సిరిసిల్ల అగ్గిపెట్టెలో చీరను మెచ్చిన మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా
సిరిసిల్ల టౌన్ 🙁 నేటి దాత్రి )
సిరిసిల్ల నేతన్న ప్రతిభకు మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా అబ్బురపడ్డారు.
జిల్లా కేంద్రానికి చెందిన నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ నేసిన అగ్గిపెట్టెలో ఇమిడే చీరను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇంత చిన్న అగ్గిపెట్టెలో అమరిన చీరను నేసిన నేతన్నను అభినందించారు.
వివరాల్లోకి వెళితే 2025 మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం 2024 మిస్ వరల్డ్ పోటీలలో విజేతగా నిలిచిన చెక్ రిపబ్లిక్ అందాల భామ క్రిస్టినా హైదరాబాద్ సందర్శించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కళాకారుల అద్భుత పనితీరును మిస్ వరల్డ్ క్రిష్టినాకు పరిచయం చేశారు.
అందులో భాగంగా సిరిసిల్ల నేతన్నల ప్రతిభను ఖండాంతరాలకు వ్యాపింప చేసిన వెల్ది హరిప్రసాద్ తాను నేసిన చేనేతలను మిస్ వరల్డ్ కు చూపించారు.
అద్భుత నైపుణ్యంతో నేసిన చేనేత వస్త్రాలను చూసిన మిస్ వరల్డ్ క్రిస్టినా నేతన్న పనితీరుకు మంత్రముగ్ధులయ్యారు.
అగ్గిపెట్టెలో ఇమిడి చీరను ప్రత్యేకంగా తన భుజాలపై వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు.
మిస్ వరల్డ్ సిరిసిల్ల చేనేతలను ప్రశంసించడం పట్ల నేత కళాకారుడు హరి ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు.
సిరిసిల్ల నేతన్నల కీర్తిని విశ్వవ్యాప్తం చేసే దిశగా మరిన్ని ఆవిష్కరణలను రూపొందిస్తానని హామీ ఇచ్చారు.