నడుద్దాం.. ఆరోగ్యంగా ఉందాం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T115958.536.wav?_=1

 

నడుద్దాం.. ఆరోగ్యంగా ఉందాం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకొనే వరకూ ఉద్యోగమో, వ్యాపారమో, ఉరుకులు, పరుగుల జీవితాన్ని గడుపుతుంటాం. బిజీ లైఫ్‌లో బైక్‌, ఆటో, బస్సు, రైళ్లు ఇలా దూరాన్ని బట్టి ప్రయాణాలు చేస్తుంటాం. వీధి చివర్లో ఉండే కిరాణా దుకాణానికి కూడా బండి వాడుతుంటాం. నడవటానికి అవకాశం ఉన్నాకానీ బండే వాడుతుంటాం. అందువల్లే ఊబకాయం, కొలెస్ట్రాల్‌, బిపి, మధుమేహం వంటి వ్యాధుల బారినపడుతుంటాం. అలాకాకుండా దగ్గర పనులకు నడిస్తే శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రతిరోజూ నడవటం వల్ల శరీరంలో ఉండే చెడు వ్యర్థాలు పోయి ఆరోగ్యంగా తయారవుతాం. ఫిట్‌గా ఉంటాం. అందుకే డాక్టర్లు క్రమం తప్పకుండా నడక లేదా వ్యాయామం చేయాలని సూచిస్తుంటారు. నడక వల్ల ఒనగూరే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.

 

నడక అందరూ చేయదగిన వ్యాయామం. చాలా తేలిక కూడానూ. సహజమైన, ఎప్పుడైనా, ఎక్కడైనా చేయటానికి వీలైన, తేలికైన వ్యాయామం. మధుమేహ రోగులు నడిస్తే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. నడక వల్ల వచ్చే ప్రయోజనాలు తెలిసినా కొందరు పొద్దున్నే లేవాలా? అంటూ బద్దకిస్తుంటారు. రోజువారీ పనుల్లో అలసిపోయి వచ్చామనే పేరుతో సమర్ధించుకుంటుంటారు. కాసేపు సేద తీరటానికి టీవీ చూడటంలో తప్పులేదు. పని ప్రదేశంలో కంప్యూటర్‌ ముందు, లేదా కాలక్షేపంగా టీవీ ముందు గంటల తరబడి కూర్చోవటం ఏమాత్రం మంచిది కాదు. టెలివిజన్‌లో సీరియల్స్‌, సినిమాలు, ఆటలు వంటివి ప్రసారాలు చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో చిరుతిండ్లు, ఒక్కోసారి భోజనాలు సైతం చేసేస్తుంటారు. ఇలా చేస్తే ఎంత తిన్నామో తెలియదు. అధునాతన టెక్నాలజీ, కమ్యూనికేషన్‌ వ్యవస్థ పెరిగిన క్రమంలో ఆర్డరు పెడితే ఇంటికే సరుకులు, ఆహార పదార్థాల పార్శిళ్లు వచ్చేస్తున్నాయి. కారణాలు ఏమైనా గతంలో మాదిరిగా శ్రమశాతం తగ్గింది. ఫలితంగా ఎక్కువమంది రక రకాల రోగాలతో బాధపడుతున్నారు.

ప్రశాంతంగా నడవండి

 

 

ఈ ఉరుకులు, పరుగుల జీవితంలో కాస్త సమయం కేటాయించి నడక ప్రారంభిస్తే క్రమేణా అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. ‘నడకే మనిషికి మంచి ఆరోగ్యం’ అని పెద్దలు అంటుంటారు. వ్యాయామం చేసినా, ఆటలు ఆడినా, నడక నడిచినా, పరుగెత్తినా ఎంతోకొంత ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే ఇది క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఉదయమో, సాయంత్రమో చేయాలి. శరీరంలో ఉండే కొవ్వు, ఇతర వ్యర్థాలు కొంతమేరకు చెమట రూపంలో పోతాయి. శరీరం దృఢంగానూ, ఆరోగ్యం మెరుగ్గానూ మారుతుంది. ఎక్సర్‌సైజుల్లో నడకను మించిన తేలికపాటి వ్యాయామం మరొకటి లేదు. ఏ వయస్సు వారైనా ఎప్పుడైనా, ఎక్కడైనా నడకను కొనసాగించొచ్చు. దీనికోసం పైసా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. మిగతా వ్యాయామాల కన్నా సురక్షితం కూడాను. నడక వలన బరువు తగ్గటంతోపాటు ఎన్నో ఉపయోగాలు, మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నడక-దానివల్ల కలిగే ఉపయోగాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒత్తిడి తగ్గుతుంది :

 

 

 ప్రతిరోజూ నడవటం వల్ల శరీరంలో ఉండే ఎండార్ఫిన్లు అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌, కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి. వయస్సు మీద పడటం వల్ల వచ్చే దెమెంతియా, అల్జీమర్స్‌ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

కంటిపై ఒత్తిడి దూరం :

 కంటికి సంబంధించిన పలు నాడులు కాళ్లలో ఉంటాయి. అందుకనే నడవటం వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నిత్యం నడక సాగించటం వల్ల కళ్లపై అధిక ఒత్తిడి తగ్గటంతోపాటు గ్లకోమా వంటి కంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

గుండెపోట్లు రావు :

 ప్రతిరోజూ నడిచినా, పరుగెత్తినా గుండె సమస్యలు తగ్గుతాయి. గుండెపోట్లు వంటివి రావు. హైబీపీ, కొలెస్ట్రాల్‌ వంటివి కూడా తగ్గుముఖం పడతాయి. శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది.

విష, వ్యర్థ పదార్థాలు దూరం :

 నడవటం వల్ల శరీరం ఆక్సిజన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. అదే ఆక్సిజన్‌ రక్తంలో చేరి ఊపిరితిత్తులకు చేరుతుంది. ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు, విష, వ్యర్థ పదార్థాలను ఆక్సిజన్‌ బయటకు పంపుతుంది. ఇతర ఊపిరితిత్తుల సమస్యలు కూడా దూరమవుతాయి.

అదుపులో మధుమేహం :

 మధుమేహం ఉన్న వారు నిత్యం నడిస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆరునెలలపాటు క్రమం తప్పకుండా నడక లేదా పరుగు చేసిన కొందరు మధుమేహ రోగులను పరిశీలించగా వారి రక్తం స్థాయిలో గ్లూకోజ్‌ స్థాయిలో బాగా అదుపులోకి వచ్చినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అందువల్ల రోజూ నడిస్తే మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు.

క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుంది :

 ప్రతిరోజూ కనీసం 30 నిముషాలపాటు నడిస్తే పెద్దపేగు క్యాన్సర్‌ వచ్చే ముప్పు చాలా తగ్గుతుంది. జీర్ణపక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం పోతుంది. విరేచనం రోజూ సాఫీగా అవుతుంది. ప్రతిరోజూ 100 నిముషాలపాటు వాకింగ్‌ చేస్తే అధిక బరువు నుంచి కొందవరకు తగ్గుతారని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కండరాలు కూడా దృఢంగా మారుతాయి.

కీళ్ల నొప్పులకు చెక్‌ :

 ప్రతిరోజూ నడవటం వల్ల కీళ్లు బాగా పనిచేస్తాయి. త్వరగా అవి అరిగిపోవటం జరగదు. ఎముకల్లో సాంద్రత కూడా పెరుగుతుంది. ఫ్రాక్చర్లు, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. దీనికోసం రోజూ కనీసం 30 నిముషాలపాటైనా నడవాలి. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి.

బరువు తగ్గుతుంది :

 మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఊబకాయానికి దారితీస్తున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకూ దీని బారిన పడుతున్నారు. బరువు తగ్గించుకోవటానికి మించిన వ్యాయామం లేదు. ఒక పౌండు బరువు పెరగటం అంటే అదనంగా 3500 క్యాలరీలు శరీరంలో వచ్చి చేరాయన్నమాటే. ప్రతిరోజూ క్రమం తప్పకుండా నడిస్తే వారంలో ఒకపౌండు బరువు తగ్గే అవకాశం ఉంది. ఒక మైలు దూరాన్ని 13 నిముషాల అంతకన్నా తక్కువ సమయంలో నడిస్తే క్యాలరీలను ఎక్కువగా కరిగించుకోవచ్చు. ఒక మైలు దూరం నడిస్తే వంద క్యాలరీలు ఖర్చవుతాయి.

మరికొన్ని ప్రయోజనాలు

◆:- రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

◆:- గుండె సమర్ధవంతంగా పనిచేస్తుంది.

◆:- రక్త ప్రసరణ వేగవంతం

◆:- చెమట ద్వారా రక్తంలోని మలినాలు బయటకు పోతాయి

◆:- చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి మంచిది పెరుగుతుంది

◆:- రక్తంలో గ్లూకోజు స్థాయి తగ్గుతుంది

◆:- శరీర బరువు తగ్గుతుంది

◆:- మానసిక కుంగుబాటు, ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి

◆:- కంటి నిండా నిద్రపడుతుంది

◆:-  క్యాన్సర్ల ముప్పు తగ్గుతుంది

◆:- కీళ్లు, ఎముకలు దృఢమవుతాయి

◆:- నీరసం, అలసట, నిస్సత్తువ తగ్గుతాయి

◆:-  మెరుగైన ఆత్మవిశ్వాసం, శారీరక సామర్థ్యం

◆:- మానసిక ఉల్లాసం

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version