చిట్యాల, నేటి దాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో రూ.135 లక్షలతో నూతనంగా నిర్మించిన కస్తూర్బాగాంధీ పాఠశాల భవనం, అదనపు తరగతి గదులను మంగళవారం రోజున భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రిబ్బన్ కట్ చేసి, టెంకాయ కొట్టి ప్రారంభించారు. అంతకుముందు కస్తూర్భాగాంధీ పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థినీలు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే జీఎస్సార్ కు పుష్పగుచ్చం ఇచ్చి, శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.. అనంతరం పలు తరగతి గదులను ప్రిన్సిపాల్, అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. విద్యార్థులకు పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలపై ఎమ్మెల్యే ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల విద్యార్థినీలు ఆడుకునేందుకు ఆట స్థలం లేదని ప్రిన్సిపాల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, సానుకూలంగా స్పందించారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన సరస్వతీ దేవి చిత్రపటానికి ఎమ్మెల్యే పూలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి, పలువురు విద్యార్థినీలకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…విద్యార్థుల జీవితాలకు వెలుగులు ప్రసాదించే విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. బాలికల విద్య, సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కస్తూర్భాగాంధీ విద్యార్థినీలు ప్రాథమిక దశ నుంచే లక్ష్యాలను నిర్ధేశించుకొని సాధనకు పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, తాసిల్దార్ , కాంగ్రెస్ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, జిల్లా కార్యదర్శి మధు వంశీ, ఎంపిటిసిలు అనీల్, పద్మ కాంగ్రెస్ గ్రామ మండల నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.