“నేటిధాత్రి” కొత్తగూడెం
ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వరరావుతో కలిసి కొత్తగూడెం, సుజాతనగర్ లో పలువురితో సమావేశం
ఎమ్మెల్యే వనమా పట్ల అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్ ఉమారాణి,ఆమె భర్త వెంకట్ కు నచ్చజెప్పిన ఎంపీ వద్దిరాజు
రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జి వద్దిరాజు రవిచంద్ర శనివారం సాయంత్రం కొత్తగూడెం, సుజాతానగరులలో పర్యటించారు.ఇల్లందు నియోజకవర్గ ఇంఛార్జిగా కూడా ఉన్న ఆయన ఉదయం గార్ల,బయ్యారంలలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే హరిప్రియలతో కలిసి పలు కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఆ తర్వాత కొత్తగూడెం చేరుకున్న ఆయన స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో కలిసి 34వ డివిజన్ కౌన్సిలర్, మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాసుల ఉమారాణి, ఆమె భర్త, బీఆర్ఎస్ నాయకుడు వెంకట్ ఇంటికి వెళ్లి వారితో సమావేశమయ్యారు.ఆ దంపతులు ఎమ్మెల్యే వనమా పట్ల అసంతృప్తితో ఉన్నారని, బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెసులో చేరుతారంటూ జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.ఈ దృష్ట్యా ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ను వెంట తీసుకుని వెంకట్ ఇంటికెళ్లి వారితో సుమారు రెండున్నర గంటల పాటు చర్చలు జరిపారు.పార్టీని విడిచి వెళ్లొద్దని, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని,ఇందులోనే మంచి భవిష్యత్తు ఉంటుందని వెంకట్-ఉమారాణి దంపతులకు ఎంపీ వద్దిరాజు నచ్చజెప్పారు.రవిచంద్ర మంత్రాంగం ఫలించి వచ్చే ఎన్నికలలో ప్రస్తుత ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నిర్ణయించిన బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు సంపూర్ణ మద్దతునిస్తామని వారు స్పష్టం చేశారు.