
IVPA Urges Govt to Lift GST Refund Restrictions on Cooking Oils
వంటనూనెల జీఎస్టీ రీఫండ్స్‌పై విధించిన ఆంక్షలు ఎత్తేయండి.. ఐవీపీఏ విజ్ఞప్తి
వంటనూనెలకు సంబంధించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ రీఫండ్‌పై ఆంక్షలను ఎత్తేయాలని ఇండియన్ వెజిటెబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ ఆంక్షల వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయని తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: వంటనూనెలకు సంబంధించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రీఫండ్స్‌పై విధించిన ఆంక్షలను ఎత్తేయాలని వెజిటెబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐవీపీఏ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రీఫండ్స్ లేని కారణంగా వర్కింగ్ క్యాపిటల్, నగదు లభ్యత తగ్గి చిన్న,మధ్య తరహా సంస్థలు ఇబ్బంది పడుతున్నాయని పేర్కొంది. ఈ రంగంలో పెట్టుబడులు తగ్గుతున్నాయని కూడా పేర్కొంది.
రీఫండ్స్‌కు సంబంధించి జీఎస్టీ కౌన్సిల్ 2022 జులైలో ఆంక్షలు విధించిందని ఐవీపీఏ తెలిపింది. వంటనూనెలకు సంబంధించి ఇన్వర్టెడ్ సుంకాలు, ఆంక్షల కారణంగా తమ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుకుపోతున్నాయని తెలిపింది. ఫలితంగా నగదు లభ్యత తగ్గుతోందని, ఇది చిన్న, మధ్య తరహా సంస్థలపై ప్రభావం చూపుతోందని పేర్కొంది. ‘వర్కింగ్ క్యాపిటల్‌కు కొరత ఏర్పడుతోంది. నగదు లభ్యతకు అవాంతరాలు పెరుగుతున్నాయి. కార్యకలాపాలు నిర్వహించడం కష్టంగా మారింది’ అని ఐవీపీఏ ఓ ప్రకటనలో తెలిపింది.
రీఫండ్స్ లేని కారణంగా ఈ అదనపు ధరాభారం వినియోగదారులకు బదిలీ కావడంతో వంట నూనెల రేట్లు పెరుగుతున్నాయని ఐవీపీఏ తెలిపింది. రేట్లు తట్టుకోలేక కొందరు వినియోగదారులు తక్కువ నాణ్యత గల ప్రత్యామ్నాయాలవైపు మళ్లుతున్నారని తెలిపింది. బటర్, నెయ్యి వలెనే వంటనూనెలకు సంబంధించి ట్యాక్స్ క్రెడిట్స్ రీఫండ్ తక్షణం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రీఫండ్స్ విధానంలో సుస్థిరత వస్తే దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం కూడా తగ్గుతుందని ఐవీపీఏ తెలిపింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, 2030-31 నాటికి దేశంలో వంటనూనెలకు డిమాండ్ 30 మిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉంది. ఆహార నూనెల మార్కెట్ 2023-28 మధ్య కాలంలో 5.26 వార్షిక వృద్ధి రేటుతో పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సహేతుకమైన రీఫండ్ పాలసీ దేశంలో ఆహారభద్రతకు బాటలు వేస్తుందని కూడా ఐవీపీఏ పేర్కొంది.