చిట్‌ ఫండ్‌ కంపెనీల ఫ్లాట్లు కొనకండి!

`హైడ్రా బారిన పడకండి.

`సినీ తారల ప్రకటనలు నమ్మకండి

`సినీ తారల మాయలో పడి మోసపోకండి.

`గుడ్డిగా వారి మాటలు వినకండి.

`సినీ తారలు మధ్యవర్తులు కాదు.

`వారి పూచికత్తు అందులో ఏమీ వుండదు.

`డబ్బుల కోసం వారు ప్రకటనలిస్తారు.

`వారి మాటలు నమ్మి మీ సొమ్ము పోగొట్టుకుంటారు.

`మీ బతుకులు చీకటిమయం చేసుకుంటారు.

`కష్ట పడి సంపాదించిన సొమ్ము వృధా చేసుకోకండి.

`తొందతపడి చిట్‌ కంపనీల స్థలాలు కొన్ని ఇబ్బందులు పడకండి.

`తర్వాత డబ్బులు పోయాయని లబోదిబోమనకండి.

`చిట్‌ కంపెనీలు చేసే మాయలో పడొద్దు.

`చిట్‌ కంపెనీలు ఫ్లాట్లు ఇస్తామంటే అసలే నమ్మొద్దు.

`అన్ని అనుమతులున్నాయని చెప్పినా వినొద్దు.

`చిట్‌ పూర్తయిన తర్వాత డబ్బు మాత్రమే తీసుకోండి.

`వారి మాయ మాటలకు ఆశపడకండి.

`పైసాకు కక్కుర్తి పడి ప్రచారం చేసే సినీ తారల ప్రకటనలు చూడకండి.

`చెరువులు, శిఖ భూముల ఫ్లాటు అంటగడతారు జాగ్రత్తగా వుండండి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ప్రజలారా కొన్ని చిట్‌ ఫండ్‌ కంపనీలు అమ్ముతున్న ప్లాట్లు కొనుగోలు చేయకుండి. ఇటీవల కొన్ని ఛిట్‌ ఫండ్‌ కంపనీలు ఖాతాదారులకు స్థలాలు అంటగడుతున్నారు. నమ్మించి వారికి ప్లాట్లు విక్రియిస్తున్నారు. చిట్‌ సొమ్మును బదులుగా ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నారు. సంస్ధలో డబ్బులు లేవంటూ నమ్మించి, ఆయా సంస్ధలు ఏర్పాటు చేసిన వెంచర్లకు చెందిన ఫ్లాట్లను రాసిస్తున్నారు. ఇక్కడే అసలు మోసం దాగి వుంది. తనది కాని సొమ్ముతో వ్యాపారం చేయడం అంటేనే చిట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపనీలు. రూపాయి పెట్టుబడి లేకుండా ప్రజల నుంచి చిట్టీల పేరుతో డబ్బు సేకరించి, ఆ డబ్బునే రియల్‌ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాయి. ఆ భూములనే తిరిగి ఖాతాదారులకు విక్రయించి పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నాయి. ఇది వ్యాపారం వరకు వుంటే బాగుండేది. కాని కొన్ని చిట్‌ ఫండ్‌ కంపనీలు కొనుగోలు చేసిన స్థలాలు అనేకం లిటిగేషన్లలో వున్నాయి. పైగా ఎక్కువ స్ధలాలు చెరువు ఎఫ్‌టిఎల్‌ పరిధులో వున్నట్లు కూడా తెలుస్తోంది. మరికొన్ని వెంచర్లు అటు బఫర్‌ జోన్లు, ఇటు అసైండ్‌ భూముల్లో వున్నట్లు సమాచారం. దాంతో ఇంత కాలం వాటిని దర్జాగా అమ్ముకున్న చిట్స్‌ కంపనీలు ఇటీవల రూటు మార్చాయి. గతంలో ఖాతాదారులకు కూడా ప్లాట్ల విక్రయంలో రూపాయి కూడా తక్కువ చేయకుండా, నియమిత ధరలకు అమ్ముకాలు చేశారు. కాని తాజాగా తెలంగాణలో హైడ్రా రంగంలోకి దిగింది. చెరువుల్లో, చెరువు శిఖాల్లో, అసైండ్‌ భూముల్లో నిర్మాణాలు వుంటే కూలుస్తున్నారు. వెంచర్లను స్వాధీనం చేసుకంటున్నారు. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన చిట్స్‌ కంపనీలు వాటిని ఎలాగైనా ఖాతాదారులకు అంటగట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం మొదలు పెట్టాయి. గతంలో రూపాయి కూడా తక్కువ చేసేది లేదంటూ ప్లాట్లు అమ్మకాలు జరిపిన వాళ్లే ఇప్పుడు అడ్డికి పావుసేరుకు అమ్ముతున్నారు. ఖాతాదారులను నిండా ముంచేస్తున్నారు. గతంలో కన్నా ధరలు తక్కువ చేసి, ముందు ఖాతాదారులకు ప్లాట్లు అంటగట్టేస్తున్నారు. అసలు విషయం తెలియక కొంత మంది అమాయకపు ఖాతాదారులు కొనుగోలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. హైడ్రా వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్లు ఆగిపోయినట్లు ఓ వైపు ప్రచారం జరుగుతుంటే క్షేత్ర స్ధాయిలో పరిస్ధితి భిన్నంగా వుంది. దానిపై నేటిధాత్రి పరిశోధన విభాగం రంగంలోకి దిగితే విస్తుపోయే అంశాలు వెల్లడౌతున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న అమ్మకాలు వెలుగు చూస్తున్నాయి. నిజానికి చిట్స్‌ కంపనీలు గతంలో నగరాలకు దగ్గరలో చెరువులకు ఆనుకొని వున్న స్ధలాలు తక్కువ ధరలకు కొనుగోలు చేశారు. ఇప్పుడు వాటి విలువ బాగా పెరిగింది. రియల్‌ వ్యాపారం ఉచ్చ దశకు చేరుకున్న తర్వాత చిట్స్‌ ముసుగులో రియల్‌ వ్యాపారం మొదలు పెట్టిన చిట్స్‌ కంపనీలు కొట్లుకు పడగలెత్తాయి. చూస్తున్నంతలోనే చిట్స్‌ వ్యాపారులు అటు రియల్‌ రంగంలోనూ, ఇటు హోటల్‌ రంగాల్లోనూ పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టారు. ప్రజల నుంచి చిట్స్‌ రూపంలో సేకరించి సొమ్మంతా చిట్స్‌ వ్యాపారులు తమ సొంత ఆస్ధులు కూడగట్టుకునేందుకు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టి, వాటిని పెంచుకుంటూ పోయారు. అయితే ఇటీవల తెలంగాణలోని అన్ని జిల్లాల్లో హైడ్రా రానుందని తెలిసిన వెంటనే గతంలో కొనుగోలు చేసి, లాభాల కోసం ఎదురుచూస్తున్న వెంచర్లు త్రిశంఖు స్వర్గంలో పడ్డాయి. వాటిని అమ్మితేగాని చిట్స్‌ దారుల నుంచి విముక్తి లేదు. వారికి సొమ్ము ఇవ్వాలంటే వారి దగ్గర డబ్బులేదు. దాంతో చిట్స్‌ పూర్తయిన వారికి ప్లాట్లు విక్రయిస్తున్నారు. నాయామోసానికి తెరతీశారు.

ఇదిలా వుంటే గతంలో చిట్స్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టిన కంపనీలన్నీ పెద్దఎత్తున సినీ తారలతో ప్రకటనలు గుప్పించడం అలవాటు చేసుకున్నారు. ఫలాన చిట్స్‌లో చిట్టిలు కడితే భవిష్యత్తుకు భరోసా వుంటుందంటూ పెద్దఎత్తున ప్రచారాలు సాగించారు. అది కూడా ఖాతాదారుల సొమ్మే. ఇక్కడ చిట్‌ కంపనీలది రూపాయి వుండదు. కార్యాలయాలు కార్పోరేట్‌ ఆఫీస్‌ తరహాలో తీర్చిదిద్ది ఖాతాదారులను ఆకర్షించారు. పైగా సినీ తలుకుల చమక్కులతో పెద్ద పెద్ద హోర్డింగులు, కోట్ల రూపాయల ఖర్చుతో ప్రకటనలు రూపొందించి, పత్రికల్లో, ఎలక్రానిక్‌ మీడియాలో నిత్యం ఊదరగొట్టారు. దాంతో సినీ నటుల ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి చిట్స్‌ కంపనీలలో లక్షలాది మంది చిట్టీలు కట్టారు. ఇప్పటికీ కడుతూనేవున్నారు. ఆ వ్యాపారం అలా సాగుతూనే వుంది. అయితే చిట్స్‌ కంపనీలకు రియల్‌ వ్యాపారం మీద మోజుతో చిట్స్‌ సొమ్మంతా తీసుకెళ్లి రియల్‌ రంగంలో పెట్టుబడులు పెట్టారు. సహజంగా చిట్స్‌ కంపనీలలో ఖాతాదారులు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులే వుంటారు. వారి సేవింగ్స్‌ చిట్స్‌ల రూపంలోనే వుంటాయి. వారినే చిట్స్‌ కంపనీ ప్రతినిధులు కలుస్తుంటారు. వారి చేత చిట్టీలు వేయిస్తుంటారు. ఇలా ఉద్యోగుల నుంచి సేకరించిన సొమ్ముంతా రియల్‌ రంగం మీద పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టి, వాటిని తిరిగి వారికే అమ్ముకాలు సాగించారు. ఇప్పటి వరకు ఇదంతా ఒక సాఫీగానే సాగింది. కాని ఇటీవల ఒక్కసారిగా రియల్‌ వ్యాపారానికి హడ్రా దక్కా తగిలింది. చిట్స్‌ కంపనీలకు దిమ్మ తిరిగింది. ఇంత కాలం అమ్మగా మిగిలిన ప్లాట్లన్నీ ఖాతాదారులకు అంటగట్టాలన్న దురుద్ధేశం మొదలైంది. వాటిని ఖాతాదారులు అమ్మకాలు కూడా మొదలు పెట్టారు. ఈ విషయం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వెలుగు చూస్తోంది. అందువల్ల ప్రజలను మీడియా బాద్యతగా మేలుకొలుపాల్సిన అవసరం ఏర్పడిరది. తెలిసి కొంత మంది, తెలియక కొంత మంది అమాయకులు ఈ ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. కొందరు ఉద్యోగులు తప్పని పరిస్దితుల్లో ఆ ప్లాట్లు తీసుకుంటున్నారు. అందుకు కారణాలు వేరే వున్నాయి. ఎందుకంటే కొన్ని పెద్ద పెద్ద చిట్లలో వ్యాపారులు, పెద్ద ఉద్యోగులు మాత్రమే వుంటారు. వాళ్లు అక్రమంగా సంపాదించిన సొమ్మును చిట్స్‌ రూపంలో సేవింగ్స్‌ చేస్తుంటారు. చిట్‌ కంపనీలు మోసం చేసినా కొంత మంది ఉద్యోగులు ప్రశ్నించలేరు. చిట్స్‌ కంపనీ మోసం చేసిందని పైకి చెప్పుకోలేరు. ఒక వేళ తనకు చిట్‌ కంపనీ మోసం చేసిందని అంటే, నీ జీతమెంత, అంతంత చిట్స్‌ ఎలా చెల్లిస్తున్నావన్న ప్రశ్నలు సమాజం నుంచి వినిపిస్తాయి. అందుకే తేలు కుట్టిన దొంగల్లా కొంత మంది ఉద్యోగులు చిట్‌ కంపనీలు మోసం చేసినా ఎవరకీ చెప్పుకోరు. చిట్‌ కంపనీలు ఇలాంటి ఫ్లాట్లు అంటగట్టినా సరే నోరు మూసుకొని వాటిని కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు కూడా తప్పని పరిస్దితుల్లో చిట్‌ కంపనీల రాజీతో కొనుగోలు చేస్తున్నారు. కాని ఏమీ తెలియని అమాయకులు రూపాయి, రూపాయి కూడ బెట్టి చిట్టీలు కడుతుంటారు. రోజంతా కష్టం చేసి, అందులో కొంత బాగం కూడబెట్టి, భవిష్యత్తు అవసరాల కోసం దాచుకుంటారు. అలాంటి సొమ్ము కూడా కొందరు చిట్స్‌ కంపనీల బారిన పడి, మోసపోతున్నారు.

కొందరు సినీ నటులు ఎంతకు దిగజారారంటే డబ్బులిస్తే చాలు ఎలాంటి ప్రకటనల్లోనైనా నటించేందుకు సిద్దపడుతున్నారు. రియల్‌ వ్యాపారం మొదలైన నుంచి వారికి రియల్‌ ప్రకటనలు అదనపు సంపాదను వరంగా మారింది. రియల్‌ కంపనీల వెంచర్ల ఆవిష్కరణ, బోచర్ల ఆవిష్కరణ, కార్యాలయాల ఓపెనింగ్‌ ఇలా చిట్‌, రియల్‌ కలిసి సాగిస్తున్న కంపనీలు ఆ రోజులను కలర్‌ పుల్‌గా మార్చుతుంటాయి. పైగా సినీ నటులతో కూడిన పెద్దపెద్ద హోర్డింగులు, తియ్యటి మాటలతో ప్రకనటలు ఇప్పిస్తుంటారు. అవి నిజమే అని అమాయక ప్రజలు కొనుగోలు చేసి, లబో దిబోమంటున్నారు. అలా సినీ నటులు ప్రచారం చేసిన అనేక వెంచర్లలో జరిగిన నిర్మాణాలను హైడ్రా నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. అయితే సామాన్య ప్రజలకు ఈ వ్యాపారులు ఎవరో తెలియదు. ఆ వెం చర్లు ఎక్కడ వుంటాయో కూడ తెలియదు. కాని సినీనటులతో ప్రకటనలు ఇప్పించే సరికి ప్రజల్లో ఆసక్తి నెలకొంటుంది. ప్లాట్ల కొనుగోలు కోసం వెళ్లి డబ్బులు చెల్లించి, నిండా మునుగుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు తాము కొనుగోలు చేయాలనుకుంటున్న ప్లాట్లు, చిట్‌కంపనీలు ఇస్తామంటున్న ప్లాట్లు ఎక్కడున్నాయి. అవి చెరువుల్లో వున్నాయా? బఫర్‌ జోన్లో వున్నాయా? అసైండ్‌ భూముల్లో వున్నాయా? అన్న వివరాలు సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాతే అడుగు ముందుకు వేయండి. లేకుంటే మోసం పోవడం ఖాయం!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *