ప్రకృతి విపత్తును రాజకీయం చేస్తున్నారు
ప్రమాదంపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది.
నాగర్ కర్నూల్ /నేటి ధాత్రి.
మాజీ మంత్రి హరీష్ రావుతో సహా బీఆర్ఎస్ నేతలు రాజకీయ ప్రయోజనాలు, తమ ఉనికి కోసమే బీఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గాంధీభవన్ లో శుక్రవారం మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు బాధ్యతరహితంగా వ్యవహరిస్తున్నారని, ఎస్ఎల్బీసీపై నిస్సిగ్గుగా బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారాలు చేస్తున్నారని, ప్రకృతి విపత్తును కూడా రాజకీయం చేసి.. పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై మా ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, సీయం రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారని, మంత్రులం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నామని వెల్లడించారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు రెస్క్యూ టీం శతవిధాల ప్రయత్నిస్తున్నాయని, నిపుణుల బృందం సలహాలు, సూచనల మేరకే సహాయక చర్యలపై ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. 8 మంది ప్రాణాలతో ముడిపడ్డ సంఘటన జరిగితే.. బీఆర్ఎస్ శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ టన్నెల్ ఏడుగురు చనిపోతే మీలాగా మేము శవరాజకీయాలు చేయలేదని, అప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సంఘటన స్థలానికి వెళ్లారా అని ప్రశ్నించారు. కొండగట్టు బస్సు ప్రమాదం, పాలమూరు రంగారెడ్డి ప్రమాదం, శ్రీశైలం పవర్ హౌస్ లో అగ్నిప్రమాదం వంటివి చోటు చేసుకున్నప్పుడు అప్పట్లో ముఖ్యమంత్రి, మంత్రులు సంఘటన స్థలానికివెళ్లడం కానీ, బాధితులను పరామర్శించిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు. శ్రీశైలం పవర్ హౌస్ లో ప్రమాదం జరిగితే అప్పుడు పీసీసీ అధ్యక్షులుగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారని, అయినా మా ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను అడ్డుకోలేదని తెలిపారు. వందలాది కార్లలో మందిమార్బలంతో యుద్ధానికి వెళ్లినట్లు ఎస్ఎల్బీసీ సందర్శనకు వెళ్లారని ద్వజమెత్తారు. సంఘటన జరిగిన వెంటనే ఎస్ఎల్బీసీకి ఎందుకు రాలేదని నిలదీశారు. కృష్ణ బేసిన్ లోని సాగునీటి ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం చేసిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వమని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం అందించే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు విషయంలో రాద్ధాంతం చేయడం తగదని హితవు పలికారు. నల్గొండ ప్రజల సాగు, తాగునీటి కష్టాలు తీర్చే ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు.ఇతర సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణంలో వందల కిలోమీటర్లు తవ్వామని గొప్పగా చెప్పుకునే హరీష్ రావు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ను వారి హాయంలో ఎందుకు పూర్తి చేయలేదని?, ఎస్ఎల్బీసీలో ఇలాంటి ప్రమాదం జరుగుతుందని ముందే కలగన్నారా? లేదా ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తే కాంగ్రెస్ కు క్రెడిట్ వస్తుందని పూర్తి చేయలేకపోయారో ? ఆయన సమాధానం చెప్పాలన్నారు.