Minister Inspects SC, ST Girls Hostels
ఎస్సీ, ఎస్టీ బాలికల వసతి గృహాలను సందర్శించిన మంత్రి
ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే జీఎస్సార్.
భూపాలపల్లి నేటిధాత్రి
బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ బాలికల పాఠశాల వసతి గృహాలను ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు సందర్శించారు.ఈ సందర్భంగా వారు పాఠశాలలలోని తరగతి గదులు, వసతి గృహాల గదులు, వంటశాల, భోజన ఏర్పాట్లు, విద్యార్థినులకు అందిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి విద్యాభ్యాసం, ఆరోగ్యం, భోజనం, వసతి సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కలెక్టర్ ఆఫీసు లోని ఐ.డి.ఓ. సి లో జరిగిన వరంగల్ , హన్మకొండ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ఎస్సీ,ఎస్టీ వసతి గృహాలు మరియు గురుకుల పాఠశాలల సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థినులు నిర్భయంగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. వసతి గృహాలలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, భూపాలపల్లి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పాఠశాలలు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థినుల సంక్షేమమే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
