Demand to name Medical College after Omkar
మెడికల్ కళాశాలకు ఓంకార్ పేరుతో నామకరణం చేయాలి
కలెక్టర్ కార్యాలయంలో ఎంసిపిఐ(యు) పార్టీ వినతిపత్రం
నర్సంపేట,నేటిధాత్రి:
పీడిత ప్రజల హక్కులకై, భూమి బుక్తి విముక్తి కోసం జీవితాంతం పోరాడిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ ఆదర్శాలు, త్యాగాలు,రాజకీయ విలువలను భవిష్యత్త్ తరాలకు అందించే విధంగా పాఠ్యాంశంలో చేర్చుతూ నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఆయన పేరుతో నామకరణం చేయాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు.అలాగే ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించి ఓంకార్ స్మృతి వనం ఏర్పాటు చేయాలని కోరారు.అందుకుగాను
ఎంసిపిఐ(యు) వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ విజయలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలు విలువలు కోల్పోయి వ్యాపారమయంగా మారాయన్నారు.
ఆనాటి నైజాం సర్కార్ కు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ విముక్తి కోసం పనిచేసిన అగ్ర గన్యుడు అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ అని గుర్తుకు చేశారు.ఉమ్మడి రాష్ట్ర ప్రజల గొంతుకగా అసెంబ్లీలో మాట్లాడుతూ అసెంబ్లీ టైగర్ గా పిలిపించుకున్న గొప్ప మహానేత అని అలాంటి వీరుడి చరిత్రను నాడు నేడు భవిష్యత్తులో ఆచరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.మెడికల్ కళాశాలతో పాటు, స్టేడియానికి నామకరణం చేసి నర్సంపేట వరంగల్ రోడ్డుకు ఓంకార్ మార్గ్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, నగర కార్యదర్శి మాలోత్ సాగర్,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చుంచు జగదీశ్వర్,జిల్లా నాయకులు ఐతమ్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
