`సివిల్ సప్లయ్ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు
`బియ్యం మింగిన మిల్లర్లు!?
`మిల్లర్లకు ప్రభుత్వానికి మధ్య దళారులెందుకు?
`దొంగ మిల్లర్లు? అబద్ధపు గోడౌన్లు?
`లేని గోడన్ల మాయ! వంటి నేటిధాత్రి కధనాలకు ప్రభుత్వ స్పందన.
`పదేళ్లుగా మిల్లర్లతో సమావేశం కాని ప్రభుత్వ పెద్దలు.
`ప్రజా ప్రభుత్వంలో నేటిధాత్రి వార్తలకు కదలిక.
`నేటిధాత్రి ఒక్క వార్తతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిల్లర్లతో సమావేశం.
`నేటిధాత్రి ప్రస్తావించిన అన్ని అంశాలపై సమావేశంలో విసృతంగా చర్చలు.
`వాటి అధ్యయనానికి కమిటీ ఏర్పాటు!
`నేటిధాత్రికి మిల్లర్ల ప్రశంసలు.
`మిల్లర్ల సమస్యలు వెలుగులోకి తెచ్చినందుకు నేటిధాత్రికి కృతజ్ఞతలు.
`దొంగ మిల్లర్లపై చర్యలకు డిమాండ్.
`దొంగ మిల్లర్లకు సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి.
`సివిల్ సప్లయ్‌ని భ్రష్టు పట్టించిన అధికారుల భరతం పట్టాలి!
`అప్పుడే అన్ని రకాలుగా ప్రక్షాళన పూర్తయ్యేది.
హైదరాబాద్,నేటిధాత్రి:
పదేళ్లుగా మిల్లర్లు ప్రభుత్వం మధ్య లేని చర్చలకు నేటిధాత్రి వార్తా కథనం దారితీసింది.. ఒక రకంగా ప్రభుత్వం, మిల్లర్ల సమావేశానికి మార్గమైంది. ప్రభుత్వానికి మిల్లర్లకు మధ్య దూరం తొలగిపోయేలా చేసింది. మిల్లర్లు, ప్రభుత్వానికి మధ్య దళారులెందుకు? అని నేటిధాత్రి ప్రశ్నించింది. ప్రభుత్వ యంత్రాంగం కదలివచ్చింది. పౌరసరఫరా శాఖలో కదలిక వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వార్త వెళ్లింది.
పది సంవత్సరాల బిఆర్‌ఎస్ పాలనలో ఇలాంటి సన్నివేశం మృగ్యమైపోయింది. ఆగమైన సివిల్ సప్లయ్ శాఖను గాడిలో పెట్టే తీరిక లేక గత ప్రభుత్వం మీనమేషాలు లెక్కబెట్టింది. మిల్లర్లు ఎన్ని సార్లు ప్రభుత్వాన్ని కోరినా అప్పటి ప్రభుత్వం పెడచెవిన పెట్డింది. సివిల్ సప్లయ్ శాఖ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని ఎన్ని వార్తలు నేటిధాత్రి రాసినా చెవిడి వాళ్ల ముందు శంఖం ఊదినట్లైంది. సివిల్ సప్లయ్ శాఖలో వేల కోట్ల బకాయిలు పేరుకుపోతున్నాయని చెప్పినా దున్నపోతు మీద వాన కురిసినట్లే అయ్యింది. పట్టించుకున్న పాపాన పోలేదు. దాంతో బకాయిలు ప్రభుత్వానికి గుదిబండగా మారాయి. దళారులు దూరేలా చేశాయి. రైతులు పండిరచిన వడ్లు మిల్లర్లకు ఆదాయమార్గాలయ్యాయి. బకాయిలు కొండలా పేరుకుపోవడానికి కారణమయ్యాయి. అయినా గత ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ప్రభుత్వ బాండ్లను తనఖా పెట్టి, మారటోరియం పేరు చెప్పి కేసిఆర్ ప్రభుత్వం అప్పులు చేసిందే గానీ, మిల్లర్లు నుంచి బకాయిలు వసూలు చేయలేదు. సివిల్ సప్లయ్ అధికారులను పురమాయించలేదు. వారిని బకాయిల వసూలుకు పురిగొల్పలేదు. మిల్లర్లు ఇష్టా రాజ్యాంగా వ్యవహరిస్తున్నా పట్టించుకోలేదు. పేరుకుపోతున్న వేల కోట్ల బకాయిల మీద దృష్టి సారించలేదు. దాంతో ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం రాకుండా ఆగిపోయింది. అయినా మిల్లర్ల దాహం తీరలేదు. కాకపోతే ఇక్కడ అందరు మిల్లర్లు ప్రభుత్వాన్ని మోసం చేయలేదు. కొంత మంది బోగస్ మిల్లర్లు తమ చేతి వాటం ప్రదర్శించారు. లేని మిల్లులు సృష్టించారు. తమవి కాని గోడౌన్లను లెక్కల్లో చూపారు. ప్రభుత్వం ఇచ్చిన వడ్లను అమ్ముకున్నారు. కోట్లు వెనకేసుకున్నారు. సివిల్ సప్లయ్ అధికారుల సహకారంతో వడ్లు, బియ్యం అమ్ముకొని ఆస్థులు కూడా బెట్టుకున్నారు. ప్రజా ప్రభుత్వానికి పూర్తి విషయాలు, వివరాలు అందిస్తూ, మిల్లర్ల మోసాలపై నేటిధాత్రి వార్తలు రాస్తోంది. సరిగ్గా రైతుల నుంచి వడ్లు సేకరించే సమయంలో ప్రభుత్వానికి సమాచారం చేరేలా నేటిధాత్రి వార్తలు ప్రచురించింది. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయంలో కదలిక వచ్చింది. సిఎం. రేవంత్ రెడ్డికి వివరాలు అందడంతో వడ్ల సేకరణ మీద హుటాహుటిన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మిల్లర్లను కూడా ఆహ్వించారు. వారి సూచనలు తీసుకున్నారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశం మూలంగా సివిల్ సప్లయ్‌లో కదలికలు వచ్చినట్లే కాదు. ఆ దిశగా అడుగులు పడినప్పుడు అసలైన కార్యాచరణ. అసలు బియ్యం మింగిన మిల్లర్లు ఎవరు? ఎంత మంది అనేది ముందు తేల్చాలి. లేకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు వుంటుంది. ఇక మిల్లర్లు, ప్రభుత్వానికి మధ్య దళారులెందుకు? అనేదానిపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వం ఇచ్చిన వడ్లును మిల్లర్లు మింగారా? మిల్లర్ల పేరు చెప్పి దళారులు తిన్నారా? ఇద్దరూ కలిసి మొత్తం బుక్కేశారా? అనేది వెల్లడి కావాలి. మిల్లర్లలో దొంగ మిల్లర్లు వేరయా? అన్నది కొత్త కథ. మిల్లర్లలో కూడా దొంగ మిల్లర్లు వున్నారనే విషయం సహజంగానే ఆందోళనకరమైనది. అసలు మిల్లులేని మిల్లర్లు, లేని గోడౌన్లతో కోట్లు కూడబెట్టుకున్నారంటే సామాన్యమైన విషయం కాదు. అందువల్ల దొంగ మిల్లర్లు? ఎవరు అనేది వెలుగులోకి రావాలి. మిల్లులు లేకున్నా మిల్లర్ల వ్యాపారానికి ఎందుకొచ్చారో తెలియాలి. వారిని ఎవరు పరిచయం చేశారో తెలియాలి. వారికి అండగా నిలిచిన వారి బాగోతం కూడా బైటకు రావాలి. నిజాలు నిగ్గు తేలాలి. దొంగ మిల్లర్ల మీద కేసులు నమోదు చేయాలి. వారిపై కఠినమైన చర్యలను చేపట్టాలి. అంతే కాకుండా అబద్ధపు గోడౌన్లు? ఎందుకు సృష్టించారు. పదేళ్లలో ఎన్ని లక్షల టన్నుల వడ్లు మాయం చేశారు. వివరాలు లెక్కలు తీయాలి. లేని గోడన్ల మాయ! వంటి నేటిధాత్రి కధనాలకు ప్రభుత్వ స్పందించింది. దానిపై పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాలి. నేటిధాత్రి ప్రస్తావించిన అన్ని అంశాలపై సమావేశంలో విసృతంగా చర్చలు జరిగినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వానికి, మిల్లర్లకు మధ్య వున్న దూరం, ఒక రకంగా చెప్పలేని అగాధం పూడుకున్నదనే చెప్పాలి. ప్రభుత్వం తమను సమావేశానికి ఆహ్వానించడంతో నేటిధాత్రికి మిల్లర్ల ప్రశంసలు కురిపించారు. మిల్లర్ల సమస్యలు వెలుగులోకి తెచ్చినందుకు నేటిధాత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా అసలైన మిల్లర్లు కూడా దొంగ మిల్లర్లపై చర్యలకు డిమాండ్ చేయడం జరిగింది. దొంగ మిల్లర్లకు సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. సివిల్ సప్లయ్‌ని భ్రష్టు పట్టించిన అధికారుల భరతం పట్టాలి! అని ప్రజల నుండి డిమాండ్ పెరుగుతోంది. అప్పుడే అన్ని రకాలుగా ప్రక్షాళన పూర్తయ్యేదని తెలంగాణ సమాజం కోరుకుంటోంది.