ప్రత్యక్షంగా చూస్తూ. ..ఆసక్తి కనబరుస్తూ… ఆకట్టుకున్న బర్డ్స్ ఫెస్టివల్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

అటవీ శాఖ, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (WWF), నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ (NCF) సంయుక్తంగా మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిది లో గల బొక్కల గుట్ట సమీపంలోని గాంధారి వనం, గాంధారి ఖిల్లా లో శనివారం బర్డ్స్ ఫెస్టివల్ నిర్వహించారు.ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, మంచిర్యాల కస్తూర్బా పాఠశాల విద్యార్థులు, ములుగులోని అటవీ కళాశాల విద్యార్థులు వివిధ బృందాలుగా విడిపోయి అనేక రకాల పక్షులను వీక్షించారు.పలు రకాల పక్షులను ప్రత్యేక్షంగా చూస్తూ ఆసక్తిగా కొనసాగిన ఈ బర్డ్స్ ఫెస్టివల్ ఎంతగానో ఆకట్టుకుంది. WWF, NCF ప్రతినిధులు హర్ష త్రివేని, అమృత, సమాక్షి లు ఇక్కడికివిచ్చేసిన వారికి వివిధ రకాల పక్షులను చూపిస్తూ వాటి వివరాలను వివరించారు. పక్షుల కిలకిలా రాగాలు వింటూ వాటిని ప్రత్యక్షంగా చూస్తూ వాటి జీవ వైవిధ్యం గురించి తెలుసుకున్నారు. పక్షులు పర్యావరణానికి ఏ విధంగా మేలు చేస్తాయో, వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఇలాంటి బర్డ్స్ ఫెస్టివల్స్ వల్ల తెలియని విషయాలు తెలుసుకోవచ్చని, తద్వారా వాటిని కాపాడుకోవాలనే చైతన్యం వస్తుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో అటవీ రేంజ్ అధికారులు అప్పలకొండ, శివకుమార్ ,ప్లాంటేషన్ మేనేజర్ జి.సురేష్ కుమార్,ఇంచార్జి రేంజ్ అధికారి సుభాష్, డిప్యూటీ రేంజ్ అధికారులు హాఫిజూద్దీన్, సంతోష్, ఎఫ్ ఎస్ ఓ, బీట్ అధికారులు రామకృష్ణ, పోశెట్టి, సతీష్ సిబ్బంది పాల్గొన్నారు.