Municipal Development Commitment
మున్సిపల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం…
రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందులో భాగంగానే క్యాతన్ పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని గాంధారి వనం వద్ద 20 లక్షల నిధులతో ఓపెన్ జిమ్, 30 లక్షల నిధులతో ఆర్కే వన్ డంపింగ్ యార్డ్ సమీపంలో స్మశాన వాటిక ఏర్పాటుకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెన్నూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుండి నేటి వరకు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, నియోజకవర్గంలో సుమారు 600 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 40 కోట్ల నిధులతో అమృత్ పథకం ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరా పనులు కొనసాగుతున్నాయని అన్నారు. రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి వంతెన పై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. స్మశాన వాటిక నిర్మాణానికి మరో 20 లక్షలు కేటాయించి మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి శివ ఆశీస్ సింగ్, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం కళ,మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి సభ్యులు రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, మహంకాళి శ్రీనివాస్, బత్తుల వేణు, కట్ల రమేష్, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
