మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే విజయుడు.

సాగునీటిని విడుదల చేయించండి.

ఆలంపూర్ /నేటి ధాత్రి

రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు నియోజకవర్గంకు సాగునీటి విడుదలకై గురువారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ. ఆలంపూర్ నియోజకవర్గంలో రైతులు రెండో పంట సాగు చేశారు. పంట చివరి దశలో ఉన్న తరుణంలో తుంగభద్ర నదిలో నీరు అడుగంటి పోయింది. దీంతో ఆర్డీఎస్ మరియు తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల మోటర్ పంపులకు సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. గతం వారం రోజుల నుండి ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు తుంగభద్ర డ్యామ్ అధికారులతో ఇరిగేషన్ శాఖ అధికారులతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఆర్డీఎస్ కు రావాల్సిన రెండో ఇండెంట్ లో ఒక్క టీఎంసీ సాగునీటిని విడుదల చేయాలని కోరడం జరిగిందని ఎమ్మెల్యే విజయుడు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి విన్నవించారు. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి మరియు ప్రభుత్వంతో మాట్లాడి తుంగభద్ర డ్యామ్ నుండి తెలంగాణకు మరియు ఏపీకి రావలసిన సాగునీటిని త్వరగా విడుదల చేయించే విధంగా చూడాలని ఎమ్మెల్యే విజయుడు వినతి పత్రంలో పేర్కొన్నారు. అలాగే నెట్టెంపాడు రిజర్వాయర్ పనుల్లో భాగంగా 99, 100, 106 కాలువల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయడంతో పాటు ఆర్డీఎస్ లింక్ కెనాల్ కు అనుసంధానం చేయాలన్నారు. తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్, మల్లమ్మ కుంట పనులకు టెండర్లు పూర్తి అయిన పనులు ప్రారంభం కాకపోవడం వల్ల ఆలంపూర్ రైతాంగానికి సాగునీటి కష్టాలు ఉన్నాయన్నారు. స్పందించిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఏపీ ప్రభుత్వం, ఆ శాఖ మంత్రులతో అధికారులతో మాట్లాడి త్వరగా సాగునీటిని విడుదల చేయించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యేకు మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!