`చిత్రపురి అక్షర పోరాటంలో ఎప్పుడూ ముందుంది నేటిధాత్రి.
`జౌర్ ఏక్ దక్కా చిత్రపురి కార్మికుల గెలుపు పక్కా!
`కార్మికపక్షాన పోరాటంలో తమ్మినేని.
`కార్మికుల పోరులో అక్షర సహకారం నేటిధాత్రి.
`పోరాడితే పోయేదేమీ లేదంటున్న తమ్మినేని.
`ఉద్యమానికి నిరంతర చేయూతనందిస్తున్న నేటిధాత్రి.
`అటు పోరు జెండాలు, ఇటు అక్షర గాండీవాలు తోడుగా వున్నాయి.
`కార్మికులు మరింత గట్టిగా గళం వినిపించాలి.
`చిత్రపురిలో జరిగిన అన్యాయన్ని ధైర్యంగా ఎదిరించాలి.
`హక్కుల సాధన కోసం పరిశ్రమించాలి.
`విశ్రమించకుండా కల సాకారం చేసుకోవాలి.
`దిక్కులన్నీ ఏకమయ్యేలా దీక్షలు చేయాలి.
`కార్మిక వాణి ప్రపంచానికంతటికీ తెలియాలి.
`ప్రభుత్వ దిగివచ్చి న్యాయం చేయాలి.
`ఇప్పటికీ మించి పోయింది లేదు.
`చిత్రపురిలో జొచ్చిన పాములను తరిమేయాలి.
`విషనాగుల కోరలు పీకేయాలి.
`సినిమా గద్దల పని పట్టాలి.
`ఇప్పుటి దాకా వేడుకున్నది చాలు.
`వేడుకోలుతోనే ఒక తరం చీకట్లో కలిసిపోతోంది.
`మలితరానికైనా వెలుగులు నిండాలంటే కార్మికులు పోరుబాట పట్టాలి.
`మీ ఇల్లు మీరు సొంతం చేసుకోవాలి.
`చిత్రపురి స్థలం మీది..
`సొసైటీ సొమ్ము మీది..
`ఆ ఇండ్లు మీవి.
`మీ ఆకలి కేకలేకాదు…ఆగ్రహం కూడా చూపించండి.
`అప్పుడు గాని పేదవాడి కోపం కనిపించదు.
`చిత్రపురిలోని గద్దలు పారిపోవు.
హైదరాబాద్,నేటిధాత్రి:
ఇంత కాలం అడిగింది చాలు..అడుక్నున్నదిచాలు. వేడుకున్నది చాలు. కన్నీళ్లతో కాలం గడిపింది చాలు. ఏడ్చిన కాలం తుడిచేయండి. ఏడ్చి ఏడ్చి ఎర్రగా మారిన కండ్లను తెరవండి. ఎరుపెక్కిన కళ్లతో నిలదీయండి. ప్రశ్నించండి. మా భూమి మాకేనంటే నినదించండి. చిత్రపురి మాదే అని గర్జించండి. చిత్రపురి మాది. స్ధలం మాది. సొసైటీ మాది. సొమ్ము మాది. అని తేల్చి చెప్పండి. ఇంకెంత కాలం మోసం చేస్తారని ఎదిరించండి. మీ స్ఠలాలు మీకు సొంతమయ్యేదాకా పోరాటంచేయండి. పోరాడితే పోయేదేమీ లేదన్నది తెలుసుకోండి. చేతులెత్తి మొక్కిన చేతులతో జెండాలు పట్టుకోండి. ఎవరో చెప్పిన జెండాలు, ఇప్పటిదాకా అనుసరించి ఎజెండాలు పక్కన పెట్టండి. పోరాటం చేసేవారు కార్మికులకోసం వున్నారు. పోరాటాలలో విజయాలుసాధించిన సిపిఎం. అగ్ర నాయకుడు తమ్మినేతి వీరభద్రం లాంటి వారు అండగా వున్నారు. నిరంతరం కార్మికుల హక్కుల కోసం అక్షర పోరు సాగిస్తున్న నేటిదాత్రి అండగావుంది. కార్మికులకు న్యాయం జరిగేదాక వుంటుంది. ప్రతి కార్మికుడికి ఇల్లు వచ్చేదాకా అక్షర గాండీవాలను ఎక్కు పెడుతూనే వుంటుంది. కార్మికుల పొట్టగొట్టిన వారిని కడిగేస్తూనే వుంటుంది. కార్మికుల గూడులో చేరిన వారి బైట ప్రపంచానికి చూపిస్తూనే వుంటుంది. ఇంకా మీకెందుకు అలసట. ఇంకెందుకు మీకు ఆవేదన. ఏడ్చే కన్నీళ్లను ఎవరూ తూడ్వలేరు. ఎరుపెక్కిన కళ్లనే అందరూ చూస్తారు. చిత్ర పురి మీది. చిత్రపురిలో హక్కు మీద. సినిమా చాన్స్‌ల కోసం పడిన మీ తపన మీ గూడు కోసం కూడా చూపించండి. చిత్రపురిలో ఇంటి కోసం కొట్లాడితే అవకాశాలు రావనే భయంలో బతక్కండి. సినిమాలో పని దొరకక్కదన్న అభద్రతలో వుండకండి. కార్మికులు లేకుండా సినిమా లేదు. కార్మికులులేకుండా సినిమా ఒక్క అడుగు ముందుకు పడదు. అసలు సినిమా నిర్మాణమే జరగదు. సినీ కార్మికులను కాదని సినిమా తీస్తే అడ్డు పడండి. అడ్డుకోండి. ఇతర ప్రాంతాల కార్మికులను తెచ్చుకొని సినిమా తీస్తామంటే తరిమేయండి. లేకుంటే మీకు ఇల్లు రాదు. సినిమా అవకాశాలు రావు. అర్ధించినంత కాలం మీరు బానిసలే..సనీ గద్దలకు బానిసలే. మీ కష్టం దోచుకొని కోట్లు సంపాదించుకుంటున్నారు. మీ కష్టాన్ని ఇటుకలు చేసుకొని ఇండ్లు లాక్కుంటున్నారు. ప్రతి మనిషికి కూడు, గూడు,గుడ్డ అవసరం. అవి తీరాలంటే పనులు కావాలి. ఆ బలహీనతే కార్మికులను రోడ్డున పడేస్తుంది. సినిమా పెద్దల చేతుల్లో కీలుబొమ్మలను చేస్తోంది. కార్మికులకు ఆకలే కాదు. ఆవేశం కూడ వుండాలి. ఆందోళన చేసి సాధించుకోవాలి. ప్రశ్నించి నిలదీయాలి. ఎదిరించి హక్కులు సాధించుకోవాలి. దేశ స్వాతంత్య్రం కూడా కొట్లాడితేనే వచ్చింది. పోరాటం చేస్తేనే వచ్చింది. అలుపెరగని ఉద్యమం సాగిస్తేనే వచ్చింది. ఒక్కసారి విశ్రమిస్తే ఇక ఎప్పుడైనా వెనుకడుగే..అప్పుడప్పుడూ చేసేది ఉద్యమం కాదు. విరామాలు ఇచ్చుకుంటూ పోరాడితే న్యాయం జరగదు. పోరాటమే కాదు ఆరాటం కూడా వుండాలి. అందుకు ఆచరణ కావాలి. ముందడుగు వేసే ధైర్యం కావాలి. ఆ శక్తి ప్రతి కార్మికుడిలోనూ వుండాలి. అప్పుడే చిత్రపురి కార్మికుల సొంతమౌతుంది. ఎవరో వస్తారని , ఏదో చేస్తారని ఎదురుచూడడం మానుకోండి. మీ కోసం కలిసి వచ్చే వారితో కలిసి పోరు బాట ఎంచుకోండి. సిపిఎం. అగ్రనేత ఎప్పటి నుంచో చెబుతున్నారు. మీకు అండగా కలిసి సాగారు. మీ కోసం ఉద్యమాలు చేశారు. కాని కార్మికులలో ఐక్యత ఇంకా పూర్తిగా లేదు. ప్రతి సమాజంలోనూ అవకాశవాదులుంటారు. అలాంటి వారు మీ సమూహంలోనే వుంటారు. అలాంటి అవకాశవాదులను గుర్తించండి. మీ కోసం కలిసి రాని కార్మికులను పక్కన పెట్టండి. ఎందుకంటే అవకాశవాదులు కలిసి రాదు. కార్మికులందరనీ ఏకం కానివ్వరు. సినీ పెద్దల జేబులుగా పనిచేసే వారు మీ పక్కనే వుంటారు. మీకు ఎప్పటికిప్పుడు వెన్ను పోటు పొడుస్తూనే వుంటారు. వెళ్లకున్న ఎంగిలి మెతుకులు మీకు విసిరేసి వడ్డించిన విస్తరి సుష్టుగా సినీ పెద్దలు బోంచేస్తున్నారు. వేల కోట్ల రూపాయల విలువైన భూములు సినీ గద్దలు సొంతం చేసుకొని కార్మికులకు పని కల్పిస్తున్నారు. ఎంగిలి మెతుకుల కార్మికుల మొహాన కొడుతున్నారు. ఇప్పటికైనా కార్మికులు కళ్లు తెరవండి. అమాయకపు ఆలోచనల నుంచి దూరంగా జరగడండి. కార్మికుల్లో వుండే కలతలు పక్కనపెట్టుకోండి. అంతా ఏకమైతే వేల కోట్ల రూపాయల విలువైన భూమిని సొంతం చేసుకోండి. చిత్రపురి సొసైటీలో సినీ పెద్దలెందుకు? కార్మికులకు చేతగాదా? కార్మికులు సొసైటీని నడుపుకోలేరా? చిత్రపురిలో కార్మికులకు చోటు లేకుండాపోవడానికి కారణమేమిటి? నటులందరికీ ఆస్ధులున్నాయి. నిర్మాతలకు, దర్శకులకు ఆస్దులున్నాయి. భూములున్నాయి. మీ భూముల మీదకు వస్తుంటే ఏం చేస్తున్నారు. కార్మికులకు మాయ మాటలు చెప్పి, ఎప్పుడో మోసం చేశారు. ఇంకా చేస్తూనే వున్నారు. అసలు చిత్ర పురిలో జరిగిన స్కామ్ అంత ఇంతా కాదు. 67 ఎకరాల భూమి విలువ వేల కోట్లు. సుమారు 3వేల కోట్ల విలువైన స్ధలం. ఆ స్థలమే మీ సొంతమైమతే ప్రతి కార్మికుడు ఒకసినిమా తీయొచ్చు. కార్మికులే నిర్మాతలు కావొచ్చు. లారీ డ్రైవర్లు ఓనర్లు కాలేదా? కార్మికులు నిర్మాతలు కాలేరా? ఇతర రంగాలలో రాణించలేరా? మీరే దర్శకులు కాలేరా? మీరే నటులై పాత్రలు పోషించలేరా? తరం మారుతోంది. నిన్నటి తరం హీరోల వారసులే హీరోలా…కార్మికులలో కళలేదా? కళాకారులు కాలేదు. ఇతర రంగాలలో వారికి ప్రతిభ లేదా? ముందు మీరు మేలుకోండి. చిత్రపురి సొంతం చేసుకొని, సొసైటీ పేరుతో సినిమాలు తీయండి. మీ ఇల్లు మీ సొంతం చేసుకొని గూడు సమకూర్చుకోండి. కార్మికులలో ఎంతో మంది ప్రతిభావంతులున్నారు. కార్మికుల సలహాలు తీసుకుంటూ సినిమాలు తీస్తున్నవారున్నారు. కార్మికులు చెప్పే కథలను సినిమాలకు అలులతున్నవారున్నారు. మొత్తం సినిమా అంతా కార్మికులచుట్టే తిరుగుతుంది. ఒక్కసారి ఇప్పుడున్న సినీ గద్దల సినిమాకు దూరంగా వుండండి. అప్పుడు సినీ లోకమంతా విలవిలలాడుతుంది. కాని ఎక్కడ కడుపు కాలుతుందో…ఆకలి దహిస్తుందో..అని వాళ్లకన్నాముందే కార్మికులు తమ అచేతనం చూపిస్తున్నారు. నిర్మాతులు లేకుంటే బతకలేమనుకుంటున్నారు. సినిమాలు రాకపోతే బువ్వ తినలేమనుకుంటున్నారు. అందుకే కార్మికులంతా గొడుగు పట్టుకోవడంతోనే ఆగిపోతున్నారు. కార్యవాన్‌ల తలుపులు తెరిచేందుకే పనికొస్తున్నారు. సినిమాలో ఓ మూలన నిలబడి ఒక్కసారి తెరమీద కనిపిస్తే చాలనుకుంటుకుంటున్నారు. తెలంగాణలో ఎంతో మంది స్వతహసిద్దితో కళాకారులౌతున్నవాళ్లున్నారు. తెలంగాణ మట్టిలో పాట వుంది. సంగీతంవుంది. తెలంగాణ జీవితమే ఒక కథలా వుంటుంది. వాటిని పట్టుకొని సినిమా తెరకెక్కించండి. అంతే కాని ఎవరి కాళ్లో పట్టుకుంటేనే బతుకుతామన్న భావన నుంచి బైటకు రండి. సమాజంలో ఏ రంగంలో చూసినా ఎదుగూ బొదుగూ వుంటుంది. కాని సినీ కార్మికుల జీవితాలు ఎందుకు అక్కడే వుంటున్నాయి. ఒక బట్టలషాపులో పనిచేసే వ్యక్తి కొంత కాలం తర్వాత చిన్నగా బట్టల దుకాణం పెట్టుకుంటాడు. కొంత కాలం టైలరింగ్ నేర్చుకున్నవ్యక్తి సొంతంగా టైలరింగ్ షాపు పెట్టుకుంటాడు. కాని ఒక్క సినీ రంగంలోనే జీవితాంతంకార్మికుడిగానే వుంటాడు. వయసైపోయిన తర్వాత ఎవరు సాయం చేస్తారా? అని ఎదురు చూస్తుంటాడు. అసంఘటిత కార్మికులకు వున్న వెసులుబాటు సినీ కార్మికులకు లేదు. అందువల్ల మీ చిత్రపురిని మీరు సొంతం చేసుకోవడమే అందుకు పరిష్కారం. కార్మికులకు చిత్రపురి విషయంలో తీరని అన్యాయం జరిగిందని అన్ని వర్గాలలో సానుభూతి వుంది. కాని కార్మికుల పోరాటంలోకొంత అలసత్వం వుంది. నిర్లక్ష్యం కూడా కనిపిస్తోందని చెప్పడంలో సందేహం లేదు. చిత్ర పురి విషయంలో నేటిధాత్రి లాంటి మీడియా ఎంతో ఆది నుంచి సపోర్టు చేస్తున్నప్పటికీ కార్మికుల విడతల వారీ పోరాటం వల్ల ప్రతిసారి మళ్లీ మొదటికొస్తోంది. ఇప్పటికైనా సరే కార్మికులు అందరూ ఒక్కతాటి మీదకు రావాల్సిన అవసరం వుంది. పాలకులు మారినప్పుడల్లా, ఎన్నికలు వచ్చినప్పుడల్లా మాత్రమే కార్మికులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. తర్వాత మర్చిపోతున్నారు. పూర్తి స్దాయి చిత్తశుద్దితో కూడా కార్మికులు పోరాటంచేయాల్సిన అవసరం వుందన్నది కూడా అంగీకరించాలి. విరామం లేని ఉద్యమం సాగిస్తే తప్ప సమస్య పరిష్కారం కాదన్నది తెలుసుకోవాలి.