మావోయిస్టులారా… అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మి ప్రాణాలు కోల్పోవద్దు
అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో జల్సా చేస్తున్నారు…
ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటున్నారు
వాళ్ల మాటలు నమ్మి అమాయక పేదలు తుపాకీ పట్టి అడవుల్లో తిండి తిప్పలు లేక తిరుగుతున్నారు
మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సల్స్ కారకులు
నక్సల్స్ కు సపోర్ట్ చేసిన అర్బన్ నక్సల్స్ ద్రోహులు
తక్షణమే తుపాకీ వీడి జన జీవన స్రవంతిలో కలవండి
మీకుమరో 4 నెలలు మాత్రమే గడువు
వచ్చేమార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతాం
వేములవాడలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
వేములవాడ ఏరియా ఆసుపత్రికి రూ.1.5 కోట్ల విలువైన వైద్య పరికరాల అందజేత
సిరిసిల్ల/వేములవాడ(నేటి ధాత్రి):
అర్బన్ నక్సల్స్ మాయలో పడి మావోయిస్టులు మోసపోయి ప్రాణాలు కోల్పోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ‘‘అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో కుటుంబ సభ్యులతో కలిసి జల్సా చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరవీలు చేసుకుంటూ ఆస్తులు కూడగట్టుకుని కార్లలో తిరుగుతున్నారు. వాళ్ల మాటలు నమ్మిన అమాయకులు తుపాకీ పట్టుకుని అడవుల్లో తిరుగుతూ తిండీ తిప్పలేక ప్రాణాలు కోల్పోతున్నారు. అర్బన్ నక్సల్స్ చెప్పేదొకటి. చేసేదొకటి. వారి మాటలు నమ్మి మోసపోవద్దు. మంచి ఆలోచనలతో సమాజంలోకి రండి. ప్రజలకు సేవ చేయండి.’’అని పిలుపునిచ్చారు. మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవడానికి మరో 4 నెలల సమయం మాత్రమే ఉందని, 2026 మార్చినాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామని పునరుద్ఘాటించారు.
ఈరోజు సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ నేషనల్ మినరల్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) సహాకారంతో సీఎస్సార్ నిధులతో కొనుగోలు చేసిన రూ.1.5 కోట్ల విలువైన వైద్య పరికరాలను ఆసుపత్రికి అందజేశారు. జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ తోపాటు వైద్యశాఖ అధికారులతో కలిసి ఆ పరికరాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. ఆసుపత్రి అంతా కలియ తిరిగి రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్, అధికారులతో కొద్దిసేపు సమావేశమై ఆసుపత్రి అభివ్రుద్ధి, పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలూ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏమన్నారంటే…
కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ పేరుతో దేశంలోని అన్ని ఆసుపత్రులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తొంది. ఆ నిధులతోనే ఆసుపత్రులు నడుస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం ఖరీదైన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు యత్నిస్తోంది. చాలా ఆసుపత్రుల్లో సూదులు, మందులు, కాటన్ కూడా లేని పరిస్థితి ఉంటే…. నా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఆసుపత్రుల్లో పేదలకు పూర్తిగా వైద్య సేవలందించేందుకు యత్నిస్తున్నా. అందులో భాగంగా అల్ట్రాసౌండ్, ఈసీజీ మిషన్ వంటి ముఖ్యమైన 16 వైద్య పరికరాలను అందించాను. వేములవాడ ఆసుపత్రిలో మొత్తం రూ.1.5 కోట్ల వ్యయంతో ఈ పరికరాలను కొనుగోలు చేశాం. దీంతోపాటు హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట ఆసుపత్రులకు కూడా ఇదే స్థాయిలో వైద్య పరికరాలు అందిస్తున్నాం. అందుకోసం నేషనల్ మినరల్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) సహకారంతో రూ.5 కోట్ల సీఎస్సార్ నిధులను సేకరించి ఈ వైద్య పరికరాలను కొనుగోలు చేసి ఆయా ఆసుపత్రులకు అందించాం. భవిష్యత్తులో ఈ ఆసుపత్రులకు అన్ని రకాల సహాయం అందిస్తా.
యువ డాక్టర్లకు నా సూచన ఒక్కటే. డాక్టర్ల రిక్రూట్ మెంట్ కోసం కలెక్టర్ 89 వైద్య పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. యువ డాక్టర్లంతా దరఖాస్తు చేసుకుని ఉద్యోగాలు పొందాలని కోరుతున్నా. కరీంనగర్ నుండి వేములవాడ ఎంతో దూరం కూడా లేదు. ఉద్యోగాల్లో చేరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు సేవ చేయాలని కోరుతున్నా. మీ చదువుకు సార్ధకత, మీ తల్లిదండ్రుల రుణం తీరాలంటే పేదలకు సేవ చేయాలని కోరుతున్నా. కరీంనగర్ సహా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పేదలను ఆదుకుంటాం.
మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ పై స్పందిస్తూ….
తుపాకీ ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదు. తుపాకీ పట్టుకుని అమాయకులైన దళిత, గిరిజనులను చంపారు. పోలీసులను చంపారు. మా ప్రతాప రామక్రిష్ణను కూడా కాల్చి చంపేందుకు యత్నించారు. చావుదాకా వెళ్లొచ్చారు. జాతీయ జెండా ఎగరేయొద్దని నక్సలైట్లు బీజేపీ నేతలను ఎంతోమందిని కాల్చి చంపారు. జాతీయ జెండా ఎగరేసేటోడు భారతీయుడా? నల్లజెండా ఎగరేసేటోడు భారతీయుడా? నక్సలైట్లది ఏ సిద్ధాంతం? తుపాకీ ద్వారా మీరు సాధించిందేమిటి? మీరు సాధించిందల్లా అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. మీరూ బలైపోయారు?
మేం బ్యాలెట్ ను నమ్ముకుని ముచ్చటగా మూడోసారి దేశ ప్రజల ఆశీర్వాదంతో మోదీ ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి రాగలిగాం. మీరు తుపాకీ పట్టుకుని పోలీసులను, దళిత, గిరిజనులను చంపడం, మీరూ చనిపోవడం మినహా మీరు సాధించిందేమిటి? ఈ రోజు దేశంలో ఉన్నది ఆషామాషీ ప్రభుత్వం కాదు. మోదీ ప్రభుత్వం. దేశ సరిహద్దులో జవాను వద్ద, పోలీసుల వద్ద మాత్రమే తుపాకీ ఉండాలి. మావోయిస్టులను తుపాకులను వదిలి జన జీవన స్రవంతిలో కలవాలి. మావోయిజాన్ని అంతం చేయడమే మా లక్ష్యం. మావోయిస్టులు లొంగిపోవాలని అమిత్ షా అవకాశమిచ్చినా వినకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. తుపాకీతో అసలు మీరు సాధించేదేమిటి? తుపాకీ పట్టుకుంటే కక్షమించే ప్రసక్తే లేదు. కలం పట్టి చదువుకునే అమ్మాయిలకు మాయమాటలు చెప్పి తుపాకులు పట్టి అడవుల్లోకి పంపితే… తిండి తిప్పలు లేక తిరుగుతున్నారు. చనిపోతున్నారు. ఎవరైనా లొంగిపోతే వాళ్లపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారు.
మావోయిస్టులారా…. 4 నెలలు మాత్రమే మీకు సమయం ఉంది. 2026 మార్చిలోపు మావోయిస్టులను అంతం చేయడమే మా లక్ష్యం. అమిత్ షా మాట ఇస్తే నిలబెట్టుకునే నాయకుడు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, ఆయన భార్య సాధించిందేమిటి? అర్బన్ నక్సల్స్ మాయలో పడి మీ ప్రాణాలు తీసుకోవద్దు. అర్బన్ నక్సల్స్ ఏసీల్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పైరవీలు చేస్తూ ఆస్తులు సంపాదించుకుంటూ కార్లలో తిరుగుతున్నారు. మీరు మాత్రం అడవుల్లో తిండి తిప్పలు లేకుండా తుపాకీ పట్టుకుని తిరుగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. అర్బన్ నక్సల్స్ చెప్పేదొకటి. చేసేదొకటి. వారి మాటలు నమ్మి మోసపోవద్దు. మంచి ఆలోచనలతో సమాజంలోకి రండి. ప్రజలకు సేవ చేయండి.
తుపాకీ పట్టుకుని చర్చలు జరుపుతామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. తుపాకీ వీడాల్సిందే. జన జీవన స్రవంతిలో కలవాల్సిందే. తుపాకీ వీడి జనంలోకి వచ్చే వారికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది. బుల్లెట్ ను నమ్ముకుంటే ప్రాణాలు తీసుకోవడం మినహా మీరు సాధించేదేమీ లేదు. బ్యాలెట్ ను నమ్ముకుంటే అధికారంలోకి రాగలమనే విషయాన్ని గుర్తుంచుకోండి.
