వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పూర్తి మద్దతు బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావుకే ఉంటుందని వేములవాడ పట్టణ స్వర్ణ కార సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ప్రకటించారు. సోమవారం వేములవాడ పట్టణంలో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో చల్మెడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సంఘం సభ్యులు మాట్లాడుతూ తమ సంఘంలో పలు రకాల సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. వెంటనే స్పందించిన చల్మెడ మాట్లాడుతూ కుల వృత్తులు, చేతివృత్తుల వారికి బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, రాబోయే రోజుల్లోను మరిన్ని పథకాలు ప్రవేశపెట్టనుందని, కారు గుర్తుకు ఓటేసి తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే గెలిచిన వెంటనే స్వర్ణకారుల సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమం అనంతరం సంఘం సభ్యులు చల్మెడను శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, గోలి మహేష్, నరాల శేఖర్, నాయకులు కట్కూరి శ్రీనివాస్, రామతీర్థపు రాజు, కొండ కనకయ్య, గూడూరి మధు, గోపు బాలరాజ్, కొండ నర్సయ్య, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు గిన్నెల శ్రీనివాస చారి, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ చారిలతో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు.
చల్మెడకు మద్దతు తెలిపిన పట్టణ స్వర్ణకార సంఘం సభ్యులు
