
ఏఐటీయూసీ బీఓసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె అశోక్
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మే వాల్ పోస్టర్లు విడుదల
చేర్యాల నేటిధాత్రి…
ఈనెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మేను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ బీఓసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ పిలుపునిచ్చారు. చేర్యాల మండల కేంద్రంలో అంగడి బజారు వద్ద బుధవారం సమ్మే వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా అందె అశోక్ మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా విభజించి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కోడ్ లు తీసుకొచ్చి కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం, ప్రతి కార్మికునికి 26వేల కనీస వేతనం అమలు చేయాలని, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ గ్రాట్యూటీ సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకింగ్, ఎల్ఐసీ, రైల్వే, బొగ్గు లాంటి సంస్థలను ప్రైవేటుపరం చేసి బడా పెట్టుబడిదారులకు అప్పనంగా అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానానికి నిరసనగా కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయడానికి అన్ని కార్మిక సంఘాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లం అంజయ్య, పొన్నబోయిన మమత, గజ్జల సురేందర్, గూడెపు సుదర్శన్, కర్రె రవి, నంగి కనకయ్య, దండెబోయిన వెంకటేష్, శిగుళ్ల నరేష్, కొలిపాక భిక్షపతి, లచ్చయ్య, ప్రమీల, రజిత తదితరులు పాల్గొన్నారు.