https://epaper.netidhatri.com/
`విస్తరణలో తప్పకుండా చోటు.
`త్వరలోనే మంచిర్యాల ప్రజలకు శుభవార్త.
`మంచిర్యాల ప్రేమ పాత్రుడు ప్రేమ్ సాగర్ రావు.
`కాంగ్రెస్ కు కరుడుగట్టిన సైనికుడు ప్రేమ్ సాగర్ రావు.
`ముక్కుసూటి దనం..నిలువెల్లా మంచితనం.
`పార్టీకి కష్టకాలంలో అండగా వున్న నాయకుడు.
`కిందిస్థాయి నుంచి ఎదిగిన నేత.
`త్వరలో మంత్రి కానున్నారు!
`ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలల్లోనే అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నాడు.
`సింగరేణికి పూర్వ వైభవం కోసం పాటుపడుతున్నాడు.
`అసెంబ్లీలో తన ప్రాంత సమస్యలను ప్రస్తావించి నిధులు సాధించారు.
`మంత్రి అయితే జిల్లాను నెంబర్‌వన్ చేస్తారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
కాంగ్రెస్ పార్టీలో మళ్లీ మంత్రి పదవుల వార్తలు జోరుందుకున్నాయి. అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మరో మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది. అది మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్‌రావును మంత్రి పదవి వరించే అవకాశాలున్నాయి. అయితే సామాజిక సమీకరణాల నేపధ్యం పేరు చెప్పి కొన్ని వర్గాలు అడ్డుపడేందుకు అవకాశం వున్నా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రేమ్ సాగర్‌రావుకు ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రేమ్‌సాగర్‌రావుకే ఇచ్చేందుకు సుముఖంగా వున్నట్లు కూడా సమచారం.. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కొన్ని సెంటిమెంట్లున్నాయి. వాటిని ఆయన బలంగా నమ్ముతారని కూడా అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిపిసి. అధ్యక్షుడయ్యాక తొలిసారి నిర్వహించిన ఎన్నికల శంఖారావ సభ మంచిర్యాల. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏర్పాటు చేసిన తొలి విజయోత్సవ సభ కూడా మంచిర్యాలలోనే జరపడం విశేషం. భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలు అక్కడి నుంచే నిర్వహించేందుకు అవకాశం వుంది. మొదట్లో మంచిర్యాలలో అంతపెద్ద సభ ఏర్పాటు చేసి, సక్సెస్ చేసిన ఘనత ప్రేమ్‌సాగర్‌రావుది. తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగిన సభను కూడా పూర్తి స్ధాయిలో విజయవంతం చేసిన క్రెడిట్ కూడా ప్రేమ్‌సాగర్‌రావుదే కావడం గమనార్హం. అది ఇప్పుడు ప్రేమ్‌సాగర్‌రావుకు బాగా కలిసి వచ్చే అవకాశం వుంది. పైగా మంత్రి వర్గ విస్తరణ చేపడితే ప్రేమ్‌సాగర్‌రావుకు చోటు కల్పించాల్సిన అవవసరం వుంది. ఆది నుంచి ప్రేమ్ సాగర్‌రావు కాంగ్రెస్ పార్టీనే పట్టుకొని వున్నారు. ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎంతో మంది నాయకులు రాజకీయ అవసరాల కోసం పార్టీలు మారినా, కష్టకాలంలో కాంగ్రెస్‌పార్టీకి అండగా నిలబడిన నాయకుడు ప్రేమ్‌సాగర్‌రావు. పైగా జిల్లాలో కింద స్ధాయి నుంచి పార్టీకి పనిచేసుంటూ ఒక్కొ మెట్టు ఎదుగుతూ వచ్చారు. పార్టీని పటిష్టం చేసుకుంటూ వచ్చారు. గత పదేళ్లలో పార్టీ బలహీన పడకుండా చూసుకున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ్ సాగర్‌రావు పార్టీని కాపాడుకుంటూ వచ్చారు.
అలాంటి నాయకుడికి మంత్రి వర్గంలో చోటు కల్పించే విషయంలో ఎలాంటి శషబిషలు వుండకూడదని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సూచిస్తున్నాయి. అయితే ఇప్పటికే రెండు మంత్రి పదవులు ఉమ్మడి కరీంనగర్‌కు వున్నాయి. అయినా ఉమ్మడి కరీంనగర్‌కు మరో మంత్రి పదవి దక్కాల్సిన అవసరం వుంది. అయితే ఈ పదవి కోసం ఉమ్మడి జిల్లాలో మరో ఇద్దరు నాయకులు కూడా కోరుతున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వున్నారు. ఈ ఇద్దరిలో వినోద్ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కార్మికశాఖ మంత్రిగాపనిచేశారు. అయితే ఓసారి బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ టిఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. తర్వాత 2014లోకి వచ్చారు. అయితే ఆప్పటినుంచి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఉమ్మడి రాష్ట్రంలో ఎంపిగా పనిచేశారు. పెద్దపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత బిజేపిలో చేరారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. చెన్నూరు నుంచి గెలుపొందారు. ఆయన కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. అదే దశలో తన కుమారుడికి పెద్దపల్లి ఎంపి సీటు కూడా అడుతున్నట్లు సమాచారం.
ఇటీవలే పెద్దపల్లి సిట్టింగ్ ఎంపి. వెంకటేష్ నేత కాంగ్రెస్‌లో చేరారు.
దాంతో తన కుమారుడికి ఎంసిసీటు వచ్చే అవకాశం లేదన్న ఆలోచనతో వివేక్ మంత్రి పదవి కోరుతున్నారని సమచారం. గత పదేళ్లుగా కాంగ్రెస్‌లోనే వున్న వినోద్ గతంలో మంత్రిగా అనుభవం వుంది. దాంతో ఆయన కూడా తనకే మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా మరొకరితో తలనొప్పే వుండే అవకాశం వుంది. ఒకవేళ వెంకటేష్ నేతను కాదని వివేక్ కుమారుడికి ఎంపి టికెట్‌ఇస్తే, ఖచ్చితంగా వినోద్ మంత్రి రేసులో వున్నానంటాడు. ఒక వేళ వివేక్‌కు కాదని వినోద్‌కుమంత్రి పదవి ఇస్తే ఆయన అలిగే అవకాశం వుంది. అందువల్ల ఈ ఇద్దరిలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా ఏదో ఒక సమస్య ఎదురయ్య అవకాశం వుంది. అందువల్ల మద్యే మార్గంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు మంత్రి పదవి ఇస్తే ఎలాంటి సమస్య ఎదురుకాదు. పైగా పార్టీ కోసం కష్టపడిన నాయకుడికి ఎన్నటికైనా ఫలితం వుంటుందన్న సంకేతాలిచ్చినట్లౌవుంది. ప్రేమ్ సాగర్‌రావు మాజీఎమ్మెల్యే దివాకర్‌రావుపై సుమారు 70వేల మెజార్టీతో గెలిచారు. అంటే ప్రజలు ఆయన నాయకత్వంపై ఎంత నమ్మకంతో వున్నారో ఈ ఫలితమే తెలియజేస్తుంది.
1985లో కార్మిక సంఘ నాయకుడిగా వున్న ప్రేమ్‌సాగర్‌రావు అంచెలంచెలుగా కాంగ్రెస్‌లో ఎదుగుతూ వచ్చారు.
కాంగ్రెస్ పార్టీ కాసిపేట మండలాధ్యక్షుడుగా, ఎంపిపిగా, 1999నుంచి పిసిసి సభ్యుడిగా వున్నారు. 2002లో పిపిసి కార్యదర్శి అయ్యారు. 2004 నుంచి రెండేళ్లపాటు టిటిడి బోర్టు మెంబర్‌గావున్నారు. 2007 నుంచి 2013 వరకు స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీగా వున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్‌ను వీడలేదు. కాంగ్రెస్‌లోనే వుంటూ పార్టీ కోసం కష్టపడ్డారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా మూడు నెలల్లోనే ఆయన మంచిర్యాల మీద వున్న మమకారాన్ని చూపిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ప్రేమ్ సాగర్ రావు మాట్లాడిన మాటలు వింటే ఆయనకు మంచిర్యాల మీద ఎంత ప్రేమ వుందో అర్ధమౌతుంది. మంచిర్యాల ప్రజలు అన్ని రకాలగా బాధితులమే అంటూ మొదలుపెట్టి ఆనాటి నుంచి ప్రజలు అనుభవిస్తున్న బాధను వివరించారు. గతంలో ఎల్లంపల్లి నిర్మాణంలోనష్టపోయింది మంచిర్యాలనే. ఇప్పుడు కాళేశ్వరం మూలంగా నష్టపోయింది మంచిర్యాలనే. కాళేశ్వరం నిండి మంచిర్యాల మునిగిన పరిస్ధితి చూశాం. ఎల్లంపల్లిలో హజీపూర్ మండలానికి చెందిన 12 గ్రామాలు నీట మునిగిపోయాయి. ఎంతో మందిరైతులు రైతు కూలీలుగా మారిపోయారని ప్రేమ్‌సాగర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం మూలంగా అత్యధిక బాధితులు కూడా మంచిర్యాల ప్రజలే. గత ప్రభుత్వాలు ఏవీ మంచిర్యాలకు న్యాయం చేయలేదు.
వర్షాకాలం వస్తే మంచిర్యాల ఎప్పుడు మునిగిపోతుందో అన్న భయంతో బతుకుతున్నారు.
ఇక సింగరేణి విషయంలోనూ అన్యాయమే జరిగింది. నస్పూర్ మున్సిపల్‌లో ఓపెన్‌కాస్టు బాధితుల బాధలు వర్ణనాతీతం. ఆర్‌అండ్ ఆర్ ప్యాకేజీ అందక, ఉద్యోగాలు అందక ప్రజలు ఆదారాలు కోల్పోయి, జీవనం కోల్పోతున్నారు. సింగరేణిలో లెటర్ల సంస్కృతి మూలంగా పదేళ్లు పాటు తమ ప్రాంత ప్రజలు అన్యాయానికి గురయ్యారని చెప్పారు. అంతే కాదు మా నీళ్లు మాకు మాకు కావాలి. మా నిధులు మాకు కావాలి. లేకుంటే ఎల్లంపల్లి నుంచి చుక్క వెళ్లనీయమంటూ తన ప్రాంతం మీద వున్న ప్రేమను ప్రేమ్‌సాగర్‌రావు చూపించారు. ప్రజల చేత శబాష్ అనిపించుకున్నారు. అలాంటి నాయకుడు మంత్రి అయితే తమ ప్రాంత సమస్యలు తీరుతాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఎమ్మెల్యే వుంటేనే తమ ప్రాంత సమస్యలను ఇంతగా అసెంబ్లీ, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ప్రేమ్‌సాగర్‌రావు మంత్రి అయితే ఎల్లంపల్లి నీళ్లు, సింగరేణి నిధులు, కొలువులు ఆ ప్రాంతానికే వర్తింపజేసేందుకు పూర్తి స్ధాయి కృషి జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు.