రెండు పి ఓ డబ్ల్యు సంఘాల విలీన సభను విజయవంతం చేయండి..
*శ్రామిక మహిళ స్వేచ్ఛ శ్రమ శక్తిని హరించే విధానాలను తిప్పికొట్టండి..
*పి ఓ డబ్ల్యు జిల్లా కన్వీనర్ ఎం.అరుణ పిలుపు..
తిరుపతి నేటిధాత్రి :
అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీన ఒంగోలులో జరుగుతున్న రెండు ప్రగతిశీల మహిళా సంఘాల విలీన సభను జయప్రదం చేయాలని మహిళలకు పి ఓ డబ్ల్యు తిరుపతి జిల్లా కన్వీనర్ ఎం.అరుణ పిలుపునిచ్చారు. తిరుపతిలోని ఐఎఫ్టియు కార్యాలయంలో శనివారం ఒంగోలులో జరుగుతున్న రెండు పి ఓ డబ్ల్యు సంఘాల విలీన సభ గోడపత్రికలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎం.అరుణ మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ కొరవడిందన్నారుఇంటిలోనూ పనిచేసే చోట మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, దీనికి తోడు మహిళల శ్రమశక్తి దారుణంగా దోపిడీకి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నా మహిళలు పురుషులతో సమానమేనని చెబుతున్నా శ్రమ శక్తి దోపిడీ మాత్రం అధికంగా ఉందన్నారు. సమాన వేతనాలు లేక కుటుంబాన్ని పోషించుకోలేక దారుణ పరిస్థితుల్లో జీవితాలను నడుపుతున్నారని చెప్పారు.దీనికి తోడు కుల మతాల పేరుతో మహిళలను మరింతగా బందీలుగా మారుస్తున్నారని తెలిపారు.ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలు చైతన్యవంతులై దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమ బాట పట్టాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో మహిళలకు చట్టబద్ధ వేతనాలు, హక్కులు అమలు కాని దుస్థితి నెలకొని ఉందని వివరించారు. వీటికి వ్యతిరేకంగా ఏపీ ప్రగతిశీల మహిళా సంఘం పోరాటాలు చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు జిల్లా నాయకురాలు ఆర్.అన్నపూర్ణ, సుజాత, గంగాదేవి, ఎ.లక్ష్మీ, ఈ. కవిత తదితరులు పాల్గొన్నారు..