`సిఎం నిర్ణయం భవిష్యత్తుకు ఆశాకిరణం.
`ఇప్పుడు అడ్డకుంటే భవిష్యత్తు తరాలకు తీరని ద్రోహం.
`భవిష్యత్తులో మంచి గాలి రాదు.
`మంచినీటి గండం తొలగిపోదు.
`పర్యావరణం ప్రమాదకరంగా మారుతుంది.
`పొల్యూషన్‌కు సొల్యూషన్ లేకుండా పోతుంది.
`హైదరాబాద్ అంటేనే భయపడాల్సి వస్తుంది.
`ఒకప్పుడు హైదరాబాద్ లో సొంత ఇల్లు సోషల్ స్టేటస్.
`ఇప్పుడు పొల్యూషన్‌కు కేరాఫ్ అడ్రస్.
`ఎండాకాలంలో గొంతు తడవదు.
`వానాకాలం వరదలోస్తే చుట్టూ నీరున్నా మంచి నీటి చుక్క అందదు.
`కాలమేదైనా హైదరాబాద్ లో ఎల్లకాలం కష్టకాలమే!
`అందుకే సిఎం. రేవంత్ హైడ్రా తెచ్చింది.
`హైడ్రాను అడ్డుకుంటే అందరికీ నష్టమే!
`అక్రమమని తెలిసినా కొనుక్కున్నారు.
`సంపాదించిన సొమ్ము అక్రమంగా అమ్ముకున్న వారికి కట్టబెట్టారు.
`హైదరాబాద్ లో ఇల్లు కోసం చూశారు..రియల్ వ్యాపార మోసాలు చూసుకోలేకపోయారు.
`చెరువులు లేకనే వరదలు కాలనీలు ముంచెత్తుతున్నాయి.
`చెరువులోనే కట్టిన అప్పార్టుమెంట్లు ఎలా సురక్షితం?
`ఎన్నటికైనా మునిగిపోవుడు ఖాయం.
`తెలిసి తెలిసి కొనుక్కోవడమే ఖర్మం.
`కొంత మంది స్వార్థం కోసం హైదరాబాద్ క్షేమం త్యాగం చేయాలనడం మూర?త్వం.
`అందరి కోసం ఆలోచించినప్పుడు కొందరికి నష్టం జరగడం తధ్యం.
`విల్లాలు కూల్చినప్పుడు చప్పట్లు కొట్టారు.
`మీ ఇంటి మీదకు వచ్చేసరికి శాపనార్థాలు పెడుతున్నారు.
`మురికి కూపంగా మారిన మూసి ప్రక్షాళన ఎప్పటికైనా జరగాల్సిందే!
`రేవంత్ హయాంలో జరుగుతున్నందుకు ప్రజలు సంతోషించాల్సిందే!
`ఎప్పుడూ ఎప్పుడూ అని ఎదురుచూసిన వాళ్లకు ఇప్పుడెందుకు నొప్పి.
`తనదాకా వస్తే గాని తాము చేసిన తప్పేంటో తెలియదు మరి.
`ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ కర్తవ్యం.
`మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను కాపాడడం ప్రభుత్వం బాధ్యత.
`అందుకే మంచి వాతావరణంలోకి ప్రజలను తరలిస్తున్నారు.
`పేదల జీవితాలతో వెలుగులు నింపుతున్నారు.
`అది అర్థం కాక కొందరు, రాజకీయం కోసం పార్టీలు రెచ్చగొడుతున్నారు.
`హైదరాబాద్ బ్రాండ్ పేరుతో కొత్త నాటకానికి తెరతీస్తున్నారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
హైడ్రాను ఆపితే హైదరాబాద్‌కు అధోగతే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం భవిష్యత్తు హైదరాబాద్‌కు ఆశాకిరణం లాంటిది. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఇప్పుడు దానిని అడ్డుకోవడం అంటే హైదరాబాద్ భవిష్యత్తును అంధకారం చేయడమే అవుతుంది. అడ్డుకోవాలని చూసేవారు వారి స్వార్ధ రాజకీయాల కోసం భవిష్యత్తు తరాల జీవితాలను ఫణంగా పెట్టడమే అవుతుంది. రేపటి తరానికి తీరని ద్రోహం చేసినట్లే అని చెప్పకతప్పదు. ఇప్పటికే హైదరాబాద్ వాసుల జీవితం ఆగమ్య గోచరంగా మారుతోంది. నగర జీవితం అంటేనే నరకప్రాయమైపోయింది. అడుగు తీసి అడుగు వేయలేని దుస్ధితి నెలకొన్నది. నగరంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ మూలంగా పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇంట్లో నుంచి పని మీద బైటకు వెళ్లిన వ్యక్తి ఎప్పుడు ఇంటికి చేరుకుంటాడన్న విషయం ఎవరూ చెప్పలేని పరిస్దితి. అడుగడుగునా నలు మూలలా పెరిగిన హైదరాబాద్ అంతా అస్ధవ్యస్తంగా తయారైంది. దానికి ఒక రూపును కల్పించాల్సిన అవసరం వుంది. అటు ట్రాఫిక్ ఇటు పొల్యూషన్‌లో ప్రజలు ఇప్పటికే నరకం అనుభవిస్తున్నారు. వాన కాలం వచ్చిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఎక్కడి నుంచి వరద ఎటు వైపు వస్తుందో అర్ధంకాని పరిస్తితుల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. భారీ వర్షం కురిసిందంటే చాలు గతంలో చుక్క కూడా కనిపించని కాలనీలు కూడా నిండా మునిగిపోతున్నాయి. అందుకు కారణం ఏమిటో అందరికీ తెలుసు. ఒకప్పుడు హైదరాబాద్‌ను చెరువుల నగరంగా గొప్పగా చెప్పుకునేవారు. హైదరాబాద్ చుట్టూ అందమైన సరస్సులతో అలరాలుతూ వుండేది. కాని ఇప్పుడు చూద్దామన్నా కుంట కనిపించడం లేదు. చెరువుల జాడ లేదు. దాంతో వర్షాలకు నీరు కాలనీలను ముంచెత్తుతోంది. పెరుగుతున్న నగరంలో ఏటా వలసలు వస్తున్న జనంతో మరింత నిండిపోతోంది. బతుకుదెరువు కోసం వచ్చేవారు కొందరైతే, హైదరాబాద్‌లో ఇల్లు వుండడం అన్నది సోషల్ స్టేటస్‌గా మారి చేరుతున్నవారు కొందరు. పైగా దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్దఎత్తున ఉపాధికోసం వస్తున్నారు. ఐటి రంగ విస్తరణతో ఎంతో మంది యువత వచ్చి చేరుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. నివాసాల కోసం ఇల్లు కొనుక్కుంటున్నారు. కిరాయిల కోసం పెద్దఎత్తున ఖర్చు చేస్తున్నారు. దాంతో నగరం నలుదిశగా విస్తరించింది. దీనికి తోడు రియల్ వ్యాపారం విస్తరించడంతో నగరానికి దూరంగా వున్న పల్లెలు ఖాళీ అవుతున్నాయి. నగరానికి దగ్గరగా వున్న పల్లెలు మాయమైపోతున్నాయి. నగరంలో కలిసిపోయాయి. ఒకప్పుడు నగరానికి సమీపంలో వున్నప్పటికీ గ్రామాలుగానే వుండేవి. పచ్చటి పల్లె ప్రకృతి వుండేది. కాని ఆ పల్లెలు నగరాలైపోయి, ప్రకృతి విద్వంసమైపోయింది. సాగు లేకుండాపోయింది. చెరువులు ఆనవాలు కూడా లేకుండా పోయి కాంక్రీట్ జంగిల్ గా మారింది. ఎక్కడ చూసినా హైదరాబాద్‌కు నలువైపులా ముప్పై కిలోమీటర్ల వరకు జనమే జనం.. కిక్కిరిసిపోతున్న జనసంచారం. ఇలాంటి పరిస్దితుల మూలంగా భవిష్యత్తు హైదరాబాద్ జీవనం నరకానికి మార్గమైపోతుందని చెప్పడంలో సందేహంలేదు. నగరంలో ఇప్పటికే స్వచ్ఛమైన గాలి దొరకడం లేదు. నగరంలో పెరుగుతున్న జనభాకు తోడు వాహనాల నుంచి వెలువడుతున్న వాయువుల వల్ల మొత్తం పర్యావరణమే దెబ్బతింటోంది. అంతే కాకుండా హైదరాబాద్‌కు మంచినీటి గండం తీవ్రతరమయ్యే పరిస్దితులు ఎదురుకానున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్‌లోని జంట జలాశయాలు నగరానికి సరిపడ, సమృద్దికరమైన స్వచ్చమైన మంటినీటిని అందించేవి. ఇప్పుడు ఆ పరిస్దితులు లేవు. హైదరాబాద్‌కు మంచినీరు అందించే అందమైన జంట జలాశాయాలను మురికూపాలుగా మార్చారు. వాటిని తాగు నీటి అవసరాలకు పనికి రాకుండా చేశారు. ఆ జలాశయాల చుట్టూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టద్దన్న కఠినమైన నిబంధనలున్నా, వాటినే ఆక్రమించి నిర్మాణాలు చేశారు. నగరం పరిసర ప్రాంతాల మురుగును ఆ జలాశయాలలో కలిసి విధంగా ప్రకృతి విద్వంసానికి పూనుకున్నారు. ఒకప్పుడు గండిపేట నీళ్లు తాగిన వాళ్లు ఎంతో ఆరోగ్యంగా వుండేవారు. మంజీర నీళ్లు కూడా అంతే స్వచ్ఛంగా వుండేవి. వాటిని నిర్లక్ష్యం చేసి, కృష్ణా, గోదావరి జలాలంటూ కాంట్రాక్టర్ల ప్రజా నిధులు ఖర్చు చేశారు. జంట జలాశయాల నీళ్లు అందకుండా చేశారు. ఇలా సాగిన విధ్వంసం ప్రకృతిని చెరబట్టేదాక వచ్చింది. రియల్ వ్యాపారానికి రెక్కలు తొడిగి చెరువులు, కుంటలు మాయం చేశారు. వాటిలో బహుళ అంతస్ధుల నిర్మాణాలు చేపట్టారు. చెరువుల్లో చేరాల్సిన నీటిని సమాజం మీదకు వదిలేశారు. చుక్క నీరు భూమిలోకి ఇంకకుండా చేసి మంచి నీటికష్టం కొని తెచ్చుకున్నారు. ఇదే కొనసాగితే హైదరాబాద్ పరిసర ప్రాంతం ఎండాకాలంలో ఎడారిగానూ, వానా కాలంలో నగరాన్ని ముంచెత్తే వరదల్లో కొట్టుకుపోవాల్సిన పరిస్దితులు ఎదురౌతాయి. అందుకే హైదరాబాద్‌కు పూర్వ వైభవం తేవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పించారు. ఆ సంకల్పానికి హైడ్రా పేరుతో రూపకల్పన చేశారు. ఒక వ్యవస్ధను ఏర్పాటు చేసి, విద్వంసమైన చెరువుల రక్షణ, వాటికి పునరుజ్జీవం తీసుకొస్తున్నారు. అందుకే ఆక్రమణల గుర్తింపు వేగవంతం చేశారు. మరో వైపు ప్రభుత్వ భూములను ఆక్రమించి, కబ్జాలకు పాల్పడిన వారి తాట తీస్తున్నారు. హైడ్రా దూకుడుతో ఆక్రమణదారుల గుండెల్లో బుల్లోజర్లు పరుగెడుతున్నాయి. అయితే దీన్ని కూడా రాజకీయం చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నంచేస్తూనే వున్నాయి. ప్రజలను రెచ్చగొడుతున్నాయి. ఒక గొప్ప కార్యక్రమం చేపట్టినప్పుడు ప్రభుత్వానికి తోడుగా, ప్రజలకు బాసటగా నిలవాల్సిన ప్రతిపక్షాలు ఒక గొప్ప కార్యాక్రమాన్ని కూడా రాజకీయం చేయాలని చూడడం విడ్డూరం. మూసీనది పరిసర ప్రాంతాల ప్రజలు ఎప్పుడూ ఏదో ఒక అనార్యోగం పాలౌతుంటారు. అలాంటి వారిని సురక్షిత ప్రాంతాలలో నివాసాలు ఏర్పాటు చేసి తరలించడం తప్పని అనడం ప్రతిపక్షాల విజ్ఞతకే వదిలేయాలి. మూసీ నది అనేది ఒక దట్టమైన అటవీ ప్రాంతాలైన కొండ కోనల్లో నుంచి జాలువారే మంచి నీటి ప్రవాహం. దాన్ని నగరానికి రాకముందే కలుషితం చేసి, దాని పరిసర ప్రాంతాలకు సైతం స్వచ్ఛమైన వాతావరణం అందకుండాపోతోంది. అందువల్ల నగరంలో విస్తరించి వున్న మూసీనది పరీవాహక ప్రాంతాల ప్రజలకు ప్రత్యామ్నాయ నివాసాలు కల్పిస్తున్నారు. మూసీ నది పరివాణంలో ఇరుకు జీవితాలను నుంచి విముక్తి కల్పిస్తున్నారు. ముప్పై నలభై గజాల స్ధలాలలో రేకుల షెడ్డుల్లో మూసీ నది దుర్ఘందాలు, అందులో నుంచి వచ్చే విషపురుగుల మధ్య జీవితాలను గడపడం కన్నా, మంచి సురక్షితమైన ప్రాంతాలలో జీవితాలు గడపడం ఎంతో మంచిది. ప్రజలకోసం రేవంత్ ప్రభుత్వం ఇంత గొప్పగా ఆలోచన చేసి సాగిస్తున్న ప్రకృతి యజ్ఞాన్ని అడ్డుకోవడం అవివేకమే అవుతుంది. మూసీ నదీ పరివాణమంతా శుద్దిచేసి, మూసీలోకి మురుగునీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకొని, చుట్టూ నది పొడవునా రిటైలింగ్ వాల్ ఏర్పాటు చేస్తే ధేమ్స్‌నది ఒడ్డున వున్న లండన్ నగరంలా తయారుచేయడం పెద్ద పని కాదు. గత ప్రభుత్వాలు ఇలాంటి ఆలోచన ఎప్పుడూ చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మూసీ ప్రక్షాళన అంటూ నిధులు నీళ్లలో పోసింది. కాని సాధించింది ఏమీ లేదు. ఉమ్మడిపాలకుల కాలంలో జరిగిన విద్వంసం, తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం మూలంగా హైదరాబాద్ సహజమైన సోయగం మాయమైపోయింది. సరిగ్గా ఇరవై ఏళ్లక్రితం వరకు కూడా హైదరాబాద్ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా వుండేది. ఇరవై ఏళ్లలో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని అనుకుంటున్నాం కాని, విధ్వంసం జరిగి చెల్లా చెదురైంది. తన సహజమైన వాతావరణాన్ని కోల్పోయింది. అందుకే హైదరాబాద్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు ఎంతటి విపత్కరమైన పరిస్ధితులనైనా ఎదుర్కొనేందుకు రేవంత్‌రెడ్డి సిద్దమయ్యారు. హైదరాబాద్‌కు పూర్వ కళ తెచ్చేందుకు కంకణం కట్టుకున్నాడు.