కరీంనగర్, నేటిధాత్రి:
గుంతలు పడ్డ రోడ్లను, డ్రైనేజీలను మరమ్మత్తులు చేయడంలో నగరపాల సంస్థ అధికారులు ఘోరంగా విఫలం చెందారని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి,సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు విమర్శించారు. కరీంనగర్ లోని ఎన్టీఆర్ విగ్రహం నుండి శ్రద్ధ ఇన్ బంకేట్ హాల్ వైపు వెళ్ళు రోడ్డు గుంతలు పడిందని డ్రైనేజీ గుంతలు పడి వాహనాలు వెళ్లలేని దుస్థితి ఏర్పడిందని, ప్రజలు నడవలేని దుస్థితి ఉందని గత సంవత్సరానికి పైగా గుంతలు పడ్డ డ్రైనేజీని మరమ్మత్తులు చేయడంలో మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలం చెందారని కళ్ళుండి చూడలేని కబోదిల్ల వ్యవహరించడం సిగ్గుచేటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రోజున గుంతలు, పడ్డ రహదారి, డ్రైనేజీలను సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో సందర్శించారు. ఈసందర్భంగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజులు మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో అనేక డివిజన్లలో రోడ్ల మరమ్మత్తులు, డ్రైనేజీ మరమ్మత్తులు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏళ్ల తరబడి ఇబ్బందులు ఉన్న పట్టించుకునే నాధుడు కరువయ్యాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవే కాకుండా చాలాచోట్ల స్మార్ట్ సిటీ రహదారులను గుంతలుగా తవ్వేసి సంవత్సరం పైగా వదిలేశారని ఎన్నిసార్లు మున్సిపల్ మేయర్, అధికారులకు చెప్పిన పెడచెవిన పెడుతున్నారే తప్ప పనులు చేయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మురికి కాల్వలు మరమ్మత్తులు చేయకపోవడం వల్ల దుర్వాసన వెదజల్లి ప్రజలు నానా ఇబ్బందులు గురవుతున్నారని ఆరోపించారు. ప్రతిరోజు అధికారులు మేయర్, కార్పొరేటర్లు, స్మార్ట్ సిటీ కరీంనగర్లో తీసుకువచ్చి అభివృద్ధి చేశామని గొప్పలు చెబుతున్నారు తప్ప గుంతలు పడ్డరోడ్ల మరమ్మత్తులు చేయడం లేదని ఆక్రోషం వ్యక్తం చేశారు. నగరంలో అభివృద్ధి పనులకు కేటాయించే నిధులు కూడా కేటాయించకపోవడం వల్ల కాంట్రాక్టులకు పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో వారు కూడా పనులను నిలిపివేశారని వెంటనే కాంట్రాక్టర్లతో మున్సిపల్ అధికారులు చర్చలు జరిపి వారికి ఇవ్వాల్సిన బిల్లులను వెంటనే ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని వారు కోరారు. మున్సిపల్ అధికారులు వెంటనే పెండింగ్ పనులను పూర్తి చేయాలని, మధ్యలోనే పనులను వదిలేసి వెళ్లిన స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని లేకుంటే నిలిచిన పనులకు మళ్ళీ టెండర్లు పిలిచి త్వరితగతిన పనులు చేపట్టాలని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు చెంచాల మురళి, శ్రీకాంత్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.