`ఇక్కడ కూడా రెండు కళ్ల సిద్దాంతమేనా!
`ఒకప్పుడు ఒక్కరే ముద్దు అని ప్రచారం చేసింది చంద్రబాబే.
`ఇద్దరు చాలు, ముగ్గురు అసలే వద్దని చెప్పింది చంద్రబాబు.
`అందుకే నేనే ఒక్కరితోనే ఆపేశానని చెప్పింది ఆయనే.
`జనాభా పెరుగుదల దేశానికి తీరని బారం అని చెప్పిందే చంద్రబాబు.
`జనాభా పెరుగుదల పేదరికాన్ని పెంచుతుందని చెప్పాడు.
`ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెబుతున్నదీ చంద్రబాబే.
`ఇప్పటికే బతుకు మోయలేని భారమౌతోంది.
`కేవలం ఎంపి సీట్లు తగ్గుతాయని పిల్లల్ని కనండని చెప్పడం వివేకమా!
`సీట్లు పెరిగితే దక్షిణాదికి నిధులొస్తాయా!
`చైనాను మించిపోయి పేదరికం కొని తెచ్చుకుంటే పోషించేదెవరు?
`ఉత్తరాధి నుంచి దక్షిణాదికి కోట్లలో వలసలు వస్తున్నారు.
`అక్కడ ఉపాధి లేకనే ఇక్కడకు చేరుకుంటున్నారు.
`చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం.
`పది మందిని కంటే పోషించేవారెవరు?
`ఇప్పటి తరం పిల్లలే వద్దంటున్నారు.
`ఉపాధి లేక ఎంతో మంది యువత చాలీ చాలని జీతాలు చేస్తున్నారు.
`సంపాదన చాలక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
`విద్య, వైద్యం అందక అవస్థలు పడుతున్నారు.
`వాళ్లను ఆదుకునే దిక్కు లేదు.
`రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడొచ్చా!
`ఎందుకీ దౌర్బాగ్య స్థితి.
`వీళ్ల మాటలు నమ్మితే అధోగతి.
హైదరాబాద్,నేటిధాత్రి:
సృహ తప్పిపోయి మాట్లాడుతున్న రాజకీయం. నిసృహలో కొట్టుమిట్టాడుతున్న జనం. గతంలో ఎక్కువ పిల్లలు కనొద్దని ఆదేశం. బలవంతంగా చేసిన కుని ఆపరేషన్లు..జనాభా నియంత్రణకు పెద్దఎత్తున చేపట్టిన చర్యలు. పిల్లలు ఎక్కువగా వుంటే రాజకీయ పదవులకు కూడా అవకాశం లేకుండా తెచ్చిన చట్టాలు. అవన్నీ ఇప్పుడు తూచ్ అంటారు. జనాభా పెరుగుదలకు ఇప్పుడు కొత్త చట్టాలా..లేక నీతి సూత్రాలా? ఇప్పుడు ఎంత మందిని కంటారో..కనండంటూ సందేశాలు..అవి వింటున్న వాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడేంత సందేహాలు. పాలకులు చెప్పాల్సిన మాటలేనా..దేశాన్ని ఉద్దరించాలనుకునే వాళ్లు వల్లించాల్సిన నీతులేనా? అని సమాజం ప్రశ్నిస్తోంది. 1971ని మన దేశంలో గొప్ప విభాజక సంవత్సరం అని గొప్పగా చెప్పుకుంటాం. కాని తర్వాత ఏమైంది. 2011 నాటికి పరిస్దితి ఎటు వెళ్లింది. దేశ ప్రదానిగా ఇందిరాగాంధీ వున్న సమయంలో ఎలాంటి నిర్ణయాలు చేశారు. ఇప్పుడెందుకు విపరీతంగా పిల్లల్ని కనాలని సూచిస్తున్నారు. దేశ కాలమాన పరిస్ధితుల్లో వచ్చిన మార్పులేమిటి? పాలకులు చేసిన అద్యయనమేమిటి? ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు, తమిళనాడు సిఎం. స్టాలిన్ చేస్తున్న వ్యాఖ్యలకు అర్ధమేమిటి? మన దేశ ఆర్ధిక పరిసి ్దతులేమిటి? వనరులేమిటి? అన్న విషయాలు ఆలోచించాల్సిన అవసరంలేదా? చైనా దేశంలో ఒకప్పుడు కూడా పెరుగుతున్న జనభాను కట్టడి చేయడం వల్ల అక్కడ ఇప్పుడు యుక్త వయసు వాళ్లు తక్కువయ్యారు. మానవ వనరుల అవసరం బాగా వుంది. అందువల్ల పిల్లల్ని కనండి అని ఆ దేశం పిలుపునిచ్చిందంటే ఒక అర్దముంది. కాని మన దేశంలో కూడా ఇప్పుడున్న రాజకీయాలకు అనుగుణంగా పిల్లల్ని కనండి అని చెప్పడంలో ఆంతర్యం తెలియనంత అమాయకులా ప్రజలు. మన దేశం కన్నా చైనా దేశం కొన్ని రెట్లు పెద్దది. అక్కడ ఎంత జనాభా పెరిగినా సరిపోయేంత భూమి వుంది. ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పన జరిగేందుకు అవకాశం వుంది. మన దేశ విస్తీర్ణం ఎంత? ఇప్పుడున్న జనాభా ఎంత? పెరుగుతున్న జనాభాకు కనీస అవసరాలు తీర్చలేని పరిస్దితుల్లో ప్రభుత్వాలున్నాయి. ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, రోజూ కనీసం కూలీ పని కూడా దొరక్క ఎంతో మంది నిరుద్యోగులుగా వుంటున్నారు. వారికి జీవనం గడవడమే కష్టమైపోతున్న రోజులివి. అలాంటి సందర్భంలో పిల్లల్ని కనండి..అని రాజకీయ నాయకులు ఉచిత సలహాలు ఇవ్వడం వెనుక రాజకీయం తప్ప, ప్రజా సంక్షేమం ఎక్కడుంది. సరే పిల్లల్ని కనేందుకు ప్రభుత్వాలు అందిస్తున్న వైద్య సేవలు ఏమిటి? ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలేమిటి? తమను తాము పోషించుకోవడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో పిల్లల్ని కనాలనుకున్నా వారి పోషణ ఎవరు చూస్తారు? ప్రభుత్వం ఇచ్చే ముక్కిన రేషన్ బియ్యం తినిబతకమని చెప్పాలనుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వద్దాం. చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఈ తరం యువతను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకప్పుడు ఇదే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ్ముళ్లూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచే మనం శ్రీకారం చుడదాం..మీరంతా ఒకరు లేక ఇద్దరిని మాత్రమే పిల్లల్ని కనండి. మూడో సంతానం వద్దు. ఒకరు ముద్దు. ఇద్దరు చాలు. ముగ్గురు వద్దే వద్దు అని కొన్ని వేల సార్లు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చెప్పారు. నేను కూడా ప్యామిలీ ప్లానింగ్ అమలు చేశాను. ఒక్కడినే కన్నాను. మీరు కూడా ఒక్కరికే పరిమితం కమ్మనండి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. మంది ఎక్కువతే మజ్జిగ పల్చన ఇలాంటి స్లోగన్లు రాసిన కొన్ని కోట్ల వాల్ పోస్టర్ల ఊరూరా, వాడవాడలా అంటించారు. అందుకోసం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పైగా నిర్భందంగా కూడా ప్యామిలీ ప్లానింగ్ అమలు చేసిన సందర్భాలు కూడా మన దేశంలో వున్నాయి. ప్యామిలీ ప్లానింగ్‌ను రాజకీయ నాయకులే ఆదర్శంగా వుండాలని చెబుతూ ముగ్గురు పిల్లలు వుంటే సర్పంచ్, ఎంపిటీసి, జడ్పీటీసి ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హులు అంటూ చట్టాలలో మార్పులు కూడా తెచ్చారు. జనాభా నియంత్రణ చేశారు. అయినా కనే వాళ్లు కంటూనే వున్నారు. పెరిగే జనాభా పెరుగుతూనే వుంది. రోడ్ల మీద చిన్న చిన్న పిల్లల్ని చంకనేసుకొని కొన్ని వేల మంది మహిళలు బిక్షాటన చేస్తుంటారు. వారిని చూసి మనకు ఎంతో జాలి కల్గుతుంది. వాళ్లకే సరైన వసతి లేదు..అలాంటి వారు పిల్లల్ని కని వారి బతుకు నరకం చేస్తున్నారంటూ తిట్టుకున్న సందర్భాలు కూడా వున్నాయి. పేదల జీవితాల్లో వెలుగుల కోసం ప్రభుత్వాలు ఇప్పటికే అనేక పధకాలు అమలు చేస్తున్నారు. అయినా మన దేశంలో పేదరికం తగ్గిందా? జనాభా పెరుగుదలతోపాటు పేదరికం పెరుగుతూనే వుంది. ఒక వ్యక్తికి యుక్త వయసులో వున్నవారికి ఒక రోజులు కనీసం 2200 క్యాలరీల శక్తి కావాలి. పిల్లలకు కనీసం 1500 క్యాలరీల శక్తి కావాలి. వారికి అన్ని క్యాలరీల ఆహారం దొరక్క ఎంతో మంది తిండి లేక పస్తులుంటున్నారు. పెళ్లిళ్లలో ఫంక్షన్‌లలో పడేసిన ఎంగిలి విస్తర్లను కూడా కొట్లాడి తీసుకుంటూ తిన్న పిల్లలపై అనేక సినిమాలలో సన్నివేశాలు చూపించారు. పేదరికం మీద మనదేశం యుద్దం చేయాలని ప్రభుత్వాలు గతంలో చెబుతూ జనాభా నియంత్రన ఒక్కటే అందుకు మార్గమంటూ కొన్ని లక్షల న్యూస్ రీల్స్ కూడా తీసింది. మన దేశంలో దుర్భర పరిస్ధితులు ఎలా వున్నాయన్న విషయాన్ని ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్ శాఖ ఆధ్వర్యంలో పల్లెల్లో న్యూస్ రీల్స్ వేసి మరీ ప్రజల్లో చైతన్యం తెచ్చారు. ఇప్పుడేమో మళ్లీ పిల్లల్ని కనండని ఉచిత సలహాలు పడేస్తున్నారు. దీని వల్ల ఎవరికి లాభం? దక్షిణాదిన ఎంపిల సీట్లు తిగ్గిపోయే ప్రమాదముంది? ఆ సీట్లు తగ్గిపోతే దక్షిణాదికి కేంద్రం నుంచి రావాల్సిన నిదులు తగ్గిపోతాయి. నిజమే! కాని రాజకీయ పార్టీలు కొట్లాడాల్సిన అంశాలు ఇవేనా? పేదరికాన్ని బట్టి కేంద్ర నిధులు పంచాలని కోరాల్సిన సమయంలో, జనాభా ప్రాతిపదికన నిధులు పంచాలని కోరుకోవడంలో అర్ధం లేదు. ఒక వేళ అదే నిజమని అనుకుందాం? ఉత్తరాధిన ప్రభుత్వాలు ఎంత చెప్పినా ప్రజల వినిపించుకోలేదు. ప్యామిలీ ప్లానింగ్ అమలు కాలేదు. పెద్దఎత్తున జనాభా పెరిగింది. కాని అక్కడికి ఎన్ని నిధులు వెళ్లినా అక్కడి పరిస్ధితుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా? ఉత్తరాధిలో అభివృద్ది జరిగిందా? కేంద్ర నిదుల పంపకమే జనాభాకు ప్రాతిపదికగా తీసుకోవడం అన్నది సరైంది కాదని వాదించలేరా? ఉత్తరాదికి నిధులు వరద పారుతుంటే అభివృద్ది ఎక్కడికిపోతోంది? మరి పెద్దఎత్తున కోట్లాది మంది ప్రజల దక్షిణాదికి వలస ఎందుకు వస్తున్నారు. అక్కడ ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించబడడం లేదు. తెలంగాణ, ఏపి, తమిళనాడులో స్ధానిక జనాభాలో పది శాతానికి పైగా ఇతర రాష్ట్రాల ప్రజలు వచ్చి ఉపాది అవకాశాలు అందుకుంటున్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తేవాలి. నిధులు మంజూరు కోసం కొట్లాడాలి. అంతే కాని సీట్లు తగ్గిపోతున్నాయని, నిధులు తగ్గుతాయని పిల్లల్ని కనండని సూచించడంతో ఏ శాస్త్రీయత దాగి వుందో చంద్రబాబుకు, స్టాలిన్‌కే తెలియాలి. వున్న జనాభాకు సరైన విద్య అందడం లేదు. వైద్యం అందడం లేదు. రవాణా సౌకర్యాల కల్పన జరగడంలేదు. పెద్దఎత్తున ప్రైవేటు విద్య మీద ప్రజలు మోయలేని భారాన్ని భుజాన వేసుకొని ఫీజులు చెల్లిస్తున్నారు. పేదలకు ప్రభుత్వ వైద్య శాతం ఎంత అందుతోంది. అత్యవసర పరిస్దితులు వస్తే ఆస్ధులు అమ్ముకున్నా వైద్యం అందడం లేదు. ప్రజల ప్రాణాలు నిలవడం లేదు. ముందు ప్రభుత్వాలు ప్రజలందరికీ ఒకే రకమైన ప్రభుత్వ విద్యను అందుబాటులోకి తేచ్చే ప్రయత్నం చేయండి. దానికి శ్రీకారం చట్టండి. రూపాయి ఖర్చు లేకుండా ఉన్నత విద్యలన్నీ ఉచితంగా అందించే ఏర్పాట్లు చేయండి. పేదలకు ఎంతట కష్టమొచ్చినా తీర్చుతామని భరోసా కల్పించండి. పేదలు అనారోగ్యం పాలైతే ఎన్ని లక్షల వైద్యమైనా ఉచితం చేస్తామని చెప్పండి. ప్రైవేటు ఆసుపత్రులను ప్రభుత్వాలు స్వాదీనం చేసుకోండి. వైద్యులందరూ ప్రభుత్వాసుపత్రుల్లోనే పని చేయాలని చట్టాలు చేయండి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నివాస యోగ్యాలు ప్రభుత్వాలే కల్పిస్తామని హమీ ఇవ్వండి. అప్పుడు సంతతి పెంచే ఆలోచనలు, జనాభా పెరుగుదలకు సూచనలు చేయండి. అంతే రాజకీయ అవసరాల కోసం ప్రజల జీవితాలతో ఆటలాడుకోకండి.