
ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన
వైద్యులపై పోలీసులకు ఫిర్యాదు
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందిందంటూ మృతిరాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన సంఘటన జమ్మికుంట పట్టణంలోని శ్రీరామ మల్టీస్పెషాల్టి హాస్పిటల్ లో చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. వీణవంక మండలం శ్రీరాములపేట గ్రామానికి చెందిన మ్యాడగోని మానస (24) పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన జొంగోని ప్రశాంత్ కు వివాహం జరిగింది. మానసకు మొదటి కాన్పులో బాబు జన్మించగా.. రెండవ కాన్పు కోసం సోమవారం పట్టణంలోని శ్రీరామ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం ఆపరేషన్ చేసిన వైద్యులు బాబు జన్మించినట్లు చెప్పారు. అనంతరం మానసకు విపరీతంగా నొప్పులు రావడంతో పాటు లోబీపీ కి గురి కావడంతో విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకెళ్లగా… నిర్లక్ష్యంగా వ్యవహరించచారని మృతురాలి బంధువులు ఆరోపించారు. సాయంత్రం వరకు పరిస్థితి విషమించడంతో వైద్యులు మానసను వరంగల్ లోని హజార ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలిస్తున్న క్రమంలో మృతి చెందినట్లు చెప్పారు. మానస మృతికి జమ్మికుంట వైద్యులే కారణం అంటూ మృతదేహంతో ఆసుపత్రి ఎదుట బుధవారం ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న జమ్మికుంట రూరల్ సీఐ సురేష్, హుజురాబాద్ రూరల్ సీఐ సంతోష్ లు పోలీసు బలగాలతో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. తన భార్య చావుకు మత్తు వైద్యుడు సుధాకర్ రావు (మమత హాస్పిటల్), శ్రీరామ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు రాణి, ముక్కా రాములు కారణమని, మత్తు డోసు ఎక్కువ ఇవ్వడంతో పాటు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మానస మృతి చెందిందని భర్త శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం పై ఆసుపత్రి వైద్యులను వివరణ కోరగా వారి నుండి ఎలాంటి స్పందన లేదు.