
జైపూర్, నేటి ధాత్రి :
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించారు. మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల ఇంటింటి ప్రచారంలో భాగంగా పెద్దపెల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ప్రచార కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శనివారం రోజున ఇందారం గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలతో ముచ్చటించి వారితో పాటు కలిసి పని చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన 6 హామీలు పేదలపాటి వరంగా మారాయని, త్వరలోనే హామీలన్నీ నెరవేరుస్తామని, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళుతుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను ఆశీర్వదించి హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ జైపూర్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.