
అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి రూరల్ మండలం
కమలాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపన చేశారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ నిధులు రూ.50 లక్షలతో గ్రామంలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రజాపాలనలో అర్హులైన వారికి అభివృద్ది, సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేక, ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. అనంతరం గ్రామస్తులు వారి వ్యవసాయ పొలాలకు వెళ్లే ఆయకట్టు రోడ్డు అభివృద్ది చేయాలని అడగ్గా, రూ.20 లక్షలతో కమలాపూర్ నుండి పెద్దాపూర్ కు వెళ్ళే మట్టి రోడ్డును అభివృద్ది చేయిస్తానని ఎమ్మెల్యే అన్నారు. వెంటనే ఆ పనులను ప్రారంభించాలని పీఆర్ ఏఈని ఎమ్మెల్యే ఆదేశించారు.
_బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ…
కమలాపూర్ గ్రామంలో ఇటీవల అప్పుల బాధతో బానోత్ దేవేందర్ – చందన దంపతులిద్దరూ మృతి చెందారు. కాగా, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఓదార్చారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. వారి ఇద్దరు కుమారులు రిషి, జశ్వంత్ లకు భూపాలపల్లి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లో అడ్మిషన్ కొరకు అధికారులతో మాట్లాడారు. అనంతరం అదే గ్రామంలో ఇటీవల చనిపోయిన మామిడి నర్సమ్మ కుటుంబ సభ్యులను కూడా ఓదార్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు సుంకరి రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవన్ పలువురు కాంగ్రెస్ నేతలు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు