బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
ఉన్నత విద్య కోసం వెళ్లిన భారత విద్యార్థులపై అక్రమ వలసలు అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపు చేస్తున్న దుశ్యర్యలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ నోరువిప్పాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మేరు సంఘం భవన్లో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.విదేశీ ఉన్నత విద్య కోసం భారతదేశం అమెరికాతో స్నేహ సంబంధాలు కలిగి ఉందని, కానీ డోనాల్డ్ ట్రంపు వచ్చిన తరువాత అక్రమ వలసలు అంటూ విద్యార్థులకు సంకెళ్లు వేస్తూ కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడటం సరైందికాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ కులగణన,ఎస్సి వర్గీకరణ అమలు కోసం తీర్మానం పెట్టి అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కులగణన సరిగ్గా జరగలేదని,సర్వే నిష్పక్షపాతంగా దాపరికం ఉండకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎస్సీ వర్గీకరణ అనేక పోరాటాలు చేస్తే సాధించిన వర్గీకరణ అని, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేటట్టు చూడాలని పేర్కొన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుచేసే దిశగా పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో భూ పోరాటాలతో ఇళ్ల స్థలాల కోసం 8 ఏళ్లుగా సిపిఐ పార్టీ నర్సంపేటలో కొనసాగించిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలులేని పేద ప్రజలు గుడిసెలు వేసుకున్న ప్రతి కుటుంబానికి ఇంటి స్థలాల పట్టాలిచ్చి ఇండ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పేద ప్రజలకు ఇండ్ల స్థలాల పట్టాలిచ్చి ఆదుకోవాలని తెలిపారు.బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ హామీ లాగా రాష్ట్ర ప్రభుత్వ హామీ మిగిలిపోవద్దని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులు, గ్రామపంచాయతీ సిబ్బంది ఔట్సోర్సింగ్ లాంటి వారికి బకాయిపడిన వేతనాలు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉమ్మడి వరంగల్ అభివృద్ధిపై నిర్లక్ష్యం వీడాలి
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి నిర్లక్ష్యం చేస్తూ రెండో రాజధాని చేస్తామంటూ కాలయాపన చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు విమర్శించారు.నర్సంపేట పట్టణంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి తో కలిసి శ్రీనివాసరావు మాట్లాడారు.ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి చేసేందుకు గిరిజన విశ్వవిద్యాలయం,బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ,కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని ఆరోపించారు.రెండో రాజధాని వరంగల్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఒరగబెట్టిందని,వరంగల్ అభివృద్ధి కావాలంటే ప్రణాళిక సిద్ధం చేసి విడుదల చేయాలన్నారు. వరంగల్ జిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రాజెక్టులు పరిశ్రమలు రావాలని లేకుంటే సిపిఐ భవిష్యత్తులో ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కోసం పోరాటం చేస్తుందని తెలిపారు.ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.