Bellampalli Municipal Development Budget Approved
బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి,నేటి ధాత్రి:
జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి అందరం సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన బడ్జెట్ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య,బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్,బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్,మున్సిపల్ కమిషనర్ సంపత్,చైర్ పర్సన్ దావ స్వాతి, వైస్ చైర్ పర్సన్ సత్యనారాయణ లతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని తెలిపారు.మున్సిపల్ పరిధిలో వివిధ విభాగాలలో పని చేస్తున్న సిబ్బందికి సకాలంలో వేతనాలు అందించాలని,ఈ మేరకు మున్సిపల్ పరిధిలోని ఇంటి పన్ను, ఇతర పన్నులను 100 శాతం వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించేందుకు డి ఎం ఎఫ్ టి నిధుల నుండి ఆటోలు అందించడం జరిగిందని తెలిపారు.బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధికి సి.ఎస్.ఆర్. నిధుల నుండి 2 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.మున్సిపల్ పరిధిలోని అంతర్గత రహదారులు,మురుగు కాలువల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని,విద్యుత్ బిల్లులు తగ్గించే ఆలోచనలో భాగంగా సోలార్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో నిరంతరం త్రాగునీటిని సరఫరా చేసేందుకు పనులు కొనసాగుతున్నాయని, ముల్కల్ల నుండి నీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని,శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో సమృద్ధిగా నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.మున్సిపల్ పరిధిలోని వార్డులలో సిబ్బంది కొరత ఉన్నట్లయితే సమకూర్చుకునేందుకు పాలకవర్గం సమన్వయంతో చర్యలు తీసుకోవచ్చని,ప్లాస్టిక్ వ్యర్ధాలను నిబంధనల ప్రకారం విక్రయించి మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చడం జరుగుతుందని తెలిపారు.మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లలో షాపులు తీసుకున్న వారి వద్ద నుండి అద్దె క్రమం తప్పకుండా వసూలు చేయాలని, ఖర్చులు తగ్గించి ఆదాయం పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.2026-27 సంవత్సరానికి గాను అంచనా బడ్జెట్ 32 కోట్ల 42 లక్షల రూపాయల అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారని, ఇందులో 4 కోట్ల 77 లక్షల రూపాయలు సాధారణ ఆదాయం ( గ్రాంట్లు కాకుండా), 26 కోట్ల 28 లక్షల రూపాయల గ్రాంట్లు, 81 లక్షల రూపాయల డిపాజిట్లు, అడ్వాన్సులు, 55 లక్షల రూపాయల నిలువ ఉంటుందని తెలిపారు.
అన్ని రంగాల అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపు – ఎమ్మెల్యే వినోద్
బెల్లంపల్లి శాసనసభ్యులు మాట్లాడుతూ బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 34 వార్డులలో 1 సంవత్సర కాలంలో మురికివాడలను పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా అందరి సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.మున్సిపల్ అభివృద్ధి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని,మున్సిపల్ పరిధిలోని పారిశుద్ధ్యం,ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ,ప్రజా సమస్యల పరిష్కారంపై పాలకవర్గ సభ్యులు జవాబుతారీతనంతో వ్యవహరించాలని తెలిపారు.మున్సిపల్ పరిధిలోని అన్ని రంగాలను అభివృద్ధి చేసే విధంగా బడ్జెట్ కేటాయించడం జరుగుతుందని,ఆయా కేటాయింపుల ప్రకారంగా నిధులను వినియోగించి అభివృద్ధి చర్యలు చేపట్టాలని తెలిపారు.నియోజకవర్గ పరిధిలోని అర్హత గల ప్రతి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డుల కౌన్సిలర్లు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
