https://epaper.netidhatri.com/view/379/netidhathri-e-paper-18th-september-2024%09
స్వేచ్చ లేని బతుకులు!
-రాజకీయ చక్రంలో ఇరుక్కుపోతున్న నాయకులు!
-రాజకీయాలలో కొట్డుకుపోతున్న వ్యక్తిగత జీవితాలు!
-ఇరు పార్టీల నేతలకు కరువైన స్వేచ్చ!
-పాలక, ప్రతిపక్షాల మధ్య దూరమెందుకు?
-రెండు పార్టీల నేతలు కలవడానికి భయమెందుకు?
-ఇద్దరు నేతలు కలిస్తే ఉలుకెందుకు?
-వైరి పక్షాలంటే వ్యక్తిగత విరోధులా?
-రాజకీయ వైరం పేరుతో నేతలు కలుసుకోవడం ఇబ్బందా?
-ఇరు పార్టీల నేతల కలయిక ప్రమాదమా!
-రాజకీయాలు ఇంతగా దిగజారాలా?
-ఇరు పార్టీల నేతలు కలిస్తే అంత ఉలిక్కిపడాలా?
-గతంలో వున్న సుహృద్భావ వాతావరణం ఎందుకు లేదు!
-ఇంతగా దిగజారిన రాజకీయాలకు కారణం ఎవరు?
-పార్టీల మధ్య సైద్దాంతికతలు మాయం చేస్తున్నదెవరు?
హైదరాబాద్,నేటిధాత్రి:
ఎక్కడికి వెళ్లాలన్నా ఇబ్బందే…ఎవరితో మాట్లాడాలన్నా కంగారే! ఎవరినైనా నవ్వుతూ పలకరించాలన్నా పలవరింతే…దిక్కులు చూసుకుంటూ శానార్తెలు చెప్పుకోవాల్సిందే…కళ్లతో సైగలు తప్ప నోటితో నవ్వలేరు. నొసటితో ప్రశ్నించలేదు. ఇతర నాయకులు ఎదురుపడితే కింది చూపులే..తప్ప తలెత్తి చూడలేని పరిస్ధితి. పేరుకు ఎంత పెద్ద నాయకుడైనా సరే..ఇప్పుడున్న రోజుల్లో ఒళ్లు దగ్గర పెట్టుకొని అడుగులేయాల్సిందే…కళ్లకు గంతలు కట్టుకొని నడవాల్సిందే… పేరుకే వాళ్లు నాయకులు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు. అయితేనేం ఎన్ని వెలుగుల్లో వున్నా, చీకటిని చూసినట్లే నటించాలి. వెలుగులోకి రావాలంటే దిక్కులు చూసుకుంటూ అడుగులేయాలి. కాకపోతే రాజకీయ నాయకుల గుండె గట్టిదే…వయసులో పెద్దవాళ్లయినా, చిన్న వాళ్లయినా, పూట పూటకు గుప్పెడు మందులు మింగాల్సిందే. కాని రాజకీయాలను వదిలిపెట్టేందుకు మనసు ఒప్పదంతే..ఒత్తిళ్లు ఒక లెక్క కాకుండాపోతున్నాయి. ఎంత మానసిక సంఘర్షణ అయినా సరే పట్టించున్నట్లు కనిపించరు. కోపాన్ని అణుచుకుంటూ, లేని నవ్వులు పులుముకుంటూ వుండాల్సిందే. పక్కన కూర్చున్న నాయకుడు తమ పార్టీ నాయకుడైనా పక్క చూపులు చూడాలంటే ఇబ్బందే…ఏ కెమెరా ఎక్కడి నుంచి వీడియా తీస్తుందో అని బిక్కుబిక్కుమంటూ కూర్చోవాల్సిందే…బిగ్గరగా నవ్వినా..ఎందుకు నవ్వినట్లు వార్తలు వస్తాయి. మౌనంగా కూర్చుంటే అలకెందుకు అన్న ప్రశ్నలు వినిపిస్తాయి. అదో విచిత్రమైన పరిస్ధితి. తినే తిండి దగ్గర నుంచి మొదలు తాగే నీటి దాకా స్వేచ్చ లేదు. పది మందిలో కూర్చొని ఒక్క బుక్క ఎక్కువ తిన్నా జనం సొమ్ము ఇలా తింటున్నారంటారు. ఒక వేళ చాటుకు తిన్నా, దాచుకు తింటున్నారంటారు. కార్యకర్తలతో కలిసి వుండకపోతే కలుపుపోరంటారు..ఇలా నాయకులు చేసే ప్రతి పని తప్పుగానే మారుతుంది. అందుకే పది మందిలో నాయకుడు కూర్చున్నప్పుడు కలిసి బోంచేయాల్సి వచ్చినప్పుడు ఒక్కొ మెతుకు లెక్కపెట్టుకుంటూ తినాల్సిందే.. ఎక్కువ తింటే మెక్కండి? అంటారు. తక్కువ తింటే ఒంటి నిండా నాయకుడికి రోగాలే అంటారు. బాటిల్‌లో నీళ్లు తాగితే, జనం సొమ్ము తాగేస్తున్నారంటారు. ప్రతి క్షణాన్ని అనుమానించుకుంటూనే గడపాలి. అవసరం లేని వివాదాలు నెత్తినపడేసుకుంటారు. ప్రజల్లోకి వస్తే ఒక తంటా…రాకపోతే మరో తంటా…! ప్రతి నిమిషం ఉరుకులు పరుగులు, పక్కవారిని పలకరించాంటే భయాలు. ఏం బతుకులాయేరా? అని నిరంతరం మధనపడే పరిస్దితి తెచ్చుకుంటున్నారు.
క్షణం కళ్లు మూసుకుంటే బట్ట కాల్చి మీదేస్తారు. రాత్రి నిద్ర పోయినా నిద్రరాదు. తెల్లారితే ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అన్న భయంతో నిద్ర కూడా పట్టదు. అటు కుటుంబం, ఇటు రాజకీయం నాయకులు మద్దెల దరువైపోయింది. ఎవరితో మాట్లాడకపోయినా ఇబ్బందే…మాట్లాడినా కష్టమే!! రాజకీయం చట్రంలో ఇరుక్కున్న స్వేచ్ఛలేని బతుకులు..నాయకుల జీవితాలు. రాజకీయ చట్రంలో ఇరుక్కుపోయిన వారు, తమ వ్యక్తిగత జీవితాలు ఎంతో కోల్పోతున్నారు. పైకి మాత్రం హంగూ, ఆర్భాటం వున్నా, కనీసం తమ పిల్లలతో కూడా సమయం గడిపే తీరిక లేకుండాపోతోంది. రాజకీయ జీవితాల్లో వ్యక్తిగత స్వేచ్ఛలు కొట్టుకుపోతున్నాయి. ఒకప్పుడు ఏ నాయకుడి ఇంట్లో శుభకార్యం జరిగినా ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడా లేకుండా ఆహ్వానం పలుకుతూ వుండేవారు. అందరూ అలాంటి సందర్భాలలో హాయిగా నవ్వుతూ కనిపించేవారు. కలిసి భోజనాలు చేసేవారు. వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పంచుకునేవారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి బడ్జెట్ సమావేశాల తర్వాత అట్టహాసంగా ఆటల పోటీలు నిర్వహించేవారు. ఎమ్మెల్యే, మంత్రులు, మీడియా కలిసి గేమ్స్ అడుతుండేవారు. బడ్జెట్ సమావేశాల చివరి రోజున జూబ్లీహాల్‌లో పాలక, ప్రతిపక్ష నాయకులతో కలిసి విందు ఏర్పాటు చేసుకునేవారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలు పక్క పక్కన కూర్చొని ఆహ్లాదకరమైన వాతారణం కనిపించేలా చేసేవారు. కాని ఇప్పుడు పొరపాటున ఏ నాయకుడైనా తన ఇంట్లో శుభ కార్యానికి ఇతర పార్టీల నాయకులకు శుభలేఖలు ఇచ్చినా, ఏ పార్టీ నాయకులు ఎప్పుడు వస్తున్నారు? వారు ఎప్పుడు వెళ్లిపోతున్నారు? ఆ విషయాలన్నీ తెలుసుకొని శుభకార్యాలకు హజరౌతున్నారు. ఇతర పార్టీల నేతల ముఖాలు చూసుకునేందుకు ఇష్టపడడం లేదు. ఇదిలా వుంటే నాయకుల కుటుంబాలలో జరిగిన విషాదాలకు కూడా వెళ్లి పరామర్శించలేకపోతున్నారు. కనీసం ఫోన్‌లలో కూడ విచారం వ్యక్తం చేసుకునే పరిస్ధితులు లేకుండాపోతున్నాయి. ఆ ఈటెల రాజేందర్ తండ్రి చనిపోయినప్పుడు ఆయనను పరామర్శించేందుకు ఎవరూ వెళ్లలేదు. ఇక వేళ వెళ్లే తమ రాజకీయ భవిష్యత్తు ఏమౌతుందో అని భయపడాల్సి వచ్చింది. ఇటీవల భువనగిరికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి చనిపోయినప్పుడు పరామర్శించడానికి వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బిఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇలా నాయకుల స్వేచ్ఛను హరించే పరిస్ధితి పరాకాష్టకు చేరింది. నాయకుల మధ్య ఎలాంటి రాజకీయ సైద్దాంతిక విబేధాలున్నా, నాయకుల కుటుంబాలలో విషాదాలు చోటు చేసుకున్న తరుణంలో కూడా వారిని పరామర్శించే పరిస్దితి లేకుండాపోతోంది.
ఎందుకిలా తమ జీవితాలు మారుతున్నాయన్న ఆలోచన కూడా నాయకులు చేయలేకపోతున్నారు. అయితే గతంలో కూడా నాయకుల పరిస్దితి ఇలాగే వుండేదా? అంటే లేదనే సమాదానం వినిపిస్తుంది. ఒకప్పుడు నాయకులు ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేసేవారు. తర్వాత వారి వారి వ్యక్తిగత జీవితాలైనా, రాజకీయ జీవితాలైనా స్వేచ్చగా బతికేవారు. రాను రాను పార్టీ పిరాయింపుల మొదలై నుంచి నాయకుల స్వేచ్ఛ పూర్తిగా హరించబడిరది. ఇవి జాతీయ రాజకీయాల నుంచి మొదలు, అన్ని రాష్ట్రాలలోనూ ఇదే పరిస్దితి వచ్చేసింది. దీనంతటికీ నాయకుల వ్యవహరశైలితోపాటు, మీడియా పెరుగుదల కూడా ఒక ప్రధానకారణం. ముఖ్యంగా ఎలక్రానిక్ మీడియా వచ్చిన తొలి దశల్లో నాయకులు నిత్యం ప్రజల్లో వున్న వీడియోలు చూసి ఎంతో సంబరపడేవారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో అటు ఉద్యమకారులైనా, నాటి పాలకపక్షాలైనా సరే వారి వారి అభిప్రాయలను వెల్లడిరచి తాము ప్రజల్లోనే వున్నామన్న సంకేతాలు పంపుతూ వుండేవారు. ఏ ఎలక్రానిక్ మీడియా కోసం నాయకులు పాకులాడారో..అదే ఎలక్రానిక్ మీడియా మూలంగా తీవ్రంగా నష్టపోయే పరిస్దితి వచ్చింది. ఇటీవల వచ్చిన సోషల్ మీడియా మూలంగా నాయకులు క్షణక్షణం భయపడాల్సివస్తుంది. ఒకప్పుడు పార్టీ నాయకులు ఆ పార్టీ సిద్దాంతాలు కట్టుబడి మాత్రమే పనిచేసేవారు. ప్రతిపక్షంలో పదేళ్లైనా సరే అదే పార్టీలో వుంటూ ప్రజలకు సేవ చేసేవారు. ఓడినా, గెలిచినా అదే పార్టీలో వుండేవారు. ఆయా పార్టీలలో తీవ్ర స్ధాయిలో అన్యాయం జరిగితే తప్ప, రాజీనామాలు చేసి, ఇతర పార్టీలలోకి వెళ్లేవారు. అంతే కాని ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత కండువాలు మార్చుకునేవారు కాదు. ప్రజల కోరిక మేరకంటూ, అనుచరలు ఒత్తిడి వల్ల అంటూ పార్టీ కండువాలు మార్చేవారు కాదు. పైగా ఇప్పటిలాగా పచ్చి అబద్దాలను నిజం చేయాలని ప్రయత్నించేవారు కాదు. నియోజకవర్గ అభివృద్ది కోసమంటూ పార్టీలు మారే నాయకులు చెప్పడం శుద్ద అబద్దమని అందరికీ తెలుసు. ఇలా నీతి మాలిన రాజకీయాలు ఆనాడు చేసేవారు కాదు. ప్రతిపక్షంలో వున్నప్పుడు పార్టీ అదికారంలోకి వచ్చే దాక పోరాటం చేసేవారు. ప్రజలకు అండగా నిలిచేవారు. పాలకపక్షం మెడలు వంచి, నిధులు తెచ్చి, నిజాయితీ ప్రజా సేవ చేసేవారు. కాని కాలం మారింది. ఏ పార్టీలో గెలిచానా సరే అధికార పర్టీలోకి వెళ్లడం అలవాటు చేసుకున్నారు. దాంతో ప్రజలు కూడా గెలిపించడమే మన పని అనుకుంటున్నారు. తప్ప పార్టీలు మారిన వారిని నిలదీయడం లేదు. వారినే మళ్లీ మళ్లీ ఎన్నుకుంటున్నారు. దాంతో నాయకులు కూడా పార్టీలు మారినా తప్పేం లేదనుకుంటున్నారు. మారుతున్నారు..తర్వాత ఎవరి మొహం ఎవరూ చూడకుండా బతికేస్తున్నారు