N. Balram’s Services to Singareni Hailed as Unforgettable
సింగరేణికి ఎన్.బలరాం సేవలు చిరస్మరణీయం
మంచిర్యాల,నేటి ధాత్రి:
సింగరేణి సంస్థకు ఎనలేని సేవలందించిన ఎన్. బలరాం, ఐఆర్ఎస్ కి
సింగరేణి ఎస్సీ–ఎస్టీ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేపట్టారు.సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలందించిన గౌరవనీయులు ఎన్.బలరాం,ఐఆర్ఎస్ 2017 డిసెంబర్ నుండి 2025 వరకు సుమారు ఏడు సంవత్సరాలపాటు డిప్యూటేషన్‌పై సేవలందించారు.సింగరేణిలో డైరెక్టర్ (ఫైనాన్స్)గా తన సేవలను ప్రారంభించి, అనంతరం డైరెక్టర్ (ప్లానింగ్ & ప్రాజెక్ట్స్),డైరెక్టర్ (పర్సనల్, అడ్మినిస్ట్రేషన్ & వెల్ఫేర్), డైరెక్టర్ (ఆపరేషన్స్) వంటి కీలక బాధ్యతలను ఏకకాలంలో సమర్థవంతంగా నిర్వహించారు.తదనంతరం చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి,సింగరేణి సంస్థను అపూర్వ అభివృద్ధి పథంలో నడిపించారు.పేద కుటుంబ నేపథ్యం నుంచి ఐఆర్ఎస్ స్థాయికి ఎదిగిన ఆయన, సింగరేణిలో కార్మిక కేంద్రితమైన,సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించే పరిపాలనకు బలమైన పునాది వేశారు.ముఖ్యంగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగ నియామకాల సమస్యను ధైర్యంగా పరిష్కరించి చరిత్ర సృష్టించారు.అందులో భాగంగా పీడీఎఫ్ కేటగిరీలో 350 మంది ఎస్టీ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు,ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న 665 ఎస్టీ బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీ చేసి గిరిజన యువత జీవితాల్లో వెలుగులు నింపారు.ఇది సింగరేణి చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది.కార్మికుల శాలరీ అకౌంట్లకు అనుసంధానంగా రూ.1.25 కోట్ల ప్రమాద బీమా, కాంట్రాక్ట్ కార్మికులకు రూ.40 లక్షల ప్రమాద బీమా వంటి పథకాల ద్వారా కార్మిక కుటుంబాలకు భరోసా కల్పించారు.ఈ సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయి.కోవిడ్ మహమ్మారి సమయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాలు, ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా కార్మికులు,వారి కుటుంబాల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు.రోజుకు 15–18 గంటల పాటు పనిచేస్తూ, అర్ధరాత్రి వేళల్లోనూ కార్మికుల సమస్యలను పరిష్కరించిన ప్రజాహిత పరిపాలకుడిగా కార్మికుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.కార్మికులతో కలిసి అల్పాహారం చేయడం, గనుల్లో ప్రత్యక్షంగా పర్యటించడం ద్వారా సీఎండీ హోదాను కార్మికులకు మరింత చేరువ చేశారు.బొగ్గుతో పాటు విద్యుత్ ఉత్పత్తి,సోలార్ ఎనర్జీ,కీలక ఖనిజాల అన్వేషణ వంటి రంగాల్లో సింగరేణి సంస్థను విస్తరించారు.ఒడిశాలో నైనీ గనిలో ఉత్పత్తి ప్రారంభం, రాజస్థాన్‌లో 1500 మెగావాట్ల సోలార్ ఒప్పందం,కర్ణాటకలో బంగారం–రాగి అన్వేషణ లైసెన్సులు పొందడం,క్రిటికల్ రేర్ ఎర్త్ మెటల్స్‌కు సంబంధించి నీతి ఆయోగ్‌లో సభ్యత్వం వంటి కీలక విజయాలు సాధించారు.అలాగే సింగరేణి గ్లోబల్ లిమిటెడ్,సింగరేణి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థల ఏర్పాటుకు బలమైన పునాది వేశారు.ఆయన పరిపాలనలో సింగరేణి సంస్థ టర్నోవర్ రూ.37,000 కోట్లకు,స్థూల లాభం రూ.8,456 కోట్లకు, నికర విలువ రూ.24,100 కోట్లకు చేరి సంస్థ చరిత్రలోనే అత్యుత్తమ ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది.పర్యావరణ పరిరక్షణలో భాగంగా 21,000 మొక్కలను నాటి ప్రకృతి ప్రేమికుడిగా ఆదర్శంగా నిలిచారు.సింగరేణి పాఠశాలల్లో సీబీఎస్ఈ విద్యా విధానం ప్రవేశపెట్టడం, ఆసుపత్రుల ఆధునికీకరణ, కార్మిక సంక్షేమానికి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో సంస్థకు నూతన గుర్తింపును తీసుకువచ్చారు.ఈ సందర్భంగా ఎన్. బలరాం, ఐఆర్ఎస్ సేవలకు కృతజ్ఞతగా సింగరేణి ఎస్సీ&ఎస్టీ అసోసియేషన్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో
ధరావత్ పంతుల – అధ్యక్షులు (ఎస్టీ అసోసియేషన్),
ఈ.రాజేశ్వర్ రావు – అధ్యక్షులు (ఎస్సీ అసోసియేషన్),
బి.నాగేశ్వర్ రావు – జనరల్ సెక్రటరీ (ఎస్టీ అసోసియేషన్),
ఏ. నాగేశ్వర్ రావు – జనరల్ సెక్రటరీ (ఎస్సీ అసోసియేషన్),
ఏ. భాస్కర్ రావు – సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఎస్టీ అసోసియేషన్),
ఎం.వి. రావు – వైస్ ప్రెసిడెంట్ (ఎస్సీ అసోసియేషన్),
జి.దశరత్ – వర్కింగ్ ప్రెసిడెంట్ (ఎస్టీ అసోసియేషన్)
ఆధ్వర్యంలో 21-12-2025 నాడు కొత్తగూడెం పట్టణంలోని ఇల్లందు క్లబ్లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎల్.వి. సూర్యనారాయణ– డైరెక్టర్ (ఆపరేషన్స్),ఎం. తిరుమలరావు – డైరెక్టర్ (ఈ & ఎం) ముఖ్య అతిథులుగా,చీఫ్ లైసన్ ఆఫీసర్ వీసం కృష్ణయ్య జీఎం ఇల్లందు ఏరియా,కిరణ్ రాజకుమార్ సిఎంఓ, వెంకటేశ్వర్లు జీఎం సివిల్, రాజీవ్ కుమార్ జీఎం విజిలెన్స్,బొజ్జ రవి జీఎం ఎంఎస్,ఆంతోటి నాగేశ్వరరావు,జనరల్ సెక్రటరీ ఎస్సీ అసోసియేషన్ సింగరేణి సీనియర్ అధికారులు సింగరేణి ఉద్యోగులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డైరెక్టర్లు,జనరల్ మేనేజర్లు, అధికారులు ఎస్సీ–ఎస్టీ నాయకులు మాట్లాడుతూ…ఎన్.బలరాం సింగరేణిలో పని చేయడం వల్ల సంస్థ మరింత అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.ఆంతోటి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బలరామ్ సింగరేణి కార్మికులకు అండగా నిలిచి, భద్రాద్రి రాముడిలా వారికి ఎంతో ధైర్యాన్ని అందించారని కొనియాడారు.ఆయన సేవలు వర్ణనాతీతమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ధరావత్ పంతుల మాట్లాడుతూ..ఎన్.బలరాం సింగరేణి కార్మికులకు, ముఖ్యంగా గిరిజన ఉద్యోగులకు చేసిన సేవలను కొనియాడారు.665 ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి ఆయన చేసిన కృషిని ప్రశంసిస్తూ,దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న నియామకాలను పూర్తి చేసి సామాజిక న్యాయాన్ని అమలు చేసిన గొప్ప నాయకుడిగా ఆయనను అభినందించారు. అలాగే సింగరేణిలో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఆయన చేసిన కృషిని ప్రత్యేకంగా గుర్తించారు. అలాగే సింగరేణి లో ఎక్కడ గని ప్రమాదం జరిగినా స్వయంగా వారి ఇంటికి వెళ్లి ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించేవారు అని చెప్పారు.అంతేకాకుండా బలరామ్ సింగరేణిలోనే కాకుండా గ్లోబల్ బంజారా వెల్ఫేర్ సొసైటీ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 13 లైబ్రరీ లను ఏర్పాటు చేయడంలో ఎంతో సహాయం చేశారని తెలిపారు.సింగరేణి నుంచి వీడ్కోలు సందర్భంగా కార్మికులు,అధికారులు, కుటుంబ సభ్యులు,కార్మిక సంఘాల నాయకులందరికీ ఆప్తుడిగా,వినయశీలుడిగా, చిరునవ్వుతో సమస్యలను పరిష్కరించే మహోన్నత నాయకుడిగా ఎన్.బలరాం, ఐఆర్ఎస్ చిరస్మరణీయులుగా నిలిచిపోతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ–ఎస్టీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని,ఆయనకు శాలువాలు,పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఎన్. బలరాం మాట్లాడుతూ..తన జీవితంలో సింగరేణిలో పని చేయడం ఎంతో ఆనందంగా ఉందని,తన పదవీకాలంలో సింగరేణి కాలరీస్ సంస్థ రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని తెలిపారు.ఈ ఏడు సంవత్సరాల సేవా కాలంలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.బదిలీపై వెళ్లడం బాధ కలిగిస్తున్నప్పటికీ, ఎక్కడ ఉన్నా తాను సింగరేణి బిడ్డనేనని అన్నారు.
