
`ఆరోగ్య శ్రీ కోసం వెలిసిన పుట్టగొడుగులు!
`వైద్య రంగాన్ని విషతుల్యం చేస్తున్న చీడ పురుగులు
`నయవంచిత ప్రైవేటు ఆసుపత్రులు
`వైద్యం ముసుగులో వ్యాపారం!
`ఆరోగ్యశ్రీ నిధులు అడ్డదిడ్డంగా మేయడం!
`ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి కైంకర్యాలు!
`మానవత్వం లేని ఆసుపత్రుల అడ్డదారి సంపాదనలు
`లెక్కలేనన్ని లెక్కల చెబుతూ దోచుకుంటున్న కాసుపత్రులు
`వైద్యం పేరుతో సాగిస్తున్న దుర్మార్గపు వ్యాపార నిలయాలు
`బకాయిల పేరుతో పదే పదే బెదిరింపులు
`బుకాయింపుల పేరుతో అడ్డగోలు బిల్లులు
`రేవంత్ సర్కార్ ఉదాసీనతను సొమ్ము చేసుకుంటున్నారు
`గత ప్రభుత్వ బకాయిలు చెల్లించినా మొండికేస్తున్న ఆసుపత్రులు
`ఆరోగ్య శ్రీ పరిధి పెంచడంతో పండుగ చేసుకుంటున్న ఆసుపత్రులు
`అయినా దన దాహం తీరక లేనిపోని కొర్రీలు
`22 శాతం వైద్య చార్జీలు పెంచుకున్నా సంతృప్తి లేని అలకలు
`ఇటీవలి బకాయిలు చెల్లించకపోతే వైద్యం చేయమని ప్రభుత్వానికే హెచ్చరికలు
`గతంలో ఇలా చేస్తేనే ఆరోగ్య శ్రీ అక్రమాలపై ఎంక్వౌరీ వేశారు
`ఆసుపత్రుల బోగోతాలు వెలుగులోకి తెచ్చారు
`చర్యలు తీసుకునే సమయంలో ప్రభుత్వం మారింది
`గత ప్రభుత్వంలో విజిలెన్స్ ఎంక్వౌరీలో తేలిన ఆసుపత్రులను మూస్తేగాని బుద్ధి రాదు
`ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలకు చెక్ పెడితే గాని దారికి రారు
`దుర్మార్గమైన దోపిడీ సాగిస్తున్న ఆసుపత్రుల లైసెన్స్ రద్దు చేయకపోతే దోపిడీ ఆగదు
`ఆరోగ్య శ్రీ నిధుల కోసం ఆసుపత్రులు పెట్టిన వాళ్లు చాలా మంది వున్నారు
`ఆరోగ్య శ్రీ నిధులతోనే ఆసుపత్రులు నడుపుకుంటున్నారు
`తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్లు ప్రభుత్వాన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు
`ఎక్కడో అక్కడ పుల్ స్టాప్ పెట్టకపోతే ఆసుపత్రుల ఆగడాలు ఆగవు
`సామాన్యులకు సరైన వైద్యం అందదు
హైదరాబాద్,నేటిధాత్రి:
ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేసే యోచనలో అనేక పదకాలు అమలు చేస్తుంటాయి. ప్రైవేటు వ్యాపారులు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే ఆలోచన చేస్తాయి. దురదృష్టమేమిటంటే మన దేశంలో విద్య, వైద్యం వ్యాపారమైపోయాయి. విద్య, వైద్యం ప్రజలు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాలు అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటాయి. అయితే సమాజంలోని అన్ని వర్గాలకు ఉచిత విద్య, వైద్యం ప్రభుత్వానికి కూడా పూర్తి స్దాయిలో వీలు కాకపోవచ్చు. అప్పుడు పరోక్షంగా ప్రైవేటు వ్యవస్ధలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఏర్పడుంది. ఇక్కడే ప్రైవేటు వ్యక్తులు విద్య, వైద్యాన్ని పూర్తిగా వ్యాపారమయం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వైద్య రంగాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులు భ్రష్టుపట్టిస్తున్నారు. ప్రజల కోసం ప్రభుత్వాలు తెచ్చే ఉచిత వైద్యాన్ని కూడా వైద్య వ్యవస్ధలు అలుసుగా తీసుకుంటున్నాయి. డబ్బు సంపాదనకు మార్గంగా చేసుకుంటున్నాయి. ప్రభుత్వ పధకాలను వారికి వరంగా చేసుకుంటున్నాయి. పైగా ప్రభుత్వాన్నే బెదిరించే స్దాయికి చేరుకుంటున్నాయి. ప్రజలకు మేలైన పాలన అందించాలి. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరగాలని ప్రభుత్వాలు కోరుకుంటాయి. ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రైవేటు ఆసుపత్రులు నిర్వీర్యం చేసే పన్నాగాలు పన్నుతుంటాయి. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పధకం గత ఇరవై సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం నుంచి అమలు జరుగుతోంది. ఈ పధకం తెచ్చిన నాడు పెద్దగా ప్రభుత్వాసుపత్రుల లేవు. కాని ప్రజలకు మెరుగైన వైద్యం అందాలన్న ఆలోచనతో అప్పటి పాలకులు ఆరోగ్యశ్రీ తెచ్చారు. అందుకోసం ప్రైవేటు ఆసుపత్రుల సహకారం తీసుకున్నారు. అయితే ఆ ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వమే నేరుగా బిల్లులు చెల్లించే ఏర్పాటు చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కారు పదిలక్షల వరకు పరిమితి పెంచింది. గతంలో ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందేలా వుండేది. ఇలా ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలను ప్రైవుటు ఆసుపత్రులు కామదేనువుగా మార్చుకున్నారు. ఓ వైపు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిని పది లక్షలు పెంచినా ప్రైవేటు ఆసుపత్రుల ఆశ తగ్గలేదు. తమ వైద్యానికి అదనంగా మరో చార్జీలు పెంచాలని కోరారు. అయినా రేవంత్ సర్కారు మరో 22శాతం ఫీజులు చెల్లించేందుకు కూడా అంగీకరించింది. అయినా ఆసుపత్రుల దన దాహం తీరడం లేదు. అయినవీ కానివీ అన్నట్లు లెక్కలేస్తున్నారు. సహజంగా జరిగే వైద్యానికి మించి బిల్లులు వేస్తున్నారు. ఇష్టాను సారం లెక్కలు చూపిస్తున్నారు. అయినా సరే పధకానికి ఆటంకం కలగొద్దన్న ఆలోచనతో ప్రభుత్వం మరింత ఉదారంగానే వ్యవహరిస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలు తెలిసినా, భరిస్తూ, సహిస్తూ వస్తోంది. తమ వైద్యానికి ధరలు పెంచాలని కోరినా ప్రభుత్వం ఒప్పుకుంటూనే వుంది. వారికి అందాల్సిన బకాయిలు ఇప్పటికే రెండుసార్లు చెల్లించారు. రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ బాకాయిలు ఏకంగా రూ.1700 కోట్లు చెల్లించారు. తర్వాత మరో 340 కోట్లు చెల్లించారు. గతంలో ఎప్పుడూ ఇంత తక్కువ సమయంలో ఏ ప్రభుత్వం ఆసుపత్రుల బకాయిలు చెల్లించలేదు. మొత్తని వాడిని మొత్తబుద్దవుతుందని ఒకసామెత. ప్రైవేటు ఆసుపత్రుల తీరు అలాగే వుంది. ఓ వైపు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ పధకాన్ని చేయాల్సినంత దుర్వినియోగం చేస్తున్నారు. తప్పుడు బిల్లులు అనేకం సృష్టిస్తున్నారు. ఇప్పటికే అనేకం వెలుగులోకి కూడా వచ్చాయి. అయినా వారి భయం లేదు. ఎందుకంటే ప్రభుత్వం తమ మీద ఆదారపడాల్సిందే అన్న ధీమా వారిలో మరింత పెరిగిపోతూ వస్తోంది. ఇటీవల తమ బకాయిలు చెల్లించకపోతే తాము వైద్యం ఆపేస్తామంటూ ప్రభుత్వానికి ప్రైవేటు ఆసుపత్రులు అల్టిమేటమ్ జారీ చేశారు. ప్రభుత్వం వెంటనే తమ బాకాయిలు చెల్లించపోతే ఆరోగ్య శ్రీ సేవలు ఆపేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. తొండ ముదిరి ఊసరవెళ్లి అయినట్లు ప్రైవేటు ఆసుపత్రులన్నీ ఆరోగ్య శ్రీ వల్లనే బతుకుతున్నాయి. ఆరోగ్య శ్రీ లేకుంటే తెలంగాణలో సగానికి పైగా ఆసుపత్రులు మూత పడాల్సిందే. ఈ నిజం తెలిసినా ప్రైవేటు ఆసుపత్రులు తమ ఆగడాలు ఆపడం లేదు. ప్రభుత్వాల ఉదాసీనత, మెకత వైఖరిని అలుసుగా చేసుకుంటున్నారు. చెలరేగిపోతున్నారు. ప్రతీసారి అనేక కొర్రీలు పెడుతూ, ఆరోగ్య శ్రీకి అడ్డంకులు సృష్టిస్తూ, ప్రజల జీవితాలతో, ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిజం చెప్పాలంటే కేవలం ఆరోగ్యశ్రీ కోసమే తెలంగాణలో అనేక ఆసుపత్రులు వెలిశాయి. ఈ సంగతి ఆసుపత్రుల నిర్వాహకులకు తెలిసినా, ప్రభుత్వాలను బెదిరించి గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. ఒక వేళ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఆపేస్తే తెలంగాణలోని సుమారు 70శాతం ఆసుపత్రులు మూసుకోవాల్సిందే. కాని ప్రభుత్వం ఆ పని చేయదన్న దుర్మార్గం పెచ్చరిల్లిపోతోంది. ఆసుపత్రలు మీద చర్యలు తీసుకునే స్ధితి వుండదన్న ధీమాతో ప్రైవేటు ఆసుపత్రులు ఆటలాడుతున్నాయి. గత ప్రభుత్వం కేసిఆర్ హాయంలో ఆరోగ్యశ్రీ అమలులో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని గుర్తించారు. దాంతో విజిలెన్స్ ఎంక్వౌరీ చేశారు. ఆ రిపోర్టు కూడా ప్రభుత్వం వద్ద వుంది. ఆ రిపోర్టు పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోవడం మొదలుపెడితే, సోకాల్డ్ గొప్ప ఆసుపత్రులని చెప్పుకునేవి అనేకం మూత బడడం ఖాయం. అంతలా ఆరోగ్యశ్రీలో అవినీతి జరిగాయనే వార్తలు అప్పట్లో వచ్చాయి. అందుకు గత ప్రభుత్వం ఆసుపత్రుల గొంతెమ్మ కోరికలు తీర్చలేదు. ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడతామంటే సహించేది లేదని తేల్చి చెప్పింది. అందుకే గత ప్రభుత్వ హాయంలో రెండు వేల కోట్లకు పైగా ఆరోగ్య శ్రీ బకాయిలు వున్నా, ప్రైవేటు ఆసుపత్రులు నోరు మెదపలేదు. బకాయిలు ఇస్తేగాని వైద్యం చేయలేమని చేతులెత్తేయలేదు. పదే పదే తమ చికిత్సలకు చార్జీలు పెంచాలని కోరలేదు. మొత్తం పదేళ్ల కాలంలో ఒకటో, అరో తప్ప ఆరోగ్యశ్రీ ఆసుత్రులు ప్రభుత్వాన్ని కోరింది లేదు. ప్రభుత్వం బకాయిలు ఇచ్చినప్పుడు తీసుకున్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించాలంటూ వేడుకుంటూ వుండేవారు. కాని ఇప్పుడు ఆసుపత్రులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ నెల 30లోగా బకాయిలు చెల్లించాలని డెడ్ లైన్పెడుతున్నాయి. లేకుంటే సేవలు నిలిచిపోతాయని అల్టిమేటమ్ జారీ చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో బాకీ పడిన బకాయిలను ఏక కాలంలో రేవంత్ సర్కార్ వెనుకాడకుండా ఏక కాలంలో 1780కోట్లకు పైగా విడుదల చేయడం అనేది గొప్ప విషయం. ప్రజారోగ్యం విషయంలో రాజీ పడకూడదన్న ఆలోచనతో రేవంత్ సర్కార్ ఆరోగ్య శ్రీ బకాయిలు విడుదల చేశాయి. నిజానికి ప్రభుత్వం అంత మొత్తం ఒకేసారి విడుదల చేస్తుందని ప్రైవేటు ఆసుపత్రులు ఊహించలేదు. మొత్తం 2200 కోట్ల బకాయిల్లో ఓ 300 నుంచి 500 కోట్లు విడుదల చేస్తాయని అనుకున్నారు. కాని ఎంతో ఉదారతతో ఎక్కడా వైద్య సేవలకు అంతరాయం కలకూడదన్న గొప్ప మనసుతో రేవంత్ సర్కారు ఏక కాలంలో మూడువంతులకు పైగా నిధులు విడుదల చేసింది. అయినా ప్రైవేటు ఆసుపత్రులకు నీతి లేకుండాపోయింది. నిజాయితీ అనే పదం కూడా వారి డిక్షనరీలో లేకుండా చేసుకుంటున్నారు. రేవంత్ సర్కార్ ఇలా ఏక కాలంలో ఇంత పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయడంతో ఈ రెండుసంవత్సరాల కాలంలో పెద్దఎత్తున ప్రైవేటు ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు, ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేసే డాక్టర్లు, ఎంతో మంది వ్యాపార వేత్తలు కూడా వైద్య రంగంలోకి దిగారు. పెద్దఎత్తున ఆసుపత్రులు పెట్టారు. ప్రభుత్వాన్ని కోరి, ఒప్పించి, మెప్పించి ఆరోగ్య శ్రీ సేవల కోసం ఎంపానల్ మెంట్లు చేయించుకున్నారు. ఇలా ప్రభుత్వం నుంచి వచ్చే ఆరోగ్య శ్రీ నిధుల మీదనే ఆదారపడి ఆసుపత్రులు నడిపించుకుంటూ ప్రభుత్వాన్నే బ్లాక్ మెయిల్ చేసేదశకు చేరుకుంటున్నాయి. ఇలాంటి వాటిని గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటే తప్ప ప్రైవేటు ఆసుపత్రులు దారికి రావు. గత ప్రభుత్వ హయాంలో విజిలెన్స్ ఎంక్వౌరీ రిపోర్టును బట్టిచర్యలు తీసుకుంటే చాలా ఆసుపత్రుల లైసెన్స్లు రద్దవుతాయి.