భద్రాచలం నేటి ధాత్రి
అవినీతి మయంగా రేగుబల్లి ఇసుక ర్యాంపు.
ఆధారాలు ఇచ్చిన అధికారుల చర్యలు శూన్యం.ఓ ప్రముఖ వ్యక్తి మధ్యర్తిత్వంలో ర్యాంపు నిర్వహణ.
అంతా డొల్లే.. అయినా పట్టించుకోని అధికారులు.
జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలు చర్యలు తీసుకోవాలి
భద్రాచలం నియోజకవర్గం లోని దుమ్మగూడెం మండలం రేగు బల్లి గ్రామంలో ప్రభుత్వం నందలుచలక గ్రామపంచాయతీ లోని కొంతమంది గిరిజన వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న ఇసుక సొసైటీకి ర్యాంపు నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పారు. ఈ ర్యాంపు వరదలకు ముందు నుండి అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది ఇసుక వ్యాపారులు భద్రాచలం పట్టణంలోని ఓ ప్రముఖ వ్యక్తి కలిసి గిరిజనుల వద్ద నుండి ర్యాంపు తీసుకొని నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూన్ నెలలోనే నియమ నిబంధనలకు విరుద్ధంగా గోదావరి నదిలోకి ప్రోక్లైన్ల ద్వారా ఇసుకను తవ్వి లారీలలో ఒడ్డు పైకి చేర్చి డంపు చేస్తున్నారని అప్పటి తాసిల్దార్ దుమ్ముగూడెం వారికి పూర్తి ఆధారాలతో తెలియజేసిన పట్టించుకున్న పాపాన పోలేదు. లారీల ద్వారా తమ ఇష్టం వచ్చినట్లు ఒడ్డు పైకి చట్ట విరుద్ధంగా వందలాది ట్రిప్పులను తోలి అక్రమ మార్గంలో స్టాక్ ఏర్పరచుకుంటే దానికి ఇప్పుడు ప్రభుత్వం అమ్ముకోవడానికి అనుమతులు ఇవ్వడం విడ్డూరంగా ఉంది. గిరిజనులకు జీవనోపాధి కొరకై ఇచ్చిన ఇసుకరాంప్ ను గిరిజనేతర వ్యక్తులు అక్రమ మార్గంలో నడుపుతూ కోట్ల రూపాయలను సంపాదిస్తున్నా టిఎస్ఎండిసి, రెవెన్యూ, మైనింగ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం చూస్తుంటే అందరికీ ఆమ్యామ్యాలు అందాయనే ప్రజలు చర్చించుకుంటున్నారు. అసలే కొన్ని రోజులుగా ఇసుక రాంపులలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందనే కథనాలు దర్శనమిస్తున్న అధికారులు ర్యాంపుల నిర్వహణపై తగు శ్రద్ధ చూపడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి తక్షణమే ఈ ఇసుక ర్యాంపు పై సమగ్ర విచారణ చేసి బినామీలపై కఠిన చర్యలు తీసుకొని గిరిజన ప్రజలకు న్యాయం చేకూర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.