మందమర్రి, నేటిధాత్రి:-
సమాజంలో మూఢనమ్మకాలు, మూఢాచారాలు, భూత వైద్యం లాంటి అపోహలు తొలగాలని సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షులు, అడ్వకేట్ రాజలింగు మోతే అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పదేపదే గొడవలు, అతిగా మాట్లాడడం, గొప్పలు చెప్పుకోవడం, ఒంటరితనం, విచిత్రమైన ఆలోచనలు, నిద్రలేమి, తనపై చేతబడి చేస్తున్నారని, చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని భయపడటం, ఎవరితోనూ కలవకపోవడం, తనలో తాను మాట్లాడడం, జంతువులను చూసి భయపడడం, ఎవరిని నమ్మకపోవడం, చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయడం, చెవిలో శబ్దాలు, విచిత్ర వాసనలు, రుచులు, దృశ్యాలు, బ్రాంతులు, విరక్తి, ఆత్మహత్య ఆలోచనలు, ఆత్మహత్య ప్రయత్నం, మద్యం, మత్తు పదార్థాలకు బానిస కావడం, ఆఫీసుల్లో తోటి వారితో తరచుగా గొడవలు పడటం, ప్రపంచం తన చేతుల్లోనే ఉందని, తానే గొప్పవాడినని హైరానా చేయడం, ఎవరితోను కలవకపోవడం, నలుగురితో మాట్లాడాలంటే భయం, కడిగిందే కడుగుడు, తదితర లక్షణాలు గల వ్యక్తులు నేటి సమాజంలో ఉన్నారని, వారికి సరైన చికిత్సను అందించే బాధ్యత ప్రభుత్వాలదే అని అన్నారు. మూఢనమ్మకాలు, మూఢాచారాలు, భూతవైద్యం లాంటి వాటిపై ప్రజల్లో ఉన్న అపోహలను ప్రభుత్వాలు తొలగించాలన్నారు. ప్రజల్లో మానసిక ఆరోగ్యం పై విస్తృత ప్రచారం చేయాలన్నారు. సమాజంలోని మానసిక అనారోగ్యంపై, మూఢనమ్మకాలు, మూఢాచారాలు, భూత వైద్యం వంటి అంశాలపై కలసి పోరాడుదామన్నారు. ఈ కార్యక్రమంలో రైట్ టు హెల్త్ ఫోరం పట్టణ అధ్యక్షులు పోతుల మురళీకృష్ణ, సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.