పోరాట యోధుడు పొన్నం

https://epaper.netidhatri.com/view/336/netidhathri-e-paper-2nd-aug-2024

`తెలంగాణ ఉద్యమ ప్రభాకరుడు.

`తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన వీరుడు.

`నిండు పార్లమెంటు సాక్షిగా ఊపిరి సలపకున్నా గర్జించిన ఘనుడు.

`అధికార పార్టీలో వున్నా బలంగా తెలంగాణ గళం వినిపించాడు.

`భవిష్యత్తు రాజకీయం కన్నా తెలంగాణ రాష్ట్రం కోరుకున్నాడు.

`ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రిని సైతం ఎదిరించాడు.

`కరీంనగర్‌ జిల్లాలో అడుగుపెట్టనివ్వని ప్రతిజ్ఞ చేశాడు.

`లోకసభ ఎంపిల ఫోరమ్‌ అధ్యక్షుడు పదవిని వదులుకున్నాడు.

`తెలంగాణ కోసం అనేక త్యాగాలు చేశాడు.

`జై తెలంగాణ నినాదమే ఊపిరిగా పోరాటం చేశాడు.

`కాంగ్రెస్‌ కరడుగట్డిన నాయకుడుగా గుర్తింపబడ్డాడు.

`నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడిన నాయకుడు.

`ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడుగా ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థి పోరాటాలు చేశాడు.

`విద్యార్థి లోకంలో చైతన్యం నింపాడు.

`2004 ఎమ్మెల్యే టిక్కెట్‌ ఎం. సత్యనారాయణ రావు కోసం త్యాగం చేశాడు.

`2009 కరీంనగర్‌ పార్లమెంటు సభ్యుడయ్యారు.

`15వ లోక్‌సభ లో అతిచిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు.

`2023లో ఎమ్మెల్యే కల నెరవేరింది.

`మంత్రిగా సేవ చేసే అవకాశం దక్కింది.

`బిసిల గొంతు పొన్నంకు మరింత బలమొచ్చింది.

ప్రత్యర్థులను చీల్చి చెండాడే అవకాశం వచ్చింది.

అసెంబ్లీ సాక్షిగా మంత్రి ప్రభాకర్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇటీవల ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఒకమాటన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ నాకు మంచి మిత్రుడు. కాని కేవలం తెలంగాణ కోసం నాతో మూడేళ్లపాటు మాట్లాడలేదు. ఎదురుపడితే పలకరించలేదు. పిలిచినా పలకలేదు. తెలంగాణపై ఆయనకు వున్న కమిట్‌ మెంటు అంత గొప్పది. స్నేహానికన్నా ఉద్యమానికి విలువిచ్చాడు. తెలంగాణ నేలను గౌరవించారు. రాజకీయాలు ఎలా వున్నా స్నేహాలు కొనసాగేవి. కాని తెలంగాణ కోసం ఉద్యమించిన సమయంలో స్నేహన్ని మించిన అంకితభావాన్ని తెలంగాణ ఉద్యమంలో చూసుకున్నాడు. రాజకీయాల్లో ఎంతో మందిని చూశాను. కాని తెలంగాణ సమాజం కోసం అందర్నీ దూరం చేసుకొని, రాష్ట్ర సాధన కోసం కట్టుబడిన నాయకుడు పొన్నం ప్రభాకర్‌ అంటూ కీర్తించారు. ఇంతకన్నా ఒక నాయకుడికి గౌరవం ఏముంటుంది. తెలంగాణ కోసం పొన్నం ప్రభాకర్‌ ఉద్యమ పాత్ర గురించి సర్టిఫికెట్‌ ఏముటుంది? తెలంగాణ వ్యతిరేకులు కూడా ఆయన త్యాగాన్ని గుర్తించారు. ఆయన ఆత్మాభిమానాన్ని గుర్తించారు. తెలంగాణ వాదం వినిపించే సమయంలో సీమాంధ్ర నేతలతో మాట్లాడితే ఎక్కడ తెలంగాణ సమాజం చిన్న బుచ్చుకుంటుందో, ఉద్యమం ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని ఆలోచించిన గొప్ప నాయకుడు పొన్నం ప్రభాకర్‌ అంటూ ఉండవల్లి కీర్తించారంటే అంతకన్నా గొప్ప నాయకత్వం ఏముంటుంది. అంతకన్నా గొప్ప నాయకుడు ఎవరుంటారు? తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినవారిలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ పాత్ర గొప్పది. ఆయన చేసిన పోరాటం, చూపిన తెగువ చాలా గొప్పది. ఉద్యమంటే పేరు కోసం, పరపతికోసం సాగించినట్లు నటించిన వారు చాలా మంది వున్నారు. తెలంగాణ ఉద్యమం పేరుతో లబ్ధిపొందిన వాళ్లున్నారు. తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి నాయకులైన వారు ఎంతో మంది వున్నారు. కాని నాయకుడి ఎదిగిన తర్వాత తెలంగాణ కోసం తన రాజకీయ జీవితాన్నే ఫణంగా పెట్టిన నాయకుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ముందు వరసలో వుంటారు. 

మలి దశ తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్న నాయకుల్లో పొన్నం ప్రభాకర్‌ మొదటి పది పేజీల్లో వుంటారు. ఆయన చూపిన తెగువ చూసి తెలంగాణ సమాజం గొప్పగా కీర్తించిన సందర్భం వుంది. ఒక దశలో ఆయన ఆసుపత్రి పాలైనప్పుడు తెలంగాణ సమాజం విలపించిన సందర్భం వుంది. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన సమయంలో పెప్పర్‌ స్ప్రే మూలంగా జీవితం చివరి అంచు వరకు వెళ్లి వచ్చారు. తెలంగాణ ఏర్పాటును అంత బలంగా కాంక్షించారు. పెప్పర్‌ స్ప్రే చల్లి బిల్లును అడ్డుకోవాలనుకున్న లగడపాటి రాజగోపాల్‌ చేతిలోనుంచి దానిని లాగేసుకున్న వీరుడు పొన్నం ప్రభాకర్‌. అలా తెలంగాణ కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయని యోధుడు పొన్నం ప్రభాకర్‌. తెలంగాణ అంటే ఆయనకు ఎనలేని అభిమానం. తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం ఏమిటో విద్యార్ధి నాయకుడిగా ఆయనకు పూర్తిగా తెలుసు. అంతకు ముందు యాభై ఏళ్లుగా సీమాంధ్ర పెత్తనం వల్ల తెలంగాణ ఎంత నష్టపోయిందో తెలుసు. అందుకే తెలంగాణ సీమాంధ్రులనుంచి విముక్తి కావాలని బలంగా కోరుకున్న నాయకుడు పొన్నం ప్రభాకర్‌. అందుకే తెలంగాణ ఆయనను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటుందని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఆయన త్యాగాన్ని మరుగున పర్చేందుకు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, సమయం విచ్చనప్పుడు ఆయన త్యాగం తెలంగాణ ప్రజలు గుర్తించారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆయనకు ప్రతి సందర్భంలోనూ సముచిత స్ధానం కల్పించింది. ఆయనకు సరైన గౌరవం ఇస్తూనే వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి వుండి, రాజకీయంగా అవకాశాలు ఎన్ని వచ్చినా వదులకొని, తెలంగాణ వాదాన్ని భుజాన మోసిన గొప్ప నాయకుడు పొన్నం ప్రభాకర్‌. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు కూడా ఒకసారి పాలించే అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకొని, పొన్నం ప్రభాకర్‌ను అసెంబ్లీకి పంపించారు. మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైనా మంత్రి పదవి ఇచ్చి పార్టీ కూడా ఆయన గౌరవం మరింత పెంచింది. పొన్నం ఫ్రభాకర్‌కు మంత్రి వర్గంలో కీలకపాత్ర పోషించే అవకాశం వచ్చింది. 

                                              సహజంగా పొన్నం ప్రభాకర్‌ ఆత్మాభిమానం నిండిన నేత. స్వయంగా ఎదిగిన నేత. విద్యార్ది రాజకీయాలనుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కాలేజీ స్దాయి నుంచి రాష్ట్ర స్ధాయి వరకు నాయకుడిగా ఎదిగారు. కాంగ్రెస్‌ పార్టీ విద్యార్ది విభాగంలో రాష్ట్ర అధ్యక్షుడుయ్యారు. యువజన విభాగంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవులు అందుకున్నారు. 1987లో విద్యార్ది నాయకుడిగా తన ప్రస్ధానం మొదలు పెట్టిన పొన్నం ప్రబాకర్‌ 1989 జిల్లా ఎన్‌ఎస్‌యూఐ జనరల్‌ సెక్రెటరీ పదవిని నిర్వహించారు. అంతే కాదు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కళాశాలల కన్వీనర్‌గా పనిచేశారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 1999`2002 మధ్యలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా కీలక భాద్యతలు నిర్వర్తించారు. అనేక విద్యార్ది ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కోసం అహర్నిషలు కృషి చేశారు. ఆ తర్వాత యూత్‌ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీగా విధులు నిర్వహించారు. 2004 ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న కసితో పనిచేశారు. అదే సమయంలో మీడియా సెల్‌ కన్వీనర్‌ పాత్ర పోషించారు. కాంగ్రెస్‌ పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా కృషి చేశారు. సమాజాన్ని చైతన్య వంతం చేశారు. మేధావుల చేత తెలుగుదేశం పాలనపై ప్రశ్నించేలా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ గెలుపులో కీలకభూమిక పోషించారు. 2004 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. టికెట్‌ కూడా దక్కిందనే అందరూ అనుకున్నారు. కాని పొన్నం ప్రభాకర్‌కు రావాల్సిన టికెట్‌ అప్పటి మాజీ పిపిసి. అధ్యక్షుడు దివంగత ఎం. సత్యనారాయణ రావు రాకతో త్యాగం చేశారు. లేకుంటే అప్పుడే ఎమ్మెల్యే అయ్యేవారు. వైఎఎస్‌ క్యాబినేట్‌లో మంత్రి కూడా అయ్యేవారు. కాని కాలం ఓ ఐదేళ్లు వెనక్కి లాగినా, 2009లో మాత్రం కరీంనగర్‌ ఎంపిగా పోటీ చేసే అవకాశం కాంగ్రెస్‌పార్టీ కల్పించింది. 33 మంది కాంగ్రెస్‌ ఎంపిలు ఉమ్మడి రాష్ట్రం నుంచి గెలిచారు. ఆ సమయంలో తెలంగాణకు చెంది, అతి పిన్న వయస్కుడైన పొన్నం ప్రభాకర్‌కు లోక్‌సభ ఎంపిల కన్వీనర్‌ను చేసి. కీలక భాద్యతలు అప్పగించారు.  

2010లో తెలంగాణ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో ఆ పదవికి కూడా పొన్నం ప్రభాకర్‌ రాజీనామా చేసి, అధికార పార్టీ ఎంపిగా వుండి కూడా ఉద్యమంలో కీలకభూమిక పోషించారు. తనదైన శైలిలో తెలంగాణ కోసం పోరాటం చేశారు. ఉద్యమకార్యాచరణలోముందున్నారు. పార్టీలు ఏవైనా ఉద్యమ సమయంలో అంతా ఒక్కటే అన్నట్లు కలిసిపోయారు. దూంధాంలలో పాలుపంచుకున్నారు. వంటా వార్పులకు కూడా హజరయ్యారు. ఉద్యమానికి ఇతోదిక చేయూతనందించారు. ఉద్యమకారులను రక్షించుకున్నారు. ఇలా అనేక విధాలుగా తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. ఉద్యమం కోసం ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కూడా ఎదిరించారు. ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కరీంనగర్‌ జిల్లా పర్యటనకు వెళ్లాలనుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ సమయంలో జిల్లా పర్యటన పెట్టుకోవడం అంటే తెలంగాణ వాదులను రెచ్చగొట్టడమే అవుతుందని, కరీంనగర్‌ రావడానికి వీలులేదని అల్టిమేటం ఇచ్చిన నాయకుడు పొన్నం ప్రభాకర్‌. అయినా కిరణ్‌కుమార్‌ రెడ్డి వస్తానని మొండికేస్తే హెలికాప్టర్‌ పేల్చేస్తామంటూ సంచలన వాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్ధితుల్లో కిరణ్‌కుమార్‌ రెడ్డిని కరీంనగర్‌లో అడుగపెట్టనివ్వనంటూ ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ ఉద్యమానికి మరింత ఊపు తెచ్చారు. తెలంగాణ ఉద్యమం కోసం తన రాజకీయ భవిష్యత్తును కూడా లెక్క చేయలేదు. పదేళ్ల తర్వాత ఆయనకు మళ్లీ కాలం కలిసొచ్చింది. త్యాగానికి గుర్తింపు దొరికింది. మంత్రిగా తెలంగాణకు సేవ చేసే అవకాశం వచ్చింది. పేదల గొంతకకు గౌరవం దక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!