మీరో మేమో చూసుకుందామా! తేల్చుకుందామా!?

`ఎమ్మెల్యే అనురుధ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్‌ సవాల్‌.

`అన్నదమ్ములమని చెప్పుకుంటూనే తిరుమల రానివ్వరా!

`తెలంగాణ అసెంబ్లీ, మండలిలో తీర్మానం చేయమంటారా!

`తిరుమలలో మాకు ప్రాధాన్యమివ్వరా!

`స్వామి వారి దర్శనం మాకు కల్పించరా!

`మేము కూడా అలాగే అనుకుంటే హైదరాబాద్‌ రాగలరా!

`హైదరాబాద్‌ లో వ్యాపారాలు చేయగలరా!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్ర నాయకులంటే ప్రజలంటే టిటిడి మరీ చిన్న చూపు చూస్తోంది. అదే తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర నాయకులకు ఎంతో విలువనిస్తోంది. తెలుగు వారిగా ఆరు దశాబ్దాల పాటు కలిసివున్నాము. విడిపోయినా అన్నదమ్ములుగా కలిసివుంటున్నాము. అందులో తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం చూపిస్తున్న ఆదరణ, ఉదాసీనత ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వంలో లేదు. అందుకే తిరుమలకు వెళ్ళిన తెలంగాణ ప్రజలకు, నాయకులకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తెలంగాణ నుంచి భక్తులు వెళ్లేది కేవలం స్వామి వారి దర్శన భాగ్యం కోసమే. ఎంతో భక్తితో శ్రీవారి దర్శనం చేసుకొని, స్వామి వారిని కళ్లారా చూసుకొని, ఆ క్షణంలో దైవ సాక్షి మనసారా తన్మయత్వానికి లోనుకావాలని తిరుమల వెళ్లే ప్రతి భక్తుడికి వుంటుంది. సంపన్నులైతే దేవుడిని దర్శించుకోవాలనుకున్న ఆలోచన కలిగిన వెంటనే వెళ్లగలిగే వారు వుంటారు. నెలకోసారైనా స్వామి వారిని దర్శించుకోవాలన్న భక్తి కలిగిన వారు కూడా వుంటారు. సామాన్యులు కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు దేవదేవుని దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి వారు మా మంత్రి, మా ఎమ్మెల్యే, మా ఎంపి, మా ఎమ్మెల్సీ తో లెటర్‌ తీసుకెళ్లితే స్వామి వారి దర్శనం తొందరగా జరుగుతుందని ఆశపడతారు. అలాంటి వారికి నాయకులు లెటర్లు ఇస్తుంటారు. అలా తెలంగాణ నాయకులు ఇచ్చే ఉత్తరాలను ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం, తిటిడి బోర్డు కొంత కాలంగా పట్టించుకోవడం లేదు. తెలంగాణ భక్తులకు ప్రాధాన్యతనివ్వడం లేదు. అంతేకాకుండా తెలంగాణ నాయకులకు కూడా రాను రాను తిరుమలలో విలువలేకుండా పోతోంది. ఎంతో భక్తితో వెళ్లే భక్తులకు కూడా టిటిడి నిర్ణయాలు చిర్రెత్తుకొస్తున్నాయి. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి, కొన్ని నెలలపాటు కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము ఖర్చు చేసుకొని తిరుమలకు వెళ్తే దేవుణ్ణి కళ్లారా చూసుకోలేకపోతే ఆ బాధ ఎలా వుంటుందో చాలా మందికి అనుభవమే. అలాంటప్పుడు ఆ భక్తులలో ఆక్రోషం రాకుండా వుంటుందా? అదే ఇప్పుడు జరిగింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనురిద్‌, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్‌ లు తిరుమలకు వెళ్లారు. స్వామి వారి దర్శనం కోసం వాళ్లు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతో వారికి చిర్రెత్తుకొచ్చింది. తిరుమలకు తెలంగాణ భక్తులు వస్తే కనీస సదుపాయాలు కల్పించలేరా? తెలంగాణ భక్తులంటే టిటిడికి అంత చిన్నచూపైందా? మేము కూడా అలాగే అనుకుంటే ఆంద్రప్రదేశ్‌ నాయకులు తెలంగాణలో అడుగుపెట్టగలరా? అని తిరుమల కొండ మీదనే నిలదీశారు. తెలంగాణ ప్రజల చేత శభాష్‌ అనిపించుకున్నారు. అదీ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల శక్తి అని కూడా తెలంగాణ ప్రజలు కొనియాడుతున్నారు. దైవ దర్శనం విషయంలో ఇంత వివక్ష చూపుతున్న వారిపై తెలంగాణ కన్నెర్ర చేస్తే ఎలా వుంటుందో ఏపి గడ్డపై నుంచి హెచ్చరిక జారీ చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ధైర్యాన్ని తెలంగాణ ప్రజలు మెచ్చుకుంటున్నారు. గత ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని ఎంతో మంది భక్తులు తీసుకెళ్లినా స్పందించలేదు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్పందించి అసలైన తెలంగాణ వాదులు అనిపించుకున్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన వాళ్లే అసలైన తెలంగాణ వాదులు. పక్క రాష్ట్రంలో మనకు విలువ లేకపోతే కూడా ఇంత కాలం మౌనం వహించిన గత పాలకుల కళ్లు తెరిపించేలా కాంగ్రెస్‌ నాయకులు తెగువను చూపించారు. తెలంగాణ ప్రజలలో మరింత మనోధైర్యాన్ని నింపారు. ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. తెలంగాణ అసెంబ్లీ, మండలిలో తీర్మానం చేయమంటారా! హైదరాబాద్‌ రాకుండా అడ్డుకోమంటారా!! మా సత్తా ఏమిటో చూపమంటారా? అని సవాలు చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లను తెలంగాణ ప్రజలు అభినందిస్తున్నారు. జేజేలు పలుకుతున్నారు. వారి తెగువను చూసి గర్వపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!