అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి..

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి..

మిషన్ భగీరథ మంచినీటి పంపిణీ వ్యవస్థలో ఆటంకాలు తొలగించండి..

సింగూర్ డ్యాం మరమ్మత్తు సమయంలో ప్రతి గ్రామానికి మంచినీరు అందించేలా ప్రత్యేక ప్రణాళిక..

త్వరలో తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

పటాన్చెరు, గుమ్మడిదల మండలాల పరిధిలోని గ్రామపంచాయతీలలో నూతన అభివృద్ధి పనులకు ప్రణాళిక..

సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..

పఠాన్ చేరు, నేటి ధాత్రి :

పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని.. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు..బుధవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు, బండ్లగూడ పరిధిలోని దోషం చెరువులలోకి మురుగనీరు చేరకుండా చేపడుతున్న ప్రత్యేక పైప్ లైన్ పనుల పురోగతిపై చర్చించారు. క్షేత్రస్థాయిలో పైపులైన్ నిర్మాణ పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయని.. త్వరితగతిన పూర్తిచేసేలా సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించాలని జిహెచ్ఎంసి ఇరిగేషన్ విభాగం ఈఈ మల్లేష్ ను ఆదేశించారు. పటాన్చెరు సాకి చెరువు, రామచంద్రాపురం రాయసముద్రం చెరువుల సుందరీకరణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. నిధుల అంశంలో ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకొని రావాలని.. ఉన్నతాధికారులతో చర్చించి నిధులు మంజూరు చేయిస్తానని అధికారులకు సూచించారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారం రెవిన్యూ పరిధిలో పాలిటెక్నిక్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలకు త్వరలోనే భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబోతుందని తెలిపారు. భవనాల నిర్మాణాలకు సైతం నిధులు కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు.
నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న మంచినీటి పంపిణీ అంశంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని..ప్రజల నుండి ఫిర్యాదులు అందుతున్నాయని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి విభాగం అధికారులతో సమన్వయం చేసుకుంటూ మంచినీటి పంపిణీ అంశంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ ఎస్ ఈ రఘువీర్ ను ఆదేశించారు. పరిశ్రమలకు మంచినీరు అందించడం ఎంత ముఖ్యమో.. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి అందించడం అంతకంటే ప్రాధాన్యత అంశమని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పాటు అవుతున్న కాలనీలకు సైతం మంచినీటిని అందించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మంచినీటి పంపిణీ అంశంలో అలసత్వం వహిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులను హెచ్చరించారు. వచ్చేనెల 10వ తేదీ లోపు పంపిణీ అంశంలో గల ఇబ్బందులు పూర్తిస్థాయిలో తొలగిస్తామని సంబంధిత అధికారులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు తెలిపారు.

 

Mission Bhagiratha

డిసెంబర్ నెల నుండి సింగూర్ డ్యాం మరమ్మత్తులు చేపడుతున్న సందర్భంగా సంవత్సరం పాటు మంచినీటి పంపిణీ ఆపివేయడం జరుగుతుందని సంబంధిత అధికారులు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సింగూరు ద్వారా పంపిణీ జరుగుతున్న గ్రామాలు, పట్టణాలు, డివిజన్ల పరిధిలో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే సంబంధిత ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పటాన్చెరు మండల పరిధిలోని భానూరు, క్యాసారం, నందిగామ, గుమ్మడిదల మండల పరిధిలోని అనంతారం, కానుకుంట, కొత్తపల్లి, మంబాపూర్, నాగిరెడ్డిగూడెం, నల్లవల్లి, రామిరెడ్డి బావి, వీరారెడ్డిపల్లి, తదితర గ్రామాల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను సంబంధిత ఎంపీడీవోలు, కార్యదర్శులతో చర్చించారు. గ్రామ పంచాయతీల పరిధిలో నిధులు కొరత మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సంబంధిత కార్యదర్శులు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు సి ఎస్ ఆర్ నిధులను అభివృద్ధి పనులకు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేయాలని కోరారు. గుమ్మడిదల నుండి కానుకుంట మీదుగా నూతనకల్ వరకు రహదారి నిర్మాణ పనులను అతి త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. నూతన అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికలు సిద్ధం చేయాలని.. ప్రభుత్వంతో చర్చించి నిధులు కేటాయిస్తానని తెలిపారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కర్దనూరు, ఘనాపూర్, వెలిమెల, కొల్లూరు, తెల్లాపూర్, ఉస్మాన్ నగర్ పరిధిలో 6 కోట్ల 80 లక్షల రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు వచ్చే వారంలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీల పరిధిలో విలీనమైన గ్రామాలలో ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.
అభివృద్ధి పనుల్లో లసత్వం వహించవద్దని.. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అమీన్పూర్ మాజీ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, పటాన్చెరు ఎమ్మార్వో రంగారావు, పటాన్చెరు ఎంపీడీవో యాదగిరి, గుమ్మడిదల ఎంపీడీవో ఉమాదేవి, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ విజయ లక్ష్మి, డీఈలు హరీష్, శ్రీనివాస్, ఏఈ మౌనిక, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version