ఓపెన్ కాస్ట్ భూ నిర్వాసితుల పట్ల సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం

ఆదుకోమంటూ ఎమ్మెల్యేను అభ్యర్థించిన గుత్తేదారు పల్లె భూనిర్వాసితులు

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని రామారావు పేట గ్రామపంచాయతీ అనుసంధాన గ్రామం గుత్తదారుపల్లె ఓపెన్ కాస్ట్ భూ నిర్వాసితులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ని కలిసి తమని ఆదుకోవాలి అంటూ వినతి పత్రం అందజేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే గుత్తేదారుపల్లె గ్రామం ప్రజలు సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు కింద తమ భూములను పూర్తిగా కోల్పోవడం జరిగిందని, ప్రభుత్వం నిర్వహించిన సర్వేలు నష్టపరిహారానికి తామంతా అర్హులుగా నిర్ధారించినప్పటికి సింగరేణి యాజమాన్యం చిన్నచిన్న కారణాలను చూపిస్తూ సుమారు 25 కుటుంబాలకు రావలసిన నష్టపరిహారాన్ని నిలిపివేయడం జరిగిందనీ, గ్రామంలోని 130 కుటుంబాలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయినప్పటికీ నష్టపరిహారం పొందని మా కుటుంబాలన్నీ ఎటు వెళ్లాలో తెలియక అక్కడే ఉండిపోయామని, ఓపెన్ కాస్ట్ నిర్వహణ వలన ప్రతినిత్యం చుట్టూ దుమ్ము ,ధూళి ,భీకర పేలుళ్ల శబ్దాలతో భయభ్రాంతులకు గురవుతున్నామని, బండ రాళ్లు ఇండ్లపై విరుచుకుపడుతుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నామని, నీటి వసతి లేక సరైన రోడ్డు సౌకర్యం, సక్రమమైన విద్యుత్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మాలాగే నష్టపోయిన పక్క గ్రామం అయినటువంటి సింగపూర్ గ్రామస్తులకు కుటుంబానికి ఒక గుంట భూమి చొప్పున కేటాయించి సింగరేణి యాజమాన్యం వారిని ఖాళీ చేయించడం జరిగిందని, అదేవిధంగా మా కుటుంబాలకు కూడా ఒక గుంట భూమి చొప్పున భూమిని కేటాయించి ఆదుకోవాలని, స్థలం కేటాయిస్తే గ్రామాన్ని వదిలి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. సింగరేణి వారు ప్రతిపాదించిన సింగరేణి క్వార్టర్స్ కుటుంబానికి ఒకటి చొప్పున తాత్కాలికంగా కేటాయించకుండా శాశ్వతంగా మా పేర్లు మీద అందించే విధంగా చూడాలని, నిరుపేద కుటుంబాలైనా మాకు తగు న్యాయం జరిగే విధంగా సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఆదుకోవాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి విన్నవించుకోవడం జరిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి సమస్యపై సానుకూలంగా స్పందించి వెంటనే మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ తో మాట్లాడడం జరిగింది. ఈ సమస్యపై చర్చించడానికి బాధితులకు కలెక్టర్ సమయం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 25 కుటుంబాల గుత్తేదారుపల్లె భూ నిర్వాసితులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!