నేటిధాత్రి, జనగామ జిల్లా
ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా, నర్మెట్ట పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐ సస్పెండ్. వివరాల్లోకి వెళితే భూ సమస్య విషయంలో బాధితులపై అక్రమ కేసులు నమోదు చేసి బాధిత వ్యతిరేకులకు భూమిని స్వాధీనం పర్చేందుకు యత్నించిన నర్మెట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగబాబు, నర్మెట్ట పోలీస్ స్టేషన్ ఎస్ఐ అనిల్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ వి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. భూ తగాదా విషయంలో గత ముప్పై సంవత్సరాలుగా బాధితుల స్వాధీనంలో ఉన్న భూమిని కేవలం ధరణి పోర్టల్ ఉన్నది అన్న సాకును చూపిస్తూ పోలీస్ ద్వారా భూ కబ్జాదారులకు బాధితుల భూమిని ఇప్పించెందుకు స్థానిక సర్కిల్ ఇన్స్ స్పెక్టర్, ఎస్.ఐ కబ్జాదారులకు సహాయ, సహాకారాలు అందజేయడంతో పాటు, బాధితులపై అక్రమ కేసులు నమోదు చేయడంతో, బాధితులు వరంగల్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీస్ కమిషనర్, పోలీస్ కమీషనరేట్ కార్యాలయం లోని డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపించండంతో పాటు, స్థానిక ప్రజల వాంగ్మూలం ఆధారంగా, బాధితులను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు, బాధిత వ్యతిరేకులకు స్థానిక సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ మరియు ఎస్.ఐ లు సహకరించినట్లుగా నిజ నిర్ధారణ కావడంతో ఈ ఇరువురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు శనివారం జారీ చేశారు.