ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆకస్మిక తనిఖీ
సమయానికి హాజరుకాని సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు
పాలకుర్తి నేటిధాత్రి
పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని పరిస్థితిని నేరుగా పరిశీలించిన వారు అక్కడి నిర్వహణ, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత వంటి అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలో కొంతమంది వైద్యులు, సిబ్బంది విధుల్లో హాజరు కాని పరిస్థితిని గమనించారు. ప్రజలకు సేవ చేయాల్సిన వారే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించటం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా వైద్యాధికారికి డిఎం అండ్ హెచ్ ఓ కి ఫోన్ చేసి, డ్యూటీలో గైర్హాజరైన సిబ్బంది పై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడే విధంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది వ్యవహరించటం సరికాదు. సమయానికి విధులకు హాజరు కావడం ప్రతి ఉద్యోగి బాధ్యత. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవు అని ఎమ్మెల్యే ఘాటుగా హెచ్చరించారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి, అందిస్తున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, అవసరమైన ఔషధాల సరఫరా, శానిటేషన్ మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. అలాగే, మాతా-శిశు విభాగాన్ని కూడా పరిశీలించి, ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ తనిఖీలో వారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మండల అధికారులు కూడా పాల్గొన్నారు. ఆసుపత్రిలో సిబ్బంది హాజరు, పనితీరు పట్ల ప్రజల్లో దీర్ఘకాలంగా ఉన్న అసంతృప్తికి ఈ ఆకస్మిక తనిఖీ ఓ సందేశంగా నిలిచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.