Health Awareness Program Held in Narsampet
ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత: ఛైర్పర్సన్ లక్ష్మీరామానంద్
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏ.ఎస్.ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నర్సంపేట బాయ్స్ హైస్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్పర్సన్ లక్ష్మీరామానంద్, మున్సిపల్ కమిషనర్ భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఛైర్పర్సన్ లక్ష్మీరామానంద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిత్యం వాకింగ్, యోగా చేయడంతో పాటు క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని, లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
మున్సిపల్ కమిషనర్ భాస్కర్ మాట్లాడుతూ, మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారంలోనే ఆరోగ్యం దాగిఉందని పేర్కొన్నారు. ప్లాస్టిక్ కవర్లలో వేడి ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని, వాటికి బదులుగా బయో కవర్లను వినియోగించాలని సూచించారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కన్స్యూమర్ ఫోరం జిల్లా అధ్యక్షుడు గిరిగాని సుదర్శన్ గౌడ్, కౌన్సిలర్ పొన్నాల మనిషా, ఇన్చార్జి హెడ్ మాస్టర్ రవికుమార్, బిక్షపతి, రాంబాబు, ఏ.ఎస్.ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి తంగెళ్ల రవికాంత్, సభ్యుడు రాముసేవక్, విద్యార్థులు పాల్గొన్నారు.
