
Mother and Son Die in Gas Leak Tragedy
అమ్మా.. నీ వెంటే..నేను..!
◆:- గ్యాస్ లీకైన ఘటనలో కుమారుడి మృతి
◆:- ఏడాకులపల్లిలో విషాదఛాయలు
◆:- బోరున విలపిస్తున్నభార్య, పిల్లలు
◆:- రెండుకు చేరిన మృతుల సంఖ్య
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: అమ్మా… నీ వెంటేనే వస్తా…! ఈ కాలిన మంటలు, తీవ్ర గాయాలతో తట్టుకోలేకపోతున్నానమ్మా.. నీవు లేవన్న మాటలు మరింత దుఃఖాన్ని తెప్పించాయి. అమ్మ నేను ఉండలేనికా అన్నాడేమో… తల్లి మరణం మరవక ముందే కొడుకు మృత్యు ఒడిలోకి వెళ్ళిపోయాడు. అయ్యో కొడకా అమ్మ వెంట నువ్వు కూడా వెళుతున్నావా అంటూ తండ్రి బక్కన్న పుత్రశోకంతో కుమిలిపోతుంటే చూసినవారికి కన్నీటి దారలు ఆగలేదు.. చిన్ని పాపకు ఏమి చెప్పి వెళ్ళవయ్యా ప్రభు అంటూ భార్య సరిత గుండెల మీద బాదుకుంటూ చేసిన రోదనతో ఒక్కసారిగా ఏడాకులపల్లి గ్రామస్తులు, బంధుమిత్రులు దుఃఖంలో మునిగిపోయారు. ఈనెల 6న సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఏడాకులపల్లి లో గ్యాస్ లీక్ అయిన ఘటనలో తల్లితోపాటు ఇద్దరి కొడుకులకు తీవ్ర గాయాలైన సంగతి పాఠకులకు విదితమే. తల్లి శంకరమ్మ (65)మృత్యువుతో పోరాడుతూ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 8న మృతి చెందింది. తల్లి దశదినకర్మ ఈనెల 14న గ్రామంలో నిర్వహించారు.తల్లి మరణం మరవక ముందే ఆమె రెండవ కుమారుడు ప్రభు (35) పది రోజులుగా చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి శుక్రవారం ఉదయం పటాన్ చెరువులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
ఈయన ఓ కెమికల్ కర్మాగారంలో రోజువారీ కూలి గా పనిచేసేవాడు. మృతుడికి రెండు సంవత్సరాల లోపు కూతురు ఉంది. మృతుడి భార్య సరిత కన్నీరు కారుస్తూ ఇక నాకు దిక్కు ఎవరు చూసేది ఎవరు అంటూ రోదించడం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. తల్లి వెంటే కొడుకు మృతి చెందడం గ్రామస్తులతో పాటు బంధువులు, స్నేహితులు దుఃఖంలో మునిగిపోయారు. మరో కుమారుడు విట్టల్ కు తీవ్ర గాయాలు కాగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబానికి జీవనాధారం లేదని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ వివరణ కోరగా గతంలోనే కేసు నమోదు అయిందని దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు