్బంది ఎదరైనా రెండో కంటి నుంచి కూడా కన్నీరు వస్తుంది. అలాగే పార్టీకి రెండు కళ్లుగా వున్న వాళ్లు ఇద్దరైనా చూపు ఒకటే అన్న సందేశాన్ని పంపండి. నాయకులకు అలాంటి సంకేతాలు పంపండి. ఇప్పటికీ అనేక అనుమానాలున్నాయి. పైకి ఇద్దరం ఒక్కటే అని చెప్పుకుంటే సరిపోదు. ఇద్దరూ కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారన్న నమ్మకం కార్యకర్తలకు బలంగా వెళ్లాలి. కేటిఆర్‌ వద్దకు వెళ్లిన నాయకులను హరీష్‌రావును కూడా కలవండని చెప్పగలగాలి. అప్పుడు శ్రేణుల్లో భరోసా కల్గుతుంది. అంతే కాని హరీష్‌రావు వద్దకు ఎవరు వెళ్తున్నారన్న విషయాలు ఆరా తీస్తూ కూర్చుంటే రాజకీయం ముందుకు సాగదు. అధికారంలో వున్నప్పుడు నాయకుల ఫోన్లు ట్యాపింగ్‌ చేశారన్న అపవాదులు వుండనే వున్నాయి. అసలు జరిగిందా? లేదా? అన్నది ఎవరూ పట్టించుకోరు. ప్రచారాన్ని మాత్రం ప్రజలు బలంగా నమ్ముతారు. ఇప్పటికైనా మేమిద్దరం ఒక్కటే అన్న సంకేతాలు ముందుగా కేటిఆర్‌ పంపాల్సిన అవసరం వుంది. బిఆర్‌ఎస్‌ మళ్లీ అదికారంలోకి వస్తే కేసిఆరే ముఖ్యమంత్రి అనుకున్నప్పుడు కేటిఆర్‌, హరీష్‌రావుల మధ్య ఆధిపత్యం అన్న ప్రస్తావన ఎందుకు? ఆ ప్రచారం సాగిస్తున్నదెవరు? ఈ విషయాలు కేటిఆర్‌కు తెలియక కాదు..అయినా ఎందుకు ఉపేక్షిస్తున్నారు..ఎందుకు క్లారిటీ ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు? ప్రజాస్వామ్య రాజకీయాలలో ప్రతిదానికి సమాదానం చెప్పాలి. బురదజల్లుతాం..మీరు కడుక్కోండంటే కడుక్కోవాలా? అంటే రాజకీయాలు చేయలేరు. వాటిపై మౌనంగా వుంటే ప్రజలు కూడా మెచ్చరు. ఉద్యమ కాలంలో తెలంగాణ కోసం ఎలా స్పందించారో…ఇప్పుడు రాజకీయం కోసం పార్టీ ఉనికి కోసం, భవిష్యత్తు కోసం స్పందించాలి. మేమిద్దరం ఒక్కటే..మనమంతా ఒక్కటే…మనంతా గులాబీ జెండా కుటుంబమే అని చెప్పినప్పుడే ప్రజలు కేటిఆర్‌ను, హరీష్‌ను నమ్ముతారు. అంతే కాని పదే పదే పులి వస్తుంది అనిచెప్పకండి. కేసిఆర్‌ కు కొత్తగా గొప్పదనాన్ని ఆపాదించాల్సిన అవసరంలేదు. మీరు పదే పదే గుర్తు చేస్తేనే ప్రజలు కేసిఆర్‌ను గుర్తుంచుకుంటారనుకోవద్దు. కేసిఆర్‌ ఎన్నితరాలైనా తెలంగాణ జనం గుండెల్లో వుండే నాయకుడు. దేవుడిని గుడి నుంచి బైటకు తెవాలనుకోవద్దు. ఆయన ఎక్కడుంటే అక్కడే గుడి..అక్కడే ప్రజ..అంతే!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *