జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ వి.బి.నిర్మలా గీతాంబ
వరంగల్, నేటిధాత్రి (లీగల్), ఫిబ్రవరి, 19:-
జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్- మార్చి, 08వ తేదీన శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించతలపెట్టామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వరంగల్ వి.బి.నిర్మలా గీతాంబ తెలియజేశారు.
ఈ సందర్భంగా న్యాయ సేవా సదనం బిల్డింగ్ లో రెండు వేర్వేరు సమావేశాలను నిర్వహించడం జరిగింది. మొదటగా ఇన్సూరెన్స్ సంబంధ, చిట్ ఫండ్ కంపెనీ మరియు బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు మాట్లాడుతూ “రాజీ మార్గమే రాజమార్గం” అని తెలిపారు. మార్చి, 08-2025 శనివారం రోజున నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడదగు క్రిమినల్, సివిల్, వివాహ /కుటుంబ తగాదా కేసులు, మోటార్ వెహికల్ యాక్ట్, బ్యాంకు, చిట్ ఫండ్, ఎక్సైజ్ కేసులు, ఎలక్ట్రిసిటీ సంబంధ కేసులను మరియు రాజీ పడదగు ఇతర కేసులు పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కనుక ఇన్సూరెన్స్ బ్యాంకు మరియు చిట్ ఫండ్ అధికారులు కోర్టులలో పెండింగ్ లలో ఉన్న తమ తమ కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించుకొని లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని కోరారు.
కావున కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకుని, ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించుకోవాలని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ లో అధిక కేసుల పరిష్కారానికి తేదీ:17.02.2025 నుండి ప్రి-లోక్ అదాలత్ ను న్యాయ సేవాధికార సంస్థ, వరంగల్ ఆధ్వర్యంలో ప్రారంభించామని తెలిపారు. ఈ ప్రి-లోక్ అదాలత్ కక్షిదారుల కేసును ఇరుపక్షాల అంగీకారంతో రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి సులభతరం అవుతుందని భావిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి యం.సాయికుమార్, వరంగల్ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు తీగల. జీవన్ గౌడ్, పోలీస్ ఉన్నతాధికారులు షేక్ సలీమా, రవీందర్ ఇతర పోలీసు అధికారులు, ఎక్సైజ్ అధికారులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు, బ్యాంకు, ఇన్సూరెన్స్, చిట్ ఫండ్ అధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.