నత్తనడకన రైల్వే బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు….
ఎంపీ, ఎమ్మెల్యే లు చెప్పినా బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనుల్లో జాప్యం ఎందుకో…..
సంక్రాంతికి బ్రిడ్జి మీదుగా రవాణా అన్నారు…! ఏ సంక్రాంతికో….
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణం నత్త నడకన సాగుతుండడంతో రైల్వే లైన్ పై రైల్వే శాఖ నిర్మించిన బ్రిడ్జి జీవితకాలం పూర్తి అయినా సరే నిర్మాణ పనులు జరిగేట్లు కనబడడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు.
గత సంవత్సరం నవంబర్ లో క్యాతనపల్లి బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు పనులను పరిశీలించి సంక్రాంతి కల్లా బ్రిడ్జిపై రవాణా సాగేలా చర్యలు తీసుకుంటున్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లు అన్నారు. అందుకు భిన్నంగా బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. నాలుగు నెలలు గడుస్తున్నా సరే బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకననే కొనసాగుతున్నాయి. రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలు మంచిర్యాలకు వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే లైన్ పై రైల్వే శాఖ గత 12 సంవత్సరాల క్రితం నిర్మించిన బ్రిడ్జ్ జీవితకాలం పూర్తయినా సరే అప్రోచ్ రోడ్డు పనులు పూర్తయ్యేలా కనబడడం లేదని పుర ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన సంవత్సరం కాలంలోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి రవాణా సైతం జరిపించేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే తెలిపిన సరే కాంట్రాక్టర్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడని, నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతాయోనని వాహనదారులు వాపోతున్నారు. వచ్చే సంక్రాంతి పండుగ వరకైనా బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయితాయో లేదోనని పుర ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. పాలకులు మారినా మా తలరాతలు మారడం లేదని ప్రజలు బోరమంటున్నారు. సమస్యలను చెప్పుకునేందుకు ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా అర్థం కావడం లేదని, సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోతున్నాయని ప్రజలు ఒకింత అసహనానికి గురవుతున్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులు, సమస్యల పరిష్కారం త్వరతగతిన కాకుంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి పెద్ద సవాల్ గా మారబోతుందని విశ్లేషకులు అంటున్నారు.ఏదేమైనప్పటికిని బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయించి బ్రిడ్జి పై రవాణా జరిగేలా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.