
ప్రజాసేవకై పరితపిస్తున్న సామాజిక విద్యావేత్త మోరే రవీందర్ రెడ్డి
-అవకాశం వస్తే ప్రజల ఆశీస్సులతో మొగుళ్ళపల్లి జడ్పిటిసిగా బరిలోకి
-మొగుళ్ళపల్లి మండల అభివృద్ధికై నిరంతర ఆరాటం
-ప్రధాని నరేంద్రుడి ఆశయ సాధనకై విశేష కృషి
-జాతీయ భావాలతో విద్యాసంస్థల నెలకొల్పు
-సేవా భావం..దైవ గుణం కలిగిన మోరే యువతకు ప్రేరణ
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
ప్రజా సేవకై నిరంతరం పరితపిస్తున్న సామాజిక విద్యావేత్త మోరే రవీందర్ రెడ్డి అవకాశం వస్తే ప్రజల ఆశీస్సులతో..బిజెపి పార్టీ పెద్దల దీవెనలతో మొగుళ్ళపల్లి జడ్పిటిసి గా బరిలోకి దిగనున్నట్లు బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో తన మనోగతాన్ని వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మోరే ప్రమీల-రాంరెడ్డి దంపతులకు జన్మించిన మోరే రవీందర్ రెడ్డి బిఏ బీఈడీ వరకు విద్యనభ్యసించాడు.
చిన్నప్పటి నుంచే జాతీయ భావాలను అలవర్చుకుని విద్యార్థి దశలోనే ఏబీవీపీ పట్ల ఆకర్షితుడై జ్ఞానం..శీలం..ఏకత..అనే భావాలతో దేశ సమైక్యత కోసం పని చేసేవాడు. 2000 సంవత్సరంలో ఏబీవీపీ మండల కన్వీనర్ గా నియమితులయ్యాడు. విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న క్రమంలో ఆయన సేవలను గుర్తించిన ఏబీవీపీ అధిష్టానం ఆయనకు పదోన్నతి కల్పించి 2005లో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా నియమించారు.
అనంతరం ఆర్ఎస్ఎస్ మండల ప్రముఖ్ గా మరియు ధర్మ జాగరణ సమితి ఖండ ప్రముఖ్ గా పనిచేస్తూ..హిందువులను జాగృతం చేయడంలో ఆయన పాత్ర కీలకం. తన గురువర్యులు మాజీ ఎంపీ కీర్తిశేషులు చందుపట్ల జంగారెడ్డి పిలుపు మేరకు 2008లో బిజెపి పార్టీలో సభ్యత్వం పొంది బీజేవైఎం పరకాల నియోజకవర్గ ప్రచార కార్యదర్శిగా, 2012లో బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా, 2013లో బీజేవైఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, 2016లో బిజెపి మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడిగా నియమితులై పార్టీ సేవలో నిమగ్నమయ్యారు.
కాగా మోరే రవీందర్ రెడ్డి పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు భాజపా శ్రేణులను గెలిపించడమే లక్ష్యంగా పనిచేశారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం పిలుపు మేరకు 2012లో జరిగిన పరకాల ఉప ఎన్నికల్లో బిజెపి బలపరిచిన అభ్యర్థి పెసరు విజయ్ చందర్ రెడ్డి గెలుపు కోసం నియోజకవర్గంలోని వెంకటేశ్వర్ల పల్లి గ్రామ ఇన్చార్జిగా పనిచేసి..ఆయన గెలుపు కోసం కమలదండుతో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. అలాగే భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం 8,9 వార్డులలో ఇన్చార్జిగా పనిచేసి వారి గెలుపు కోసం పనిచేశారు.
అనంతరం హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపు కోసం కష్టపడి పనిచేసి ఆయన గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించడం..నాగంపేట గ్రామ ఇన్చార్జిగా పనిచేసి కమలదలాన్ని ముందుకు తీసుకెళ్లడం రవీందర్ రెడ్డి పనితనానికి నిదర్శనం. అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికల్లో భాజపా బలపరిచిన అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఆయనకు ఇన్చార్జిగా ఇచ్చిన ఇదిగూడ గ్రామంలో కష్టపడి పనిచేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం రఘునందన్ రావు గెలుపులో భాగంగా కష్టపడి పని చేశారు.
వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 23వ డివిజన్ ఇన్చార్జిగా పనిచేసి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన ఆడేపు స్వప్న-సదానందంను గెలిపించడంలో ఆయన చేసిన విశేష కృషి ఎనలేనిది. ఈ తరుణంలో మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడుగా కొనసాగుతున్న సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 2 ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఎంపీటీసీని బిజెపిలోకి ఆహ్వానించడం, మండల కేంద్రంలో సర్పంచ్ గా బిజెపి అభ్యర్థిని గెలిపించుకుని అధికార, ప్రతిపక్ష పార్టీలకు దీటుగా బిజెపిని బలోపేతం చేస్తున్న మోరే రవీందర్ రెడ్డి ప్రస్తుతం బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ గా 2019 నుండి 2025 వరకు రెండుసార్లు నియమితులవ్వడం ఆయన పార్టీకి చేస్తున్న సేవలకు నిదర్శనం.
ప్రస్తుతం ఆయన సేవాగుణం..దైవ గుణాన్ని యువకులు, ప్రజలు ప్రేరణగా తీసుకుని ఆయనను ప్రజా ప్రతినిధిగా చూడాలనుకుంటున్నారు. ఆయన పర్లపల్లి, మొగుళ్లపల్లిలో స్థాపించిన విద్యాలయాలలో ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నత చదువులను అభ్యసించి పేరు ప్రఖ్యాతులు గడించడం గమనార్హం. ఆయన పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఎంతోమంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, టీచర్లుగా, పోలీస్ అధికారులుగా, రెవెన్యూ ఉద్యోగులుగా, పంచాయతీ రాజ్ అధికారులుగా స్థిరపడడం ఆయన చేసిన సేవలకు నిదర్శనం.