Grand Maharudra Yagam in Parakala
మహారుద్రయాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి దంపతులు
పరకాల,నేటిధాత్రి
పట్టణంలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్తీక మాస మహా రుద్ర యాగ కార్యక్రమంలో శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.ఉదయం విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు,యాగశాల ప్రవేశం,గోపూజ కార్యక్రమాలను నిర్వహించి 51మంది వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.159 హోమ గుండాలు,644 లు జంటలు ఈ హోమంలో పాల్గొనటం విశేషం.ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రం,వేద మంత్రాల ఘోషతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.యాగంలో పాల్గొన్న భక్తులు,ప్రతికూల శక్తుల నుండి రక్షణ, కుటుంబంలో సంతోషం లభిస్తాయని విశ్వసిస్తూ శివుని అనుగ్రహం కోసం మొక్కులు చెల్లించుకున్నారు.వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన వందలాది మంది భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా భోజన సదుపాయం ఇనుగాల ట్రస్ట్ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాదాన్ని అందించారు.యాగ స్థలంలో ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండడంతో పాటు,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు,వివిధ శాఖల అధికారులు,సిబ్బంది విశిష్ట సేవలను అందించారు.
