
# నేటి నుంచి మహా జాతర షురూ…
# జంపన్నవాగులో స్నానాలు…. శివసత్తుల పూనకాలు..!
# మేడారం జాతరలోనే బసవేసిన మంత్రి సీతక్క.
# నాలుగు రోజుల్లో సుమారు రెండు కోట్ల భక్తులు దర్శించుకోన్నట్లు అంచనా అధికారులు…
# 15 వేల పోలీస్ సిబ్బంది నడుమ మహా జాతర..
# అడుగడుగునా సీసీ కెమెరాలు… కెమెరాల్లో సాప్ట్ వేర్ ఇన్ స్టాలేషన్…
వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి :
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుపొందిన మరో మహా కుంభమేళా జాతరగా మేడారం ప్రసిద్ధిగాంచింది.భక్తజనం ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న మహాజాతర మేడారం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రతి రెండేళ్లకోసారి మాగ శుద్ధ పౌర్ణమి రోజు మొదలయ్యే మహా జాతర జరగనున్నది. నేటి నుండి నాలుగు రోజుల పాటు జాతర అంగరంగ వైభవంగా జరిగే మహా జాతర గద్దెలపై కొలువు తీరేందుకు పగిడిద్దరాజు డప్పుడోలు వాద్యాల నడుమ శివసత్తుల నృత్యాల కోలాహలంగా మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామం నుండి మంగళవారం బయలుదేరగా నేడు (బుదవారం) రాత్రి మేడారంకు చేరనున్నాడు.అలాగే కన్నెపల్లి నుండి సారలమ్మతల్లి ఎటూరునాగారం మండలం కొండాయి నుండి పగిడిద్దరాజులు ఈరోజు రాత్రి వరకు గద్దెలపై చేరుకున్నారు. గురువారం చిలకలగుట్ట నుండి సమ్మక్కతల్లి వనం విడిచి జనంలోకి వచ్చి భక్తులకు దర్శనం ఇవ్వనున్నది. దీంతో గిరిజన కుంభమేళ మహా జాతర ఒక మహోత్తర ఘట్టంగా మారనున్నది. ఈ మహా జాతరకు ముందే గత మూడు నెలలుగా సుమారు 50 లక్షల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. వనదేవతలు గద్దెలపై చేరుకొని దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో ఈ నాలుగైదు రోజుల్లో సుమారు రెండు కోట్ల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు అంచనాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. జాతర అభివృద్ధి ఏర్పాట్ల కోసం ముందుగా 75 కోట్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ నిధులు సరిపోవని భావించి మరో 30 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. దీంతో భక్తుల సౌకర్యార్థం మహా జాతరలో అన్ని ఏర్పాట్లకు మొత్తం 105 కోట్లతో సౌకర్యాలను పూర్తి చేసింది. సుమారు ఈ మహా జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకున్నారు కాగా సుమారు 15 వేల మంది పోలీసులను ఈ జాతర భద్రత కోసం ప్రభుత్వం కేటాయించింది. తలను దర్శించుకునేందుకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర,ఛత్తీస్ ఘడ్,ఒడిస్సా, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి భక్తులు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ఏర్పాటు చేసింది.కాగా డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ శివధర్ రెడ్డితో కలిసి మేడారం సమక్క సారలమ్మలను దర్శించుకున్నారు. అనంతరం నోడల్ అధికారులతో సమావేశమై ఉత్సవాలు జరిగే 4 రోజులపాటు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవ నిర్వహణలో ట్రాఫిక్ నిర్వహణ అత్యంత కీలకమని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.జాతర సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది.ఇప్పటికే ఆర్టీసి ఎండి సజ్జనార్ రాష్ట్రంలోని అన్ని డిపోలకు ఆదేశాలు జారీచేయడంతో బస్సులు పటిష్టంగా నడుస్తున్నాయి. మహా జాతర నిర్వహణ పట్ల స్థానిక ములుగు ఎమ్మెల్యే రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గత వారం రోజులుగా మేడారంలోనే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. అయితే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లు మంత్రి సీతక్కతో కలిసి అమ్మవార్లను దర్శించుకుని మహా జాతర నిర్వహణను వారి కంట్రోల్లోకి తీసుకున్నారు.మహా జాతర పట్ల భారీ సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.ఐతే జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాల ద్వారా పాత నేరస్థులను,మావోయిస్టులను గుర్తించేందుకు సీసీ కెమెరాలలో సాప్ట్ వేర్ ను ఇన్ స్టాలేషన్ చేసి కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయనున్నారు.
# వనం నుండి జనంలోకి వన దేవతలు..
వనంలో ఉన్న దేవతలు జనం మధ్యకు వచ్చే శుభ ఘడియలు వచ్చేశాయి. జంపన్న వాగు జనసంద్రంగా మారే ఘట్టం సమీపించింది. కీకరాణ్యం జనారణ్యమై కోలాహలంగా మారింది. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయలకు ప్రతిబింబంగా నిలిచే తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర నేటి నుండి ప్రారంభంకానున్నది. మాఘమాసం పౌర్ణమి రోజుల్లో రెండేళ్లకు ఒకసారి ఈ మహాజాతర ఒక మహోత్తర వేడుకగా జరగడం ఆనవాయితీగా వస్తోంది.మండమెలిగే పండుగతో గత బుధవారం జాతరకు అంకురార్పణ జరగ్గా వనం వీడి జనం మధ్యకు వచ్చే వన దేవతల ఆగమనంతో అసలైన మహా జాతర మొదలవుతోంది.
# పూనుగొండ్ల గ్రామం నుండి బయలుదేరిన పగిడిద్దరాజు…
# ఇసకేస్తే రాలనంత భక్త జనం..
ఇసకేస్తే రాలనంత జనం జేజేల మధ్య సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు గోవిందరాజుల ఆగమనం మొదలు కానుంది. నేటి నుండి మొదలయ్యే మహా జాతర కోసం ముందుగా మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామం నుండి పగిడిద్దరాజు డప్పు డోలు వాద్యాల నడుమ శివసత్తుల నృత్యాల మధ్య నేడు కోలాహలంగా మేడారానికి బయలుడేరారు.ఆ గ్రామంలోని గుడి నుంచి ప్రారంభమైన స్వామివారి ఊరేగింపు గ్రామ వీధుల్లో సందడిగా సాగుతుంది.దట్టమైన అటవీ మార్గంలో 70 కిలోమీటర్ల మేర కాలినడకన బయలు దేరి గోవిందరావుపేట మండలం పసర గ్రామ పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో రాత్రి బస చేశారు.అనంతరం నేటి సాయంత్రానికి మేడారానికి చేరుకోనున్నారు.ఆ సమయంలో కన్నెపల్లి నుంచి సారలమ్మ, ఏటూరు నాగారం మండలం కొండాయ్ నుంచి గోవిందరాజులు గద్దెలపైకి చేరతారు.
జాతర రెండో రోజు గురువారం సమక్క ఆగమనమే. లక్షలాది భక్తుల కోలాహలం నడుమ గిరిజన సాంప్రదాయ పద్ధతిలో పూజారులు కుంకుమ భరణి రూపంలో సమ్మక్క గౌరవంగా గద్దెలపైకి వస్తుంది.జాతర మూడోరోజు దేవతలంతా గద్దెలపై ఉండి భక్తులకు దర్శనమిస్తారు. శనివారం రాత్రి దేవతలు తిరిగి వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. మేడారం మహాజాతరకు ముందే 50 లక్షలపైన భక్తులు దేవతలను దర్శించుకున్నారు.కాగా నేటి నుండి నాలుగు రోజుల పాటు సాగే ఈ కుంభమేళా మహా జాతరకు సుమారు 2 కోట్ల మంది అమ్మవార్లను దర్శించుకుంటారని అధికారులు అంచనాలు వేస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలు లెక్కచేయకుండా ప్రజలు తరలివస్తున్నారు.ఐతే ముందుగా పవిత్రమైన జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.గత మూడు నెలలుగా జరుగుతున్న గిరిజన మహా కుంభమేళా జాతరలో కోరిన కోర్కెలు తీర్చే అమ్మలను దర్శించుకోవడం సంతోషంగా ఉందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుండి వనదేవతలు దర్శించుకునేందుకు ఇప్పటికే భక్తులు ప్రైవేట్ వాహనాలలో మేడారం చుట్టుపక్కల మేడారం – తాడ్వాయి,మేడారం- నార్లపూర్,మేడారం – ఊరట్టం ప్రాంతాలలో సుమారు 15 కిలోమీటర్ల మేర గుడారాలు వేసుకొని ఉన్నారు.వీరంతా వన దేవతలు గద్దెలపై చేరుకోగానే గంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించి ఎత్తు బంగారముతో మొక్కులు చెల్లించుకొనున్నారు.
# జంపన్నవాగులో స్నానాలు…. శివసత్తుల పూనకాలు..!
అమ్మవార్లను దర్శించుకునే భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యా స్నానాలు ఆచరించనున్నారు. అయితే ఈ మేడారం జాతరలో శివసత్తుల పూనకాలు ముఖ్య ప్రాధాన్యత సంచరించుకుంటున్నది. చంపన్న వాగులో శివసత్తులు పూనకాలు చేస్తున్న సందర్భంలో స్వయంగా అమ్మవార్లు పూని పలుకుతారని కోరిన కోర్కెలు తీరుస్తారని భక్తులు విశ్వాసంగా ఉంటారు.
# 15 వేల పోలీస్ సిబ్బంది నడుమ మహా జాతర…..
ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుపొందిన మేడారం జాతర విజయవంతం చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం సుమారు 15 వేల మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెరికల్లాంటి పోలీస్ సిబ్బందిని విధులకు కేటాయించారు. ఐజి డిజిపి తో పాటు వివిధ జిల్లాలకు చెందిన 20 మంది ఎస్పీలు, 42 మంది ఏఎస్పీలు, 140 మంది డిఎస్పీలు, 400 మంది సీఐలు, 1000 మంది ఎస్ఐలు, 2000 మంది కానిస్టేబుల్ తో పాటు హోంగార్డులను జాతర విధులకు కేటాయించారు. జాతరకు 10 జోన్లుగా, 29 సెక్టార్లు,60 సబ్ సెక్టార్లుగా విభజించిన పోలీస్ అధికారులు అడుగడుగున భద్రతా ఉండేలా పకడ్బందీగా ఏర్పాటు చేసింది.
# అడుగడుగునా నిఘా నేత్రాలు..
495 సీసీ కెమెరాల ఏర్పాట్లు…. కెమెరాల్లో సాప్ట్ వేర్ ఇన్ స్టాలేషన్…
కిక్కిరిసిపోయే జనంతో సాగే మహా జాతరలో ఎక్కడ ఏం జరుగుతున్నది అనే విషయాన్ని తెలుసుకునేందుకు గాను ప్రభుత్వం 495 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. అలాగే వీటితోపాటు మరో 15 డ్రోన్లను వినియోగించనున్నారు. వీటన్నింటిని కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. కాగా జాతరలో జరుగుతున్న నిర్వహణ పట్ల కమాండ్ కంట్రోల్ లో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించేందుకు ముగ్గురు ఐజీలకు బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు తెలుపుతున్నారు. ప్రతి 100 మీటర్లకు ఒక పోలీస్ సిబ్బందిని సహారా గా నిలుపనున్నారు భక్తుల రద్దీ వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో సిబ్బంది ఎక్కువ మొత్తంలో మోహరించనున్నారు. అయితే ఈ తల్లుల మహా జాతరలో మహిళా పోలీసులు వెయ్యిమంది వీధుల్లో పాల్గొననున్నారు.
ఈ కుంభమేళా మహా జాతరలో రద్దీ నియంత్రణకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను ప్రత్యేకంగా ఉపయోగించనున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాలలో ఈ ప్రత్యేక సాఫ్ట్ వేర్ లు సిసి కెమెరాలు ఇన్ స్టాలేషన్ చేసి వాటిని కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేస్తారు. చదరపు మీటర్లు నలుగురు కంటే ఎక్కువ మంది ఉంటే కంట్రోల్ రూమ్ కు సమాచారం చేరుతుంది ఈ సమాచారంతో కంట్రోల్ రూమ్ సిబ్బందిని అప్రమత్తం చేసి అక్కడ రద్దీ నియంత్రణ చర్యలు తీసుకుంటారు అలాగే క్రౌడ్ కౌంటింగ్ కెమెరాల ద్వారా ఎంత మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు తెలుసుకొని అవకాశం ఉంటుంది అలాగే ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాల సహాయంతో పాత నేరస్తులు మావోయిస్టులను గుర్తించడం జరుగుతుందని సంబంధిత అధికారులు తెలుపుతున్నారు.
# ముందుగా గట్టమ్మతల్లికి మొక్కులు చెల్లించాల్సిందే..
ములుగు జిల్లా కేంద్రం వద్ద ఉన్న గట్టమ్మ తల్లి ఆలయం గేట్వే ఆఫ్ మేడారంగా ప్రసిద్ధి కెక్కింది. మేడారం మహా జాతరకు వెళ్ళే భక్తులు ముందుగా గట్టమ్మతల్లికి మొక్కులు చెల్లించుకున్నాకే వన దేవతలు దర్శనాలకు బయలుదేరుతారు.ఈ నేపథ్యంలో గత మూడు నెలలుగా ఒకేతైతే ఈ నాలుగు రోజుల మరో ఎత్తు.ఈ నేపథ్యంలో గట్టమ్మతల్లి ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తల్లిని తనివీతీరా దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని భక్తులు మేడారం పయనమవుతున్నారు.ఆనాడు సమ్మక్క వద్దకు యుద్దానికి వెళ్ళే కాకతీయులకు ఈ గాత్తమ్మతల్లి వారిని అడ్డుకొని ముచ్చేముటలు పట్టించిందని నాటి చరిత్ర చెపుతున్నది.కాగా కోరిన వారికి కొంగు బంగారంగా నిలిచి వరాలిచ్చే శక్తిగా గట్టమ్మ తల్లిని భక్తులు భావిస్తారు. గట్టమ్మ తల్లిని దర్శించుకుంటే సమ్మక్క, సారలమ్మ తల్లి దేవతలను ముందే దర్శించుకున్నంత తృప్తిని భక్తులు పొందుతారు.