
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చెయ్యండి
ప్రారంభ సూచికగా నగరంలో భారీ బైక్ ర్యాలీ-సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్
కరీంనగర్, నేటిధాత్రి:
సిపిఐ కరీంనగర్ నగర సమితి సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.
ఈసందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ సెప్టెంబర్11వ తేదీన బైపాస్ రోడ్ లో ఉన్న తెలంగాణ సాయుధ పోరాట సేనాని బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి పూలమాలవేసి కరీంనగర్ నగరంలో బైక్ ర్యాలీ ప్రారంభించుకొని కోతిరాంపూర్, కమాన్, బస్టాండ్ మీదుగా గీతా భవన్ నుండి అనభేరి ప్రభాకర్ రావు విగ్రహం మార్కెట్ వద్ద ముగుస్తుందని, దీనికి నగరంలోని వందలాదిమంది కార్యకర్తలు తరలి రావాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గ్రామ, మండల, డివిజన్ కేంద్రాలలో ఎర్ర జెండాలు ఎగురవేసి పార్టీ చరిత్రను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం రాకముందే సీపీఐ అవిర్భావించిందన్నారు. భూమి కోసం, భుక్తి కోసం బానిస సంకెళ్ల విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు అసువులు బాశారన్నారు. లక్షల ఎకరాల భూమి పేదలకు పంచామని, ఎనిమిది వేల గ్రామాలను రజాకార్ల చెర నుంచి విముక్తి పొందయన్నారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబ్ హైదరాబాద్ సంస్థానం కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా తెలంగాణలో విలీనం చేశారన్నారు. పార్టీ పోరాట చరిత్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.
బీజేపీ ప్రభుత్వం ఈపోరాట చరిత్రను హిందూ ముస్లీంల సమస్యగా వక్రీకరిస్తుందని, బిజెపి పార్టీకి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధమే లేదని ఆయన విమర్శించారు. సాయుధ పోరాట సమయంలో బిజెపి పార్టీ పుట్టుకనే లేదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని పాఠ్యాంశంగా పుస్తకాలలో చేర్చాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా కార్యకర్తలుపని చేయాలని పిలుపునిచ్చారు.
ఈసమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు కార్యవర్గ సభ్యులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్,బీర్ల పద్మ, కొట్టే అంజలి, గామినేని సత్తయ్య, ఆకునూరి రమేష్, నునావత్ శ్రీనివాస్, కూన రవి, బాకం ఆంజనేయులు, సంపత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.