Sitakka Distributes Indiramma Sarees to Women
ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి సీతక్క
భూపాలపల్లి నేటిధాత్రి
మహిళలను వ్యాపార రంగంలో రాణించేలా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని పంచాయతీరాజ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం కొత్తపల్లిగోరి మండల కేంద్రంలోని గవర్నమెంట్ హైస్కూల్ గ్రౌండ్ లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీ రాజ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి పాల్గొన్నారు. అనంతరం మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ధృడ సంకల్పంతో మహిళలకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అద్దె బస్సులకు యజమానులను చేయడం, వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వహణ లాంటి ఎన్నో కార్యక్రమాలను వారిని ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కృషి చేస్తోందని అన్నారు. ఇందిరాగాంధీ చేసిన అభివృద్ధి బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దేశ ప్రగతి, పేదల అభ్యున్నతి కోసం ప్రాణాలర్పించిన మహనీయురాలు ఇందిరాగాంధీ అని ఆయన కొనియాడారు. ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా దేశ సమగ్రత, సమైక్యత కోసం కఠిన నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు. ఇందిరమ్మ పాలనే ఆదర్శంగా పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
