
# తెలంగాణ ఉద్యమ కేంద్రంగా కాకతీయ యూనివర్శిటీ.
# బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్.
నర్సంపేట,నేటిధాత్రి :
తెలంగాణ ప్రాంతంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న కాకతీయ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ పోస్టుకు స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ఉద్యమ నేత బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లాలో ఉన్న కేయూ వీసీ నియామకం కోసం సెర్చ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈ నేపథ్యంలో కాకతీయ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ నియామకం కోసం సెర్చ్ కమిటీ శుక్రవారం సమావేశం కానున్నది అని సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించి మాట్లాడారు.సెర్చ్ కమిటీలోని ముగ్గురు సభ్యుల్లో కాకతీయ యూనివర్సిటీ నామినీగా జెఎన్టియు రిటైర్డ్ వీసీ ప్రొఫెసర్ ఆవుల దామోదర్, విద్యా శాఖ నుంచి జమ్ము యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సంజీవ్ జైన్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎస్ శాంతి కుమారి నియామకం చేశారని చెప్పారు. వరంగల్ కాకతీయ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ కోసం 158 మంది దరఖాస్తు చేసుకోగా కేయూ నుంచి పోటీలో ఉన్న నలుగురు ప్రొఫెసర్లు ఉన్నారు.గతంలో ఇదే కాకతీయ యూనివర్శిటీలో సేవలందించి వీసీ కోసం దరఖాస్తు చేసుకున్న 8 మంది రిటైర్డ్ ప్రొఫెసర్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ కేంద్రంగా ఉన్న కాకతీయ యూనివర్సిటీకి వీసీల నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వరా.. అని పెద్ది ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన వీసీల నియామకం చేస్తున్నారో బహిరంగంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమ రణ కేంద్రం కేయూకు వీసీల నియామకాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు.