
ప్రగతి పాఠశాలలో మాక్ ఎలక్షన్స్
: ప్రజాస్వామ్యానికి విద్యార్థుల ప్రాథమిక అడుగులు.
రాయికల్,: నేటి ధాత్రి,
రాయికల్ పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో నో బ్యాగ్ డే సందర్భంగా 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రజాస్వామ్య విధానం పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో శనివారం మాక్ ఎలక్షన్లు (ప్రత్యక్ష ఎన్నికలు) నిర్వహించారు.విద్యార్థులు అధ్యక్ష, ఉపాధ్యక్ష, స్పోర్ట్స్ కన్వీనర్ పదవుల కోసం పోటీ పడ్డారు. ఈ సందర్భంగా అభ్యర్థులు తమ అభిప్రాయాలు తెలియజేస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం ఎన్నికల హోరాహోరీని తలపించేలా మారింది. ఓటర్లు, ఏజెంట్లు, బ్యాలెట్ బాక్సులు, ఓటింగ్ బూత్లు – ప్రతీ అంశం వాస్తవ ఎన్నికలలా తీర్చిదిద్దారు.
ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలె శేఖర్ పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “విద్యార్థులకు చిన్ననాటి నుంచే ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కలిగించాలి. నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే శక్తి ఈ తరహా కార్యక్రమాల ద్వారానే పెంపొందుతాయి,” అని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆసక్తి,చైతన్యాన్ని పెంపొందించింది.ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ బాలె నిఖిల్ కుమార్, ఉపాధ్యాయ బృందము, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.